mother dairy
-
గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు
లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్‌నగర్ మదర్ డెయిరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నూతన చైర్మన్‌గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్‌రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు. -
సామాన్యులకు షాక్.. పాల ధర రూ.2 పెంపు, ఈ ఏడాదిలో ఐదోసారి!
న్యూఢిల్లీ: ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ధరను రూ.2 పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం (డిసెంబర్ 27) నుంచి ఈ పాల ధర పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే, ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్ల ఎంఆర్పీ (MRP)లో ఎటువంటి పెంపు ఉండదని పేర్కొంది. ఈ సంస్థ రెండు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి కాగా, ఏడాది వ్యవధిలో ఇది ఐదోసారి. డెయిరీ ఫుల్క్రీమ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.2 పెంచడంతో రూ.66 చేరకోగా, టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.51 నుంచి రూ.53కి చేరుకుంది. డబుల్ టోన్డ్ పాల ధర లీటరుకు రూ.45 నుంచి రూ.47కి పెరిగింది. అయితే ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా పాల ధరల పెంపు సామాన్యుల గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. పాడి రైతుల నుంచి కంపెనీకి ముడి పాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. కారణం ఏదైన ఈ పాల ధరల పెంపు సామాన్యులకు కొంత భారంగానే మారనున్నాయి. Mother Dairy hikes milk rate by Rs 2/litre effective from tomorrow There is no revision in the MRP of Cow Milk and Token Milk variants. pic.twitter.com/SXoQ8sbqBS — ANI (@ANI) December 26, 2022 చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
పెరిగిన మదర్‌డెయిరీ పాల ధరలు..రేపట్నుంచి అమల్లోకి
ప్రముఖ పాలపంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ- ఎన్సీఆర్ (National Capital Region) పరిధిలో లీటర్ పాలపై రూ.1 లీటర్ విడిపాల (token milk) ధర రూ.2 పెంచింది. దీంతో పెరిగిన ధరలతో ఫుల్ క్రీమ్ (వెన్నతీయని) పాల ధర రూ.64, విడి పాల ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది. కాగా, అర లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధరల్ని యథాతథంగా ఉంచుతున్నట్లు మధర్ డైరీ ప్రతినిధులు తెలిపారు. ఇక తాజాగా పెరిగిన పాల ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. -
సామాన్యుడిపై మరో పిడుగు, పాల ధర పెంపు
ముంబై: అమూల్ లేదా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తాజాగా పాల ధరలను పెంచేసింది. లీటరుకు రెండు రూపాయల చొప్పున ధరలను పెంచింది. మదర్ డెయిరీ కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. రెండు కంపెనీల సవరించిన ధరలు రేపటి నుంచి (బుధవారం, ఆగస్టు 17) అమలులోకి రానున్నాయి. పలితంగా ఇప్పటికే కూరగాయలు, ఇంధనధరలతో అష్టకష్టాలుపడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగుపడినట్టైంది. పాల ధరను రూ. 2 పెంచడం వల్ల ఎంఆర్‌పిలో 4 శాతం పెంపు ఉంటుందని అమూల్ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ,సౌరాష్ట్ర మార్కెట్స్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైతోపాటు అమూల్ తాజా పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్లలో ఈ సవరించిన ధరలు అమల్లో ఉంటాయని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా అమూల్ గోల్డ్ ధర 500 మి.లీ రూ. 31, అమూల్ తాజా 500 మి.లీ రూ. 25, అమూల్ శక్తి 500 మి.లీ ధర రూ. 28లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మదర్ డెయిరీకి సంబంధించి, ఫుల్క్రీమ్ మిల్క్‌పై లీటరుకు రూ.59 ఉండగా, బుధవారం నుంచి రూ.61కి చేరింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కిపెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45గా ఉండనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది. మొత్తం నిర్వహణ వ్యయం , ఉత్పత్తి ఖర్చులు పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, తబ సభ్య సంఘాలు కూడా గత ఏడాది కంటే రైతుల ధరలను 8-9 శాతం వరకు పెంచాయని అమూల్ తెలిపింది. -
సామాన్యులకు మరో షాక్, పెరిగిన పాలధర..నిన్న అమూల్, నేడు మరో కంపెనీ!!
దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు సామాన్యుడికి మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. రోజుల వ్యవధిలో పాల ఉత్పత్తి సంస్థలు పాల ధరల్ని పెంచడంలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాల ధరలను రూ.2పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించగా.. తాజాగా దేశవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్న మదర్ డెయిరీ సైతం పాల ధరను ఢిల్లీలో రూ.2 పెంచుత్నుట్లు ప్రకటించింది. పెరిగిపోతున్న రవాణాతో పాటు ఇతర ఖర్చుల కారణంగా పాల ధరల్ని పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. పెరిగిన ఈ కొత్త ధర ఢిల్లీలో ఆదివారం (రేపే) నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మదర్ డెయిరీ లీటర్ పాల ధర ఢిల్లీలో రూ.57 ఉండగా రేపటి నుంచి రూ.59కి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ►టోన్డ్ మిల్క్ ధరలు రూ.49కి పెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.43కి పెరుగుతుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.49 నుండి రూ.51కి పెరిగింది . ►బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ.44 నుంచి రూ.46 కి పెంచబడింది . ►హర్యానా, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో కూడా పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచింది. ►ఈ ఎంపిక చేసిన ప్రాంతాలకు మించిన మార్కెట్లు దశలవారీగా సవరించబడతాయి. చదవండి: భారీగా పెరిగిన అమూల్ పాల ధర.. రేపటి నుంచే కొత్త రేటు -
పాల ధర పెంచేసిన మదర్ డెయిరీ
మదర్ డెయిరీ పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచింది.మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్‌కు రూ.2, అరలీటర్‌కు రూ.1 రూపాయి చొప్పు పెరగనుంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలు పెంచుతున్నట్టు మదర్ డెయిరీ తెలిపింది. పాలు సేకరణ ధరలు గత 3-4 నెలల పెరుగుదలపై నిరంతరాయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా పశుగ్రాసం వ్యయం 15-20 శాతం పెరగడం,లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టోకెన్ మిల్క్ లేదా బల్క్ వెండర్ మిల్క్ ధరలను పెంచడం లేదు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్‌కు ఇది వర్తిస్తుంది. కొత్త రేటు ప్రకారం,వెన్న శాతం అధికంగా ఉండే పాల ధర లీటరు, 53 రూపాయలుగాను, అర లీటరు ధర రూ. 27 గాను వుంటుంది. పూర్తిస్థాయి క్రీమ్ (ప్రీమియమ్) పాలు లీటరుకు 55 రూపాయలు, అర లీటరు రూ.28 గాను వుంటుంది. డబుల్ టోన్ మిల్క్ (లైవ్ లైట్) ధరను 34 రూపాయల నుంచి లీటరుకు 36 రూపాయలకు పెరిగింది. అరలీటరు ధర 18 నుంచి 19 రూపాయలకు పెరిగింది. స్కిమ్డ్ అరలీటరు పాల ధరను కూడా ఒక రూపాయి( రూ.20 నుంచి 21 రూపాయలకు) పెంచింది. అయితే అరలీటరు ఆవు పాల ధరను ఒక రూపాయి పెంచింది. కానీ, లీటరు ధరలో లాంటి మార్పు లేదు. కాగా ఇప్పటికే అమూల్ పాల ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్‌కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అముల్, మదర్ డైరీ పాలల్లో లోపాలు
న్యూఢిల్లీ: అముల్, మదర్ డైరీలు సహా పలు కంపెనీల పాలల్లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ పరీక్షల్లో తేలింది. ఈ పాలు శ్రేయస్కరం కావని చెప్పడం లేదనీ, నాణ్యత తక్కువగా ఉన్నాయని మాత్రమే చెబుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం వివరించారు. ప్రముఖ, స్థానిక బ్రాండ్లు సహా ఢిల్లీ వ్యాప్తంగా 165 పాల నమూనాలను పరీక్షించగా వాటిలో అముల్, మదర్ డైరీలు సహా మొత్తం 21 నమూనాల్లోని పాలు తక్కువ నాణ్యతను కలిగిఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. కంపెనీలు పాలపొడితో పాలను కల్తీ చేస్తున్నట్లు తేలిందన్నారు. అధికారిక వివరాలు, నివేదికలు ఇంకా తమ వద్దకు రానందున దీనిపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని అముల్, మదర్ డైరీల ప్రతినిధులు చెప్పారు. -
