ప్రైవేటు డెయిరీలపై సర్కారు కొరడా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు డెయిరీలపై సర్కారు కొరడా ఝులిపించనుంది. ఇష్టారాజ్యంగా పాల ధరలు పెంచి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరోధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకుల చ ట్టాన్ని పాలకు కూడా వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అవసరమైతే అందుకోసం ఆర్డినెన్స్ తేవడానికి కూడా వెనకాడకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే అమలైతే ప్రభుత్వం చెప్పిన ధరలకే ప్రైవేటు డైయిరీలు పాలను విక్రయించాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే ధరలు అధికం!
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి. పాడిని కేవలం వ్యాపారం చేసే పరిశ్రమగానే గుర్తించాయి. కర్ణాటకలో లీటర్ పాల ధర రూ.29, అహ్మదాబాద్‌లో రూ.35, ముంబైలో రూ. 38 ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ, వ్రైవేటు డెయిరీలు స్వల్పతేడాతోనే పాలను విక్రయిస్తున్నాయి. అక్కడప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకునే అవకాశం లేదు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభుత్వ విజయ పాలు లీటర్‌కు రూ. 38 ఉండగా, ప్రైవేటు డెయిరీలు రూ. 42 నుంచి రూ. 46 వరకు అమ్ముతున్నాయి.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీ ఆధ్వర్యంలోనే అన్ని పాడి సహకార సంస్థలు పనిచేసేవి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పాలు అమ్మేవి. అయితే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం వచ్చాక అనేక సహకార డెయిరీలు ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయాయి. ప్రస్తుతం అవి కొందరు రాజకీయ నేతల కనుసన్నల్లో నడుస్తూ... వారి సొంత ఆస్తులుగా చలామణి అవుతున్నాయి.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. అంతేకాక అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ పాలనే సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ఆగకుండా ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు వేయాలని నిర్ణయించింది. సామాన్యుడికి పాల ధర అందుబాటులో ఉంచేందుకు నిత్యావసర సరుకుల చట్టం కిందకు పాలను తీసుకొచ్చి పాల ధరలను ప్రభుత్వమే నిర్ణయించేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలమేరకు అధికారులు న్యాయపరమైన అంశాలపై తాజాగా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించినట్లు తెలిసింది.
న్యాయశాఖతో సంప్రదింపుల అనంతరం పాలను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇదే జరిగితే అన్ని డెయిరీల పాల ధరలు ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. తద్వారా పాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.