కష్టాల్లో ఉన్నవారికి రూ.10లక్షలు ఇస్తే రూ.44లక్షలు సాయం చేస్తామని నమ్మించిన ముఠా
నకిలీ నోట్లు అంటగట్టేందుకు ప్రయత్నం
ఏలూరులో ఇద్దరు అరెస్టు.. రూ.47లక్షల నకిలీ నోట్ల స్వాదీనం
ఏలూరు టౌన్: తమకు దేవుడు డబ్బులు ఇస్తాడని, వాటితో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తామని నమ్మించి కొంత మొత్తం అసలు నోట్లు తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఏఎస్పీ జి.స్వరూపరాణితో కలిసి ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఏలూరులో 108 అంబులెన్స్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దొండపాటి ఫణికుమార్‌కు జూలై 28న ఒక వ్యక్తి ఫోన్ చేసి తాము కష్టాల్లో ఉన్నవారికి ఆరి్థక సాయం చేస్తామని పరిచయం చేసుకున్నాడు. తమకు దేవుడు డబ్బులు పంపిస్తాడని, అలా పంపిన వాటిలో రూ.44లక్షలు ఉన్నాయని, ఈ మొత్తం కావాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని చెప్పాడు.
ఇలా కొంత డబ్బు తీసుకుని నాలుగు రెట్లు ఎక్కువగా ఇవ్వడాన్ని తమ పరిభాషలో బ్యారిస్ అని అంటారని వివరించాడు. ఈ డబ్బులు ఎక్కువ రోజులు తమ వద్ద ఉండవని, ఆలస్యం చేస్తే మాయమైపోతాయని తెలిపాడు. వెంటనే డబ్బులు తీసుకుని బ్యాంకులో వేసుకోవాలని సూచించాడు. అయితే తన వద్ద అంత డబ్బులు లేవని ఫణికుమార్ చెప్పగా, కొంత అడ్వాన్స్‌గా ఇవ్వాలని, అనంతరం మిగిలిన సొమ్ము తీసుకురావాలని సూచించాడు. రూ.44లక్షలు వస్తాయనే ఆశతో ఫణికుమార్ జూలై 30వ తేదీన ఫోన్ చేసిన వ్యక్తిని, మరికొందరిని కలిసి రూ.3 లక్షలు ఇచ్చాడు.
మిగిలిన డబ్బులు కూడా సిద్ధం చేసుకోవాలని ఆ ముఠా సభ్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఫణికుమార్ తన స్నేహితుల వద్ద ప్రస్తావించగా, వారు మోసం చేస్తున్నారని వివరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఫణికుమార్ శనివారం ఆ ముఠాకు ఫోన్ చేసి మిగిలిన డబ్బులు తీసుకువస్తున్నానని, ఏలూరు కొత్త బస్టాండ్ వెనుక రైల్వే ట్రాక్ రోడ్డు వద్దకు రావాలని కోరాడు. అదేవిధంగా ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీఐ కే.శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టారు.
అక్కడికి వచ్చిన నకిలీ కరెన్సీ ముఠా సభ్యుడు చింతలపూడి మల్లాయిగూడెం ప్రాంతానికి చెందిన మారుమూడి మధుసూదనరావు, కారు డ్రైవర్ గప్పలవారిగూడేనికి చెందిన బిరెల్లి రాంబాబును అరెస్ట్ చేశారు. వారి నుంచి 94 కట్టల నకిలీ 500 నోట్లు రూ.47లక్షలు, ఒక సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిద్దరూ నకిలీ కరెన్సీ ముఠా వద్ద ఉంటూ మార్కెట్‌లో నకిలీ నోట్లు మారి్పడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment