హైదరాబాద్లో మదర్ డెయిరీ ఆవు పాలు
♦ అర లీటర్ ప్యాక్ ధర రూ.20
♦ ఈ ఏడాది రూ.8,500 కోట్ల టర్నోవర్
♦ కంపెనీ బిజినెస్ హెడ్ సందీప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న మదర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో ఆవు పాలను అందుబాటులోకి తెచ్చింది. అర లీటరు ప్యాక్ ధర రూ.20. కొద్ది రోజుల్లో 200 ఎంఎల్, లీటరు ప్యాక్‌లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కంపెనీ ఇక్కడ ప్యాకెట్ పాలను విక్రయిస్తోంది. 2-7 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆవు పాలు మంచివని మదర్ డెయిరీ పాల విభాగం బిజినెస్ హెడ్ సందీప్ ఘోష్ చెప్పారు. మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ అభిజిత్, సౌత్ సేల్స్ డీజీఎం భ్రహ్మయ్య పాటూరితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 23 రకాల నాణ్యతా పరీక్షలు జరిపిన తర్వాతే కస్టమర్‌కు చేరుస్తామని, తెలంగాణ నుంచే ఆవు పాలను సేకరిస్తున్నామని తెలియజేశారు.
తెలంగాణలో ప్లాంటు..: దక్షిణాదిన మదర్ డెయిరీకి తిరుపతిలో ప్లాంటుంది. ఇక్కడి నుంచి పాలను సేకరించి తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 55,000 లీటర్ల పాలను కంపెనీ విక్రయిస్తోంది. హైదరాబాద్‌లో వాటా పెంచుకోవాలని చూస్తున్న మదర్ డెయిరీ... అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోగానే ప్లాంటు నెలకొల్పాలని భావిస్తోంది. 2015-16లో కంపెనీ ఆదాయం రూ.7,000 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్లను లక్ష్యంగా చేసుకుంది.