cows milk
-
బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి బిగ్ షాక్..
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మేనకాగాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ మేనకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు ఇస్కాన్ సిద్ధమైంది. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఇటీవల మేనకా గాంధీ.. గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్ అమ్ముకుంటున్నదని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఇస్కాన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, మేనకా గాంధీ వ్యాఖ్యలపై కోల్‌కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల్ని ఆమె వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఆమెపై వంద కోట్ల పరువునష్టం కేసు వేసేందుకు న్యాయ ప్రక్రియ చేపట్టామని, ఇవాళ ఆమెకు నోటీసు జారీచేశామని చెప్పుకొచ్చారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అయిన ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. #Breaking ISKCON sends Rs 100 cr defamation notice to Maneka Gandhi over 'biggest cheat' remark #ISKCON #ManekaGandhi #Defamation #Cows — MANOJ KUMAR (@ManojBroadcast) September 29, 2023 అంతకుముందు కూడా.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. Sad reality of ISCON Temple ISCON temple exposed by Maneka Gandhi ji#ISKCON | @yudhistirGD | #ManekaGandhi | Maneka Gandhi | मेनका गांधी pic.twitter.com/2hgc7ED7Aq — INDIA Alliance (@2024_For_INDIA) September 27, 2023 ఇదిలా ఉండగా.. మేనకా గాంధీ ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. ఓ చోట ఉన్న ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. ‘ఇండియా’ కూటమిపై కేజ్రీవాల్ క్రేజీ కామెంట్స్ -
World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!
తమిళనాడులో భిక్షాటన, బలవంతపు వ్యభిచారం వద్దనుకొని 30 మంది ట్రాన్స్‌జెండర్స్ నిర్ణయించుకున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు 30 మంది 30 ఆవులు కొనుక్కుందామనుకున్నారు. తెలుగువాడైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి సపోర్ట్‌గా నిలుచున్నాడు. ఇంకేముంది... 2020లో దేశంలో మొదటి ‘‘ట్రాన్స్ విమెన్ మిల్క్ డెయిరీ’ కోవిల్పట్టిలో మొదలైంది. ఆవులు వారికి పాలు ఇస్తున్నాయి. దాంతో పాటు గౌరవం కూడా. నేటికీ దేశంలో చాలాచోట్ల పాల మీద వచ్చే ఆదాయం ఆ ఇంటి ఆదాయంగా స్త్రీ ఆదాయంగా ఉంటుంది. పాలు ఈ దేశంలో యుగాలుగా ఉపాధి స్త్రీలకు. పాలు అమ్మి గృహ అవసరాలకు దన్నుగా నిలిచిన, నిలుస్తున్న స్త్రీలు ఉన్నారు. వీరి కోసమని పథకాలు ఉన్నాయి. లోన్లు ఉన్నాయి. అవి పొందేందుకు సాయం చేసే ఇంటి పురుషులు ఉంటారు. అయితే ఇటు స్త్రీలుగా, అటు పురుషులుగా గుర్తింపు పొందక, ఎటువంటి అస్తిత్వ పత్రాలు లేక, రేషన్ కార్డులు లేక అవస్థలు పడే ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి ఏమిటి? వీరికి ఉపాధి పొందే హక్కు లేదా? ఎందుకు లేదు? అనుకున్నారు తమిళనాడులో ట్రాన్స్‌జెండర్స్ యాక్టివిస్ట్ గ్రేస్ బాను. ట్రాన్స్‌జెండర్స్ కోసం నిలబడి తమిళనాడులో 30 ఏళ్ల గ్రేస్‌బాను ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందిన తొలి ట్రాన్స్ ఉమన్. అయితే ఆమె ఆ చదువును డిస్కంటిన్యూ చేసి ట్రాన్స్‌జెండర్స్ కోసం మదురైకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే కోవిల్పట్టి జిల్లాలో ఉంటూ తమిళనాడు అంతటా పని చేయసాగింది. ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు పత్రాల కోసం, రేషన్ కార్డుల కోసం, గృహ వసతి కోసం ఈమె అలుపెరగక పని చేస్తున్నా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలోనే కోవిల్పట్టికి తెలుగువాడైన సందీప్ నండూరి కలెక్టర్‌గా వచ్చారు. ఆయనను గ్రేస్‌బాను కలిసి సమస్యను వివరించారు. కోవిల్పట్టి జిల్లాలో దాదాపు 250 మంది ఎటువంటి దారి లేక రోడ్డుమీద జీవిస్తున్నారని గ్రేస్‌బాను కలెక్టర్‌కు వివరించారు. వీరిలో కొందరు తమ జీవితాలను మార్చుకుందామని అనుకుంటున్నారని తెలియచేశారు. తొలి డెయిరీ ఫామ్ గ్రేస్బానుతో కలిసి సందీప్ నండూరి 30 మంది ట్రాన్స్ ఉమన్‌ను గుర్తించారు. వీరి స్వయం సమృద్ధికి అవసరమైన లోన్లను బ్యాంకులతో మాట్లాడి ఇప్పించారు. ఒక్కొక్కరు ఒక్కో ఆవు కొనుక్కునేందుకు లోను లభించింది. ప్రభుత్వం తరఫున కోవిల్పట్టికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర ఎకరం భూమి కేటాయించబడింది. ఇక్కడ ఆవులకు కావాల్సిన షెడ్స్, నీళ్లు, మేత సదుపాయం అన్నీ కల్పించుకునే ఏర్పాటు జరిగింది. ఈ ట్రాన్స్ ఉమన్‌కు ఎవ్వరికీ ఇంతకుముందు పశువుల్ని చూసుకోవడం కానీ, పాలు పితకడం కానీ రాదు. వీరికి నిపుణులతో 10 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ట్రాన్స్ ఉమన్ నుంచి నేరుగా పాలు కొనడానికి కొందరు వైముఖ్యం చూపవచ్చు. అందుకే కలెక్టర్ స్థానిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాలసంఘానికి వీరి పాలను కొనే ఏర్పాటు చేశారు. పాల సంఘానికి చేరిన పాలకు కులం, మతం, జెండర్ ఉండదు. పుష్టి తప్ప. 2020 జూన్ ప్రాంతంలో దేశంలోనే మొదటిసారిగా, ఒక ప్రయోగంగా ఈ డెయిరీ ఫామ్ మొదలైంది. అందరూ కలిసి... పంచుకుని డెయిరీని 30 మంది కలిసి చూసుకుంటారు. ఎవరి ఆవు బాగోగులు వారు చూసుకుంటారు. ముప్పై ఆవుల నుంచి మొత్తం పాలు సంఘానికి చేరతాయి. సంఘం సాయంత్రానికి వాటి డబ్బును డెయిరీ అకౌంట్లో వేస్తుంది. ఆ పడేది ఎంతైనా 30 సమాన భాగాలు అవుతుంది. నెలకు కనీసం 8 వేల నుంచి 10 వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. ‘మా కల నిజమైంది. గౌరవంగా బతుకుతున్నాం’ అని ఈ ట్రాన్స్ ఉమన్ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జీవనం సందీప్ నండూరి (ప్రస్తుతం తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్) వీరి కోసం అక్కడే ఉమ్మడి జీవనానికి ఏర్పాటు చేశారు. సందీప్ మీద గౌరవంతో వారు ఆ కాలనీకి ‘సందీప్ నగర్’ అని పేరు పెట్టుకున్నారు. ట్రాన్స్‌జెండర్ లకు నివాసం, జీవనం చాలా ముఖ్యమైనవి. అవి కల్పిస్తే వారు ఈ సంఘంలో భాగమయ్యి తమ ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటారని ఈ డెయిరీ చెబుతుంది. కోవెల్‌పట్టి దారిలో తమిళనాడులోని మరికొన్ని జిల్లాలు ఇలాంటి డెయిరీలు భిన్న వర్గాల కోసం నడపాలని యోచిస్తున్నాయి. మంచిదే కదా. – సాక్షి ఫ్యామిలీ -
శ్రద్ధాసక్తులే జవజీవాలు!
