పాల ధరలు పెరుగుతాయా..?
♦ ఇప్పటికే రూ.2 పెంచిన అమూల్, మదర్ డెయిరీ
♦ రవాణా ఖర్చులు చూపుతూ ఇతరులూ అదే బాటలో!!
♦ పాల ధర పెరిగినా రైతుల సేకరణ ధర అంతంతే
♦ అధికమైన దాణా రేట్లతో పాడి రైతులకు నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పాల ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ సహకార దిగ్గజం ‘అమూల్’ లీటరుకు రూ.2 వరకూ పెంచటంతో... మిగిలిన బ్రాండ్లు కూడా పెంచే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమూల్ బాటలోనే మదర్ డెయిరీ కూడా లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్రాండ్ల టోన్డ్ మిల్క్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.40కి చేరింది. ప్రస్తుతం కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఒక్కటే నందిని బ్రాండ్‌తో టోన్డ్ మిల్క్‌ను లీటరు రూ.36 చొప్పున విక్రయిస్తోంది. మార్కెట్లో అతి తక్కువ ధర దీనిదే. ప్రభుత్వ రంగంలోని సహకార సంస్థ విజయ డెయిరీ కూడా విజయ పాలను లీటరు రూ.38 చొప్పున విక్రయిస్తోంది. మిగిలిన బ్రాండ్లన్నీ రూ.40 ఆపైనే విక్రయిస్తుండగా... హెరిటేజ్ రూ.42కు విక్రయిస్తోంది. అమూల్ ధర పెంచటంతో మిగిలిన కంపెనీలు కూడా పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
డిస్కౌంట్ల కాలం పోయిందా!!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2015లో అమూల్, నందిని బ్రాండ్ల ప్రవేశంతో పోటీ తారస్థాయికి చేరింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్లు, ఆఫర్లతో గతేడాది పోటీపడ్డాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ గోవర్ధన్ బ్రాండ్ రూ.40 విలువగల లీటరు ప్యాక్‌పై రూ.12 విలువ చేసే 200 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ను కొన్నాళ్ల పాటు ఉచితంగా ఇచ్చింది. మదర్ డెయిరీ లిమిటెడ్ ఆఫర్ కింద లీటరు ప్యాక్‌ను రూ.33కే విక్రయించింది. కేఎంఎఫ్ నందిని స్పెషల్ పేరుతో 3.5% వెన్న కలిగిన పాలను లీటరుకు రూ.34కే విక్రయిచింది. వాస్తవానికి ఈ స్థాయిలో వెన్న ఉన్న పాలను ప్రైవేటు కంపెనీలు ఆ సమయంలోనే రూ.42-44కు విక్రయించాయి. ఇలా ధరలను తగ్గించి ఆకర్షించిన కంపెనీలు... మార్కెట్లో స్థానం పదిలం చేసుకున్నాక మళ్లీ పెంపు బాట పట్టాయి.
రోజుకు 25 లక్షల లీటర్లు..
హైదరాబాద్ నగరంలో రోజుకు 25 లక్షల లీటర్ల పాలకు డిమాండ్ ఉంది. దీంతో ఈ మార్కెట్లో 100కు పైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. చాలా కంపెనీలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పాలను సేకరించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక రోజులోనే హైదరాబాద్‌కు పాలను సరఫరా చేస్తున్నామని నల్లగొండ- రంగారెడ్డి మిల్స్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చెబుతోంది.
హైదరాబాద్‌లో విజయ 3.5 లక్షల లీటర్లు, హెరిటేజ్ 2.5 లక్షలు, అమూల్ 1.50 లక్షలు, మస్కతి 1.50 లక్షలు, నార్ముల్ మదర్ డెయిరీ 1.10 లక్షలు, నందిని లక్ష, రిలయన్స్ 40 వేల లీటర్ల ప్యాకెట్ పాలను ప్రతి రోజూ విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజానికి కంపెనీలు మార్కెట్లో ధరలను పెంచినా రైతులకిచ్చే పాల సేకరణ ధరను మాత్రం ఆ రీతిలో పెంచటం లేదు. ఇదే విషయం కంపెనీలను అడిగితే డీజిల్ ధర పెరగడంతో రవాణా ఖర్చులూ పెరిగాయని, అందుకే ధరలు పెంచాల్సి వచ్చిం దంటున్నాయి. ఇతర కం పెనీలూ రేట్లను పెంచే అవకాశం ఉందని నార్ముల్ చైర్మన్ జితేందర్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.
నష్టాల్లో పాడి రైతులు..
కొన్ని కంపెనీలు మాత్రమే పాల సేకరణ ధరను పెంచాయి. నార్ముల్ 10 శాతం ఫ్యాట్ ఉన్న పాలకు రూ.57 చెల్లిస్తోంది. ‘‘చాలా కంపెనీలు విక్రయ ధరలను పెంచాయి కానీ సేకరణ ధరను మాత్రం పెంచలేకపోయాయి’’ అని జితేందర్‌రెడ్డి చెప్పారు. రైతులకు సబ్సిడీకే దాణా విక్రయిస్తున్నామని చెప్పారు. కాగా, ఓ ప్రైవేటు కంపెనీ 6% ఫ్యాట్‌కు రైతులకు రూ.41.40 ఇస్తోంది. సగటున ఈ ధర రూ.28 ఉందని మహబూబ్‌నగర్ జిల్లా చుక్మాపూర్ పాడి రైతు రామకృష్ణారెడ్డి తెలిపారు.
‘కాటన్ కేక్ క్వింటాలు ధర ఆరు నెలల క్రితం రూ.900 ఉండేది. ఇప్పుడు రూ.2,800 అయింది. మక్కపిండి రూ.1,500 నుంచి రూ.2,200లకు చేరింది. కాటన్ సీడ్ రూ.1,800 నుంచి రూ.2,200కు పెరిగింది. దీని పిప్పి మాత్రం రూ.2,800కు విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు మిగులుతున్నదేమీ లేదు. ప్రస్తుతమున్న సేకరణ ధరతో నష్టాలే మిగులుతున్నాయి’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కస్టమర్లు చెల్లిస్తున్న మొత్తంలో 82-85% రైతులకు ఇస్తున్నామని అమూల్ బ్రాం డ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.