ఈ సమ్మర్లో ఐస్ క్రీంలు..కొంచెం ఖర్చెక్కువే
ఐస్‌క్రీమ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి... వేసవికాలంలో అలా చల్లచల్లగా ఓ ఐస్‌క్రీమ్ తింటే చాలు, మొత్తం కూల్ అయిపోతాం. అందుకే అన్ని కాలాల్లో కన్నా వేసవిలో దీనికి డిమాండ్ ఎక్కువ. కానీ ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ తిన్నాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందేనట. ఎందుకంటే ఐస్ క్రీమ్ తయారీ ఖర్చులు గతేడాది కంటే ఈ ఏడాది బాగానే పెరిగిపోయాయట. ఐస్ క్రీమ్‌లో వాడే స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్ ధర గతేడాది కేజీకి రూ.140 ఉంటే, ప్రస్తుతం రూ.240కు ఎగిసింది. అంతేకాక ఐస్‌క్రీమ్ తయారీకి వాడే మరో కీ పదార్థం చెక్కర ధరలు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది కంటే ఈ ధరలు 30 నుంచి 40 శాతం పెరగడంతో కంపెనీలకు ఐస్ క్రీమ్ ఇన్‌ఫుట్ కాస్ట్‌లు పెరిగిపోయాయట. దీంతో దేశంలోనే అతిపెద్ద ప్లేయర్, అమూల్ ఐస్ క్రీమ్‌లు అమ్మే గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) ఐస్ క్రీం ధరలను 5-8 శాతం పెంచేసింది. మరో లీడింగ్ సంస్థ వాదిలాల్ ఇండస్ట్రీస్ కూడా ఈ ధరలను 6 నుంచి 8 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. రెండు ప్రధాన పదార్థాలు మిల్క్ సాలిడ్స్, షుగర్ ధరలు పైకి ఎగియడంతో తమ తయారీఖర్చు సగటున 5-6 శాతం పెరిగినట్టు వాదిలాల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గాంధీ చెప్పారు. మదర్ డైరీ కూడా ఐస్ క్రీమ్ ధరలను 5 శాతం పెంచుతోంది. మొత్తంగా తయారీఖర్చులు పెరిగిపోవడంతో ఐస్ క్రీమ్ ధరలను పెంచనున్నామని కంపెనీలు చెబుతున్నాయి. -
హైదరాబాద్‌లో మదర్ డెయిరీ ఆవు పాలు
♦ అర లీటర్ ప్యాక్ ధర రూ.20 ♦ ఈ ఏడాది రూ.8,500 కోట్ల టర్నోవర్ ♦ కంపెనీ బిజినెస్ హెడ్ సందీప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న మదర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో ఆవు పాలను అందుబాటులోకి తెచ్చింది. అర లీటరు ప్యాక్ ధర రూ.20. కొద్ది రోజుల్లో 200 ఎంఎల్, లీటరు ప్యాక్‌లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కంపెనీ ఇక్కడ ప్యాకెట్ పాలను విక్రయిస్తోంది. 2-7 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆవు పాలు మంచివని మదర్ డెయిరీ పాల విభాగం బిజినెస్ హెడ్ సందీప్ ఘోష్ చెప్పారు. మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ అభిజిత్, సౌత్ సేల్స్ డీజీఎం భ్రహ్మయ్య పాటూరితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 23 రకాల నాణ్యతా పరీక్షలు జరిపిన తర్వాతే కస్టమర్‌కు చేరుస్తామని, తెలంగాణ నుంచే ఆవు పాలను సేకరిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో ప్లాంటు..: దక్షిణాదిన మదర్ డెయిరీకి తిరుపతిలో ప్లాంటుంది. ఇక్కడి నుంచి పాలను సేకరించి తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 55,000 లీటర్ల పాలను కంపెనీ విక్రయిస్తోంది. హైదరాబాద్‌లో వాటా పెంచుకోవాలని చూస్తున్న మదర్ డెయిరీ... అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోగానే ప్లాంటు నెలకొల్పాలని భావిస్తోంది. 2015-16లో కంపెనీ ఆదాయం రూ.7,000 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్లను లక్ష్యంగా చేసుకుంది. -
పాల ధరలు పెరుగుతాయా..?