రెండు ఆవులనైనా సరే కంటికి రెప్పలా కాపాడుకుంటూ శ్రద్ధగా పెంచి పోషించుకుంటే చాలు చిన్న రైతు జీవితం దినదినాభివృద్ధి చెందుతుందనడానికి ఆళ్ల అప్పలనాయుడు సాధించిన విజయమే నిదర్శనం. ఈ యువ ఆదర్శ రైతు పేరు ఆళ్ల అప్పలనాయుడు(33). విశాఖపట్నం జిల్లాలోని మండల కేంద్రం కశింకోటకు చెందిన ఆళ్ల జగ్గారావు, సత్యవతమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దకుమారుడు అప్పలనాయుడు. అతనికి నలుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి 70 సెంట్ల పొలం, రెండు గేదెలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అప్పల నాయుడు ఆంధ్రా యూనివర్సిటీలో బీకాం చదివాడు. దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తి చేశాక కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. కుటుంబానికి దూరంగా ఎక్కడో చిన్నా చితకా ఉద్యోగాలు చేయడం కంటే స్వగ్రామంలోనే పాడి రైతుగా ఎదగాలని తలచాడు. పశుసంవర్దక శాఖ నిర్వహించే అభ్యుదయ రైతుల శిక్షణలో తాను పాల్గొని పశుపోషణపై ఆసక్తి పెంచుకోవడంతోపాటు స్వయంగా డెయిరీ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చానన్నాడు. పట్టుదలతో ఆదర్శ డెయిరీ రైతుగా ఎదిగాడు. సొంత దాణా.. శ్రద్ధగా పోషణ.. పాడి పశువులతోపాటు దూడల పోషణపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అప్పలనాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాడు. సొంతంగా తయారు చేసుకున్న దాణాను, సొంతంగా పండించిన పశుగ్రాసం, సైలేజీ గడ్డిని మేపుతూ ఉంటాడు. ఇదే ఆయన విజయానికి తొలిమెట్టుగా నిలిచింది. మొక్కజొన్న 40%, పత్తి చెక్క 10–15%, గోధుమ తవుడు 10–15%, శనగ గుల్ల 10%, మినప పొట్టు 5–8%, పెసర పొట్టు 5%, ఉప్పు 3–4% కలిపి సమీకృత దాణాను తయారు చేసుకొని పచ్చి మేతతోపాటు పశువులకు మేపుతూ ఉంటాడు. మినరల్ మిక్చర్ నెలలో 15 రోజులపాటు ఒక్కో పశువుకు రోజుకు 15 గ్రాముల చొప్పున అందిస్తాడు. మిగతా 15 రోజుల్లో పాలిచ్చే ఆవులకు మాత్రమే రోజుకు 50 గ్రాముల చొప్పున కాల్షియం సప్లిమెంట్ ఇస్తూ ఉంటాడు. ఇంతకన్నా ఎక్కువ మోతాదులో ఇచ్చినా వృథా కావడం తప్ప పశువుకు ఏమాత్రం ఉపయోగపడవని అప్పలనాయుడు తెలిపాడు. 8–10 లీటర్ల పాలిచ్చే పశువుకు రోజుకు 3–3.5 కిలోల సైలేజ్ గడ్డిని, 5 లీటర్ల కన్నా తక్కువ పాలిచ్చే ఆవులకు కిలో చొప్పున ఇస్తాడు. చూడి పశువులకు 7–9 నెలల మధ్య ఉదయం అరకేజీ, సాయంత్రం అరకేజీ మొక్కజొన్న దాణా మేపుతూ ఉంటాడు. 2 నుంచి 32కు పెరిగిన ఆవుల సంఖ్య 2009లో ముఖ్యమంత్రి పశుక్రాంతి పథకం ద్వారా రుణాన్ని పొంది రెండు సంకరజాతి పాడి ఆవులను కొని 50 సెంట్ల విస్తీర్ణంలో షెడ్డు వేసి అప్పలనాయుడు పదేళ్ల క్రితం 2 ఆవులతో ప్రారంభించాడు. పాడి పశువులను శ్రద్ధగా గమనిస్తూ చక్కని పోషకాహారం ఇవ్వడం, ఇష్టంగా పనిచేయడం ద్వారా ఇపుడు వాటి సంఖ్యను 32కు పెంచుకోగలిగాడు. ఇందులో 11 జెర్సీ కాగా, మిగతావి హెచ్.ఎఫ్. సంకరజాతి ఆవులు. ఉత్తమ యాజమాన్య మెలకువలు పాటించడం ద్వారా మంచి పాల దిగుబడిని సాధిస్తున్నాడు. రోజుకు సీజన్లో 160 లీటర్ల వరకు అన్‌సీజన్‌లో 120 లీటర్ల వరకు పాల దిగుబడి సాధిస్తున్నాడు. తండ్రితోపాటు ముగ్గురు కూలీలు డెయిరీ నిర్వహణలో పని చేస్తున్నారు. అయినా, పాల ద్వారా వచ్చే నికరాదాయం అన్‌సీజన్‌లో నెలకు రూ. 20 వేలకు మించి ఉండటం లేదన్నాడు. దాణా దినుసులను తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తే పాడి రైతులు నిలబడగలుగుతారని అప్పలనాయుడు అభిప్రాయపడ్డాడు. దూడల పెంపకంపై శ్రద్ధ పాడి పరిశ్రమ దీర్ఘకాలంలో కూడా లాభదాయకంగా ఉండాలంటే దూడల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనంటాడు అప్పలనాయుడు. ‘దూడలకు నెల నెలా నట్టల నివారణ మందు వేయిస్తాం. తల్లి పాలు ఒక నెల తర్వాత క్రమంగా తల్లి పాలు తగ్గిస్తూ 3 నెలల్లో దాణాను అలవాటు చేస్తాం. మా పెయ్య దూడలు 12–15 నెలల్లో ఖచ్చితంగా చూడి కట్టించేలా జాగ్రత్తపడతాం. నా విజయానికి ఇదొక ముఖ్య కారణం’ అని అప్పలనాయుడు తెలిపాడు. పశుగ్రాసం అమ్మకంతో అదనపు ఆదాయం సూపర్ నేపియర్, కాంబోనేపియర్ గడ్డి ని తన పొలంలో సాగు చేస్తున్న పశుగ్రాసంలో నుంచి తన పశువులకు మేపగా, మిగిలిన 100 టన్నుల పశుగ్రాసాన్ని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. సైలేజి గడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆదాయం పొందుతున్న అప్పలనాయుడు పాడి రైతుగా నిలదొక్కుకోగలిగాడు. ఈ యువ ఆదర్శ పాడి రైతుకు మనమూ జయహో చెబుదామా! – దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి, విశాఖ జిల్లా రైతుల నుంచి పాల కొనుగోళ్లలో అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలి డెయిరీ నిర్వహణలో ఎంత మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ లాభాలు తగ్గిపోతున్నాయి. దాణా దినుసుల ఖర్చు కిలో 25–26కు పెరిగింది. పాల ధర లీటరుకు రూ. 25–27 మాత్రమే. పాడి రైతుల నుంచి కంపెనీలు పాలు కొనేటప్పుడు తూకం, నాణ్యత నిర్థారణలో జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలి. డెయిరీ సంస్థలు కంపెనీ చట్టంలోకి వెళ్లటం వల్ల లీటరుకు రూ. 4ల మేరకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహం పొందే అవకాశం రైతులకు లేకుండాపోయింది. పాడి రైతుల సహకార సంఘాలను ప్రభుత్వం మళ్లీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – ఆళ్ల అప్పలనాయుడు(95500 64322), కశింకోట, విశాఖపట్నం జిల్లా -
సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు
సాక్షి, జగిత్యాల: పురాణాల్లో సంగీతాన్ని భగవంతుడిగా భావించడం జరిగింది. పెద్దవ్యాధులు కూడా సంగీతం వల్ల నయమవుతాయన్న విషయాన్ని ఆయుర్వేదం చెప్పింది. పశువులు కూడా సంగీతపు ఆనందాన్ని ఆస్వాదిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పాలు పితికే సమయంలో మధుర సంగీతాన్ని ఆలపిస్తే..పాల దిగుబడి పెరుగుతుంది. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వంటి కొన్ని దేవాలయాల గోశాలలో, కొన్ని డైరి ఫారాలలో ఈ పద్ధతి ఆచరిస్తున్నారు. మహారాష్ట్రలోని పూనే వద్ద కల పరాగ్ మిల్క్ ఫుడ్స్‌లో పాలు పితికే సమయాల్లో గాయకులు కిశోర్‌కుమార్, మహ్మాద్ రఫీల పాటల సీడీలు వేస్తున్నారు. దీంతో ఆవుల చెవులకు ఇంపైన సంగీతం వినిపిస్తే పాల దిగుబడి 3 శాతం పెరిగిందని పరాగ్ పుడ్స్ సీఎంఓ మహేష్ ఇస్రాని తెలిపారు. బారామతిలోని ఫ్రైబర్ డైనామిక్స్ డెయిరీ ఫాంలో కూడా ఆవులకు సితార్, తబలా సంగీతం వినిపిస్తున్నారు. -
కౌ..కేక
రాజమహేంద్రవరం రూరల్ : మిలమిలలాడుతూ మెరిసిన గేదెలు.. తళతళలాడుతూ కదిలిన గోవులు.. కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు.. రేసు గుర్రాలు శుక్రవారం సాయంత్రం నామవరంలో సందడి చేశాయి. శ్రీభారతీయ విద్యాభవ¯ŒSలో సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో అఖిల భారత ఆవులు, గేదెల అందాలు, పాల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీటికి 250కిపైగా ఆవులు, 200 గేదెలు, 20 గుర్రాలు, 30 పొట్టేళ్లు చేరాయి. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పోటీలను తిలకించారు. ఒంగోలు, గిర్ జాతి, ముర్రా, జపర్బాడీ జాతి గేదెల పాలపోటీలు నిర్వహించారు. పోటీల ప్రదర్శనకు వచ్చిన వివిధ జాతుల ఆవులు, గేదెలు, గుర్రాలు, పొట్టేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జింగ్ జాతికి చెందిన తెల్ల పొట్టేలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శరీరమంతా తెల్లని జూలు ఉండడంతో దానిని చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఈ పొట్టేలను నేపాల్ నుంచి తీసుకువచ్చినట్టు దాని యజమాని కోనసీమ రాజోలు ప్రాంతానికి అడబాల నాని తెలిపారు. దీని తల్లి వయస్సు రెండున్నర సంవత్సరాలు కాగా... పిల్ల వయస్సు ఏడు నెలలు. తల్లి కొమ్ములు సుమారు మూడడుగులకు పైనే ఉండగా.. పిల్లకు అడుగున్నర మేర కొమ్ములు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో మదర్ డెయిరీ ఆవు పాలు
♦ అర లీటర్ ప్యాక్ ధర రూ.20 ♦ ఈ ఏడాది రూ.8,500 కోట్ల టర్నోవర్ ♦ కంపెనీ బిజినెస్ హెడ్ సందీప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న మదర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో ఆవు పాలను అందుబాటులోకి తెచ్చింది. అర లీటరు ప్యాక్ ధర రూ.20. కొద్ది రోజుల్లో 200 ఎంఎల్, లీటరు ప్యాక్‌లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కంపెనీ ఇక్కడ ప్యాకెట్ పాలను విక్రయిస్తోంది. 