డెయిరీ పనుల్లో నిమగ్నమైన అప్పలనాయుడు
రెండు ఆవులనైనా సరే కంటికి రెప్పలా కాపాడుకుంటూ శ్రద్ధగా పెంచి పోషించుకుంటే చాలు చిన్న రైతు జీవితం దినదినాభివృద్ధి చెందుతుందనడానికి ఆళ్ల అప్పలనాయుడు సాధించిన విజయమే నిదర్శనం. ఈ యువ ఆదర్శ రైతు పేరు ఆళ్ల అప్పలనాయుడు(33). విశాఖపట్నం జిల్లాలోని మండల కేంద్రం కశింకోటకు చెందిన ఆళ్ల జగ్గారావు, సత్యవతమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దకుమారుడు అప్పలనాయుడు. అతనికి నలుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి 70 సెంట్ల పొలం, రెండు గేదెలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అప్పల నాయుడు ఆంధ్రా యూనివర్సిటీలో బీకాం చదివాడు. దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తి చేశాక కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. కుటుంబానికి దూరంగా ఎక్కడో చిన్నా చితకా ఉద్యోగాలు చేయడం కంటే స్వగ్రామంలోనే పాడి రైతుగా ఎదగాలని తలచాడు. పశుసంవర్దక శాఖ నిర్వహించే అభ్యుదయ రైతుల శిక్షణలో తాను పాల్గొని పశుపోషణపై ఆసక్తి పెంచుకోవడంతోపాటు స్వయంగా డెయిరీ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చానన్నాడు. పట్టుదలతో ఆదర్శ డెయిరీ రైతుగా ఎదిగాడు.
సొంత దాణా.. శ్రద్ధగా పోషణ..
పాడి పశువులతోపాటు దూడల పోషణపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అప్పలనాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాడు. సొంతంగా తయారు చేసుకున్న దాణాను, సొంతంగా పండించిన పశుగ్రాసం, సైలేజీ గడ్డిని మేపుతూ ఉంటాడు. ఇదే ఆయన విజయానికి తొలిమెట్టుగా నిలిచింది. మొక్కజొన్న 40%, పత్తి చెక్క 10–15%, గోధుమ తవుడు 10–15%, శనగ గుల్ల 10%, మినప పొట్టు 5–8%, పెసర పొట్టు 5%, ఉప్పు 3–4% కలిపి సమీకృత దాణాను తయారు చేసుకొని పచ్చి మేతతోపాటు పశువులకు మేపుతూ ఉంటాడు. మినరల్ మిక్చర్ నెలలో 15 రోజులపాటు ఒక్కో పశువుకు రోజుకు 15 గ్రాముల చొప్పున అందిస్తాడు. మిగతా 15 రోజుల్లో పాలిచ్చే ఆవులకు మాత్రమే రోజుకు 50 గ్రాముల చొప్పున కాల్షియం సప్లిమెంట్ ఇస్తూ ఉంటాడు. ఇంతకన్నా ఎక్కువ మోతాదులో ఇచ్చినా వృథా కావడం తప్ప పశువుకు ఏమాత్రం ఉపయోగపడవని అప్పలనాయుడు తెలిపాడు. 8–10 లీటర్ల పాలిచ్చే పశువుకు రోజుకు 3–3.5 కిలోల సైలేజ్ గడ్డిని, 5 లీటర్ల కన్నా తక్కువ పాలిచ్చే ఆవులకు కిలో చొప్పున ఇస్తాడు. చూడి పశువులకు 7–9 నెలల మధ్య ఉదయం అరకేజీ, సాయంత్రం అరకేజీ మొక్కజొన్న దాణా మేపుతూ ఉంటాడు.
2