♦ ఇప్పటికే రూ.2 పెంచిన అమూల్, మదర్ డెయిరీ ♦ రవాణా ఖర్చులు చూపుతూ ఇతరులూ అదే బాటలో!! ♦ పాల ధర పెరిగినా రైతుల సేకరణ ధర అంతంతే ♦ అధికమైన దాణా రేట్లతో పాడి రైతులకు నష్టాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పాల ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ సహకార దిగ్గజం ‘అమూల్’ లీటరుకు రూ.2 వరకూ పెంచటంతో... మిగిలిన బ్రాండ్లు కూడా పెంచే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమూల్ బాటలోనే మదర్ డెయిరీ కూడా లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్రాండ్ల టోన్డ్ మిల్క్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.40కి చేరింది. ప్రస్తుతం కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఒక్కటే నందిని బ్రాండ్‌తో టోన్డ్ మిల్క్‌ను లీటరు రూ.36 చొప్పున విక్రయిస్తోంది. మార్కెట్లో అతి తక్కువ ధర దీనిదే. ప్రభుత్వ రంగంలోని సహకార సంస్థ విజయ డెయిరీ కూడా విజయ పాలను లీటరు రూ.38 చొప్పున విక్రయిస్తోంది. మిగిలిన బ్రాండ్లన్నీ రూ.40 ఆపైనే విక్రయిస్తుండగా... హెరిటేజ్ రూ.42కు విక్రయిస్తోంది. అమూల్ ధర పెంచటంతో మిగిలిన కంపెనీలు కూడా పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిస్కౌంట్ల కాలం పోయిందా!! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2015లో అమూల్, నందిని బ్రాండ్ల ప్రవేశంతో పోటీ తారస్థాయికి చేరింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్లు, ఆఫర్లతో గతేడాది పోటీపడ్డాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ గోవర్ధన్ బ్రాండ్ రూ.40 విలువగల లీటరు ప్యాక్‌పై రూ.12 విలువ చేసే 200 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ను కొన్నాళ్ల పాటు ఉచితంగా ఇచ్చింది. మదర్ డెయిరీ లిమిటెడ్ ఆఫర్ కింద లీటరు ప్యాక్‌ను రూ.33కే విక్రయించింది. కేఎంఎఫ్ నందిని స్పెషల్ పేరుతో 3.5% వెన్న కలిగిన పాలను లీటరుకు రూ.34కే విక్రయిచింది. వాస్తవానికి ఈ స్థాయిలో వెన్న ఉన్న పాలను ప్రైవేటు కంపెనీలు ఆ సమయంలోనే రూ.42-44కు విక్రయించాయి. ఇలా ధరలను తగ్గించి ఆకర్షించిన కంపెనీలు... మార్కెట్లో స్థానం పదిలం చేసుకున్నాక మళ్లీ పెంపు బాట పట్టాయి. రోజుకు 25 లక్షల లీటర్లు.. హైదరాబాద్ నగరంలో రోజుకు 25 లక్షల లీటర్ల పాలకు డిమాండ్ ఉంది. దీంతో ఈ మార్కెట్లో 100కు పైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. చాలా కంపెనీలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పాలను సేకరించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక రోజులోనే హైదరాబాద్‌కు పాలను సరఫరా చేస్తున్నామని నల్లగొండ- రంగారెడ్డి మిల్స్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చెబుతోంది. హైదరాబాద్‌లో విజయ 3.5 లక్షల లీటర్లు, హెరిటేజ్ 2.5 లక్షలు, అమూల్ 1.50 లక్షలు, మస్కతి 1.50 లక్షలు, నార్ముల్ మదర్ డెయిరీ 1.10 లక్షలు, నందిని లక్ష, రిలయన్స్ 40 వేల లీటర్ల ప్యాకెట్ పాలను ప్రతి రోజూ విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజానికి కంపెనీలు మార్కెట్లో ధరలను పెంచినా రైతులకిచ్చే పాల సేకరణ ధరను మాత్రం ఆ రీతిలో పెంచటం లేదు. ఇదే విషయం కంపెనీలను అడిగితే డీజిల్ ధర పెరగడంతో రవాణా ఖర్చులూ పెరిగాయని, అందుకే ధరలు పెంచాల్సి వచ్చిం దంటున్నాయి. ఇతర కం పెనీలూ రేట్లను పెంచే అవకాశం ఉందని నార్ముల్ చైర్మన్ జితేందర్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. నష్టాల్లో పాడి రైతులు.. కొన్ని కంపెనీలు మాత్రమే పాల సేకరణ ధరను పెంచాయి. నార్ముల్ 10 శాతం ఫ్యాట్ ఉన్న పాలకు రూ.57 చెల్లిస్తోంది. ‘‘చాలా కంపెనీలు విక్రయ ధరలను పెంచాయి కానీ సేకరణ ధరను మాత్రం పెంచలేకపోయాయి’’ అని జితేందర్‌రెడ్డి చెప్పారు. రైతులకు సబ్సిడీకే దాణా విక్రయిస్తున్నామని చెప్పారు. కాగా, ఓ ప్రైవేటు కంపెనీ 6% ఫ్యాట్‌కు రైతులకు రూ.41.40 ఇస్తోంది. సగటున ఈ ధర రూ.28 ఉందని మహబూబ్‌నగర్ జిల్లా చుక్మాపూర్ పాడి రైతు రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కాటన్ కేక్ క్వింటాలు ధర ఆరు నెలల క్రితం రూ.900 ఉండేది. ఇప్పుడు రూ.2,800 అయింది. మక్కపిండి రూ.1,500 నుంచి రూ.2,200లకు చేరింది. కాటన్ సీడ్ రూ.1,800 నుంచి రూ.2,200కు పెరిగింది. దీని పిప్పి మాత్రం రూ.2,800కు విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు మిగులుతున్నదేమీ లేదు. ప్రస్తుతమున్న సేకరణ ధరతో నష్టాలే మిగులుతున్నాయి’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కస్టమర్లు చెల్లిస్తున్న మొత్తంలో 82-85% రైతులకు ఇస్తున్నామని అమూల్ బ్రాం డ్తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. -
పాల ధర మళ్లీ పెరిగింది..