2-7 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆవు పాలు మంచివని మదర్ డెయిరీ పాల విభాగం బిజినెస్ హెడ్ సందీప్ ఘోష్ చెప్పారు. మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ అభిజిత్, సౌత్ సేల్స్ డీజీఎం భ్రహ్మయ్య పాటూరితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 23 రకాల నాణ్యతా పరీక్షలు జరిపిన తర్వాతే కస్టమర్‌కు చేరుస్తామని, తెలంగాణ నుంచే ఆవు పాలను సేకరిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో ప్లాంటు..: దక్షిణాదిన మదర్ డెయిరీకి తిరుపతిలో ప్లాంటుంది. ఇక్కడి నుంచి పాలను సేకరించి తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 55,000 లీటర్ల పాలను కంపెనీ విక్రయిస్తోంది. హైదరాబాద్‌లో వాటా పెంచుకోవాలని చూస్తున్న మదర్ డెయిరీ... అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోగానే ప్లాంటు నెలకొల్పాలని భావిస్తోంది. 2015-16లో కంపెనీ ఆదాయం రూ.7,000 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్లను లక్ష్యంగా చేసుకుంది. -
తల్లిపాలు లేనప్పుడు ఏ పాలు పట్టాలి?
ఆయుర్వేద కౌన్సెలింగ్ తల్లిపాలు తాగే వయసులోని శిశువులకు, ఆ పాలు తక్కువైనప్పుడు గాని, లభించనప్పుడు గాని ఏ పాలు పడితే మంచిది? ఆయుర్వేదంలో గాడిద పాల గురించి ఏమైనా చెప్పారా? వివరించ ప్రార్థన. - విశాల నేమాని, హైదరాబాద్ ఏ కారణం చేతనైనా తల్లిపాలు లభించనప్పుడు గాని లేదా స్తనాగ్రాలు చిట్లి, పాలివ్వడానికి ఇబ్బంది ఉన్నప్పుడుగాని, తల్లి వ్యాధిగ్రస్థురాలయినప్పుడుగాని, శిశువునకు ఆవుపాలు లేదా మేకపాలు శ్రేష్ఠమని ఆయుర్వేదం వక్కాణించింది. ఆవుపాలగుణాలు: మధురం, శీతం, మృదు, స్నిగ్ధం (జిగురు) గుణాలు కలిగి ఉండి, శిశువునకు ప్రసన్నత కలిగించి, ప్రాణప్రదంగానూ, ఓజోవర్థకంగానూ ఉంటుంది. రక్తస్రావాన్ని అరికట్టే గుణం కూడా ఉంది. (చరక, శుశ్రుత సంహితలు) మేకపాల గుణాలు: మధుర కషాయ రసాలు, శీతం, లఘువు, ఆకలిని పుట్టించి, విరేచనాలను ఎక్కువగా రానివ్వకుండా ఉపకరిస్తుంది. జ్వరం, దగ్గు, ఆయాసాలను రాకుండా నివారిస్తుంది. (సుశ్రుత సంహిత) గాడిదపాల గుణాలు: భావమిశ్రుడు చెప్పిన శ్లోకం: ‘‘శ్వాస వాతహరం సామ్లం లవణం రుచి దీప్తికృత్, కఫకాసహరం బాల రోగఘ్నం గార్ధభీపయః’’ లవణం, అమ్ల రసాలు కలిగి ఉండి, నాలుకకు రుచిని, అగ్ని దీప్తిని కలిగిస్తుంది. కఫాన్ని, దగ్గుని, ఆయాసాన్ని నివారించే, పోగొట్టే గుణం కూడా ఉంది. అందుకే దీనిని బాల రోగహరంగా ప్రస్తావించారు. శిశువునకు నిత్యం పట్టే పాలగా కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే ప్రక్రియ కోసం వాడటం మంచిది. మోతాదు: పుట్టిన వారం రోజుల తర్వాత ఐదుచుక్కలు తాగించాలి. అనంతరం నెలకొకసారి అదే మోతాదులో ఆరునెలలపాటు