రూ.2 పెంచిన అమూల్, మదర్ డెయిరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మళ్లీ పాల ధరలు పెరిగాయి. భారత్‌లో దిగ్గజ బ్రాండ్ అయిన అమూల్ లీటరుకు రూ.2 పెంచింది. ఈ పరిణామంతో వెంటనే మదర్ డెయిరీ సైతం లీటరుకు రూ.2 అధికం చేసింది. దీంతో ఈ బ్రాండ్ల టోన్డ్ మిల్క్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.40కి చేరింది. ప్రస్తుతం నందిని బ్రాండ్ టోన్డ్ మిల్క్‌ను కర్నాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లీటరుకు రూ.36కు విక్రయిస్తుండగా, ప్రభుత్వ కంపెనీ అయిన విజయ రూ.38కి అమ్ముతోంది. ప్రైవేటు కంపెనీలు రూ.40 ఆపై ధరలోనే విక్రయిస్తున్నాయి. ధర విషయంలో అమూల్, మదర్ డెయిరీ బాటలో మిగిలిన కంపెనీలు నడుస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
మదర్ డెయిరీ మాజీ చైర్మన్ మృతి
రాజాపేట: పశుగణాభివృద్ధి సంస్థ(ఆల్డా) నల్లగొండ జిల్లా చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి(70) బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గతంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మదర్ డెయిరీ చైర్మన్‌గానూ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగుతాయని సమాచారం. -
పాడిరైతులకు అండగా మదర్ డెయిరీ
పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తూ, మంచి ధర చెల్లిస్తూ మదర్ డెయిరీ అండగా నిలుస్తోందని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (నార్మాక్స్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పాల శీతలీకరణ కేంద్రం అతిథి గృహంలో నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పాడి రైతుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాల విక్రయ మార్కెట్లో మదర్ డెయిరీ లేకుంటే ప్రైవేట్ డెయిరీల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని పేర్కొన్నారు. మూసివేయించేందుకు ప్రైవేట్ డెయిరీల కుట్ర: నార్మాక్స్ చైర్మన్ జితేందర్ రెడ్డి మదర్ డెయిరీకి నష్టాలు కల్గించి మూసివేయించాలని ప్రైవేటు డెయిరీలు కుట్రలు చేస్తున్నాయని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆరోపించారు. పాడి రైతులకు అధిక ధర ఆశ చూపించి తమవైపు తిప్పుకుంటున్న ప్రైవేట్ డెయిరీలు చివరకు వారిని మోసం చేస్తున్నాయన్నారు. గతంలో మదర్ డెయిరీ ద్వారా 2.25లక్షల లీటర్ల పాలు సేకరించేవారమని, ప్రైవేటు డెయిరీల కుట్రలతో ఇప్పుడు అది సగానికి పడిపోయిందన్నారు. ఏదేమైనా రైతుకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించే లక్ష్యంతోనే మదర్ డెయిరీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఆవు పాలపై లీటర్‌కు రూ.1.50పైసలు, గేదె పాలపై లీటర్‌కు రూ.2అదనంగా ఇన్సెంటివ్ చెల్లిస్తున్నామన్నారు. గత సీజన్లో లీటర్‌కు రూ.1 చొప్పున రైతుల నుంచి కట్ చేసిన డబ్బులు రూ.2.16 కోట్లు ఇప్పుడు తిరిగి వారికి చెల్లిస్తున్నామని తెలిపారు. అదే ప్రైవేట్ డెయిరీలు లీటర్‌కు రూ.5చొప్పున కట్ చేసి, వాటిని రైతులకు తిరిగి ఇవ్వకుండా తమవద్దే ఉంచుకున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందని, అలాగే మన రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆవుపాలపై ప్రచారం జరగాలి: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఎన్నో పోషక విలువలున్న ఆవుపాలను వ్యాపార దృక్కోణంలో చిన్నచూపు చూడటం తగదని ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఎంతో ఔషధగుణాలు ఆవు పాలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే... డెయిరీలు మాత్రం ఫ్యాట్ తక్కువగా వస్తుందనే కారణంతో తక్కువ ధర చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాల ప్రాముఖ్యతపై ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని, మదర్ డెయిరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. సమావేశంలో భాగంగా గత పాల ఉత్పత్తి సీజన్లో రైతుల నుంచి మదర్ డెయిరీ కట్ చేసిన డబ్బులను తిరిగి రైతులకు అందజేశారు. అనంతరం సహకార సంఘంలో సభ్యులైన రైతుల పిల్లల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ డెరైక్టర్ మేడిద రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.పి.బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, నార్మాక్స్ ఎండీ సురేష్‌బాబు, డీజీఎంలు విజేందర్‌రెడ్డి, రమేష్, పరిగి కేంద్రం మేనేజర్ రవీందర్ పాల్గొన్నారు. -
పాల ధరలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇప్పటికే చుక్కలనంటుతున్న ఉల్లి, కూరగాయల ధరలతో తల్లడిల్లుతున్న ఢి ల్లీవాసులకు మరో దెబ్బ. జాతీయ రాజధాని ప్రాంతం, ఢిల్లీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసే మదర్ డెయి రీ మరోసారి ధరల భారం మోపింది. ఉత్పత్తివ్యయాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పాల ధరలను బుధవారం నుంచి లీటరుకు రూ.రెండు చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తు తం లీటరు మీగడపాల ధర రూ.42 ఉండగా, ఇక నుంచి రూ.44 చెల్లించాలి. టోన్డ్పాల ధర రూ.28 నుంచి రూ.30కి చేరుకుంది. పాడిరైతులకు తగిన మద్దతుధర, పాల లభ్యత పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మదర్ డెయిరీ వివరణ ఇచ్చింది. పశువుల దాణా ధరలు విపరీతంగా పెరగడంతో తమపైనా భారం అధికమయిందని తెలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో ఈ సంస్థ నిత్యం 30 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ముంబై, లక్నో, కాన్పూర్, పుణే, ఇతర నగరాల్లో ధరలను పెంచామని మదర్ డెయిరీ తెలిపింది. అయితే ఆ ప్రాంతాల్లో ఎంత మేర పెంచిందనే విషయాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే: బీజేపీ భారీ ధరల కారణంగా ఢిల్లీవాసులు పండుగ రోజుల్లోనూ పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంటోందని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు ఈ ఏడాదిలోనే అత్యధికస్థాయికి చేరుకున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. అన్ని కూరగాయల ధరలు ప్రజలను వణికిస్తున్నాయని గోయల్ అన్నారు. హోల్‌సేల్ మార్కెట్లోనూ కిలో ఉల్లి రూ.65పైనే ఉందని, రిటైల్‌గా రూ.100 నుంచి 120 ధర పెట్టినా కొనలేకపోతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఉల్లి కేజీ రూ.90-100 విక్రయిస్తున్నారు. ఢిల్లీలో రోజుకు 800 టన్నుల ఉల్లి వాడకం ఉండగా, సోమవారం ఆజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌కు కేవలం 90 టన్నుల ఉల్లి మాత్రమే వచ్చింది. -
రేపటి నుంచి మదర్ డెయిరీ పాల ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: మదర్ డెయిరీ పాల ధరను సోమవారం నుంచి పెంచుతున్నట్లు డీజీఎం రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు టీఎం పాలను లీటరుకు రూ.34 చొప్పున విక్రయిస్తుండగా సోమవారం నుంచి రూ.36కు పెంచినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు డెయిరీలు ఇదివరకే పాల ధరను పెంచాయని, ఉత్పాదక వ్యయం పెరిగిన దృష్ట్యా తాము సైతం పాల ధరలను పెంచాల్సి వస్తోందని ఆయన వివరించారు.