వాడుకుంటే చాలా రోగాలకు నివారకంగా ఉపకరిస్తుంది. పైన చెప్పిన వ్యాధులలో కూడా పెద్దలు కూడా వాడుకోవచ్చు. మోతాదు: 50 నుండి 100 మిల్లీలీటర్లు- పెద్దలకు, పిల్లలకు వయసును బట్టి మోతాదు మారుతుంది. పాలను మరిగించి చల్లార్చి వాడుకోవాలి. గమనిక: ఆవుపాలను, మేకపాలను మరిగించినప్పుడు లఘు పంచ మూలాలను కలిపి మరిగిస్తే, పాలు దోష రహితమై, శిశువులకు ఆరోగ్యకరమని ఉటంకించారు. వాటిలో మనకు విరివిగా లభించేవి.. నేల వాకుడు (కంటకారి), పల్లేరు (గోక్షుర). పాలల్లో నీళ్లు కలపనవసరం లేదు. శర్కర (చక్కెర)కు బదులుగా పటిక బెల్లం (మిశ్రీ) కొద్దిమోతాదులో కలిపి పిల్లలకు పడితే చాలా మంచిది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
మురి‘పాలు’ దూరం చేయెద్దు..
తల్లి పాలు శిశువుల ఆరోగ్యానికి పౌష్టికాహారం లాగానే ఆవు పాలు కూడా వాటి దూడలకు అంతే ముఖ్యం. ఆ పాలను మనం తస్కరించవద్దంటూ ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద ఆవు వేషధారణలతో జాగృతి కల్పిస్తున్న పెటా ఇండియా వలంటీర్లు వీరంతా. ఆదివారం మదర్స్ డే సందర్భంగా రెండు రోజుల ముందే శుక్రవారం... ఇలా పిల్లలు ఆవు వేషధారణల్లో కనిపించి... తల్లులందరూ తమ పాలను పిల్లలకు ఇవ్వాలనుకుంటారని... ఆవు కూడా అంతేననే నినాదాలు చేశారు. -సాక్షి, సిటీబ్యూరో -
ఘనంగా అభిషేకం
కర్నూలు(న్యూసిటీ): అతిరుద్ర యాగంలో భాగంగా సుంకేసుల రోడ్డులోని కేజి.గోవిందరెడ్డి స్థలంలో సోమవారం శ్రీరాధాకృష్ణ, ఉమామహేశ్వర స్వామి వార్లకు వెయ్యి లీటర్ల ఆవు పాలతో అభిషేకం నిర్వహించారు. వినాయక స్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకాన్ని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ జరిపారు. లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలు ఘనంగా నిర్వహించారు. పరమేశ్వర స్వామి, శ్రీకృష్ణ భగవానుడు, గణపతి స్వామి వార్లకు అష్టోత్తర శతనామావాళి మంత్రాలను వేద పండితులు పఠించా రు. గురుపూజ, మహా పూర్ణాహుతి రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వర స్వా మి వార్ల విగ్రహాలకు వేద మంత్రాల మధ్య పవిత్రమైన తుంగభద్ర నదీ జలాలతో స్నానం చేయించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. తుంగభద్ర నదీమ తల్లి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పుణ్య హారతులు ఇచ్చారు. రాత్రి వేద మంత్రాల మధ్య శ్రీరాధాకృష్ణుల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఈశ్వరునికి పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ హాజరయ్యారు. కమిటీ సభ్యులు, వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి అమర సింహారెడ్డి, రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి, సముద్రాల హనుమంతరావు, వాసుదేవయ్య, రమణ పాల్గొన్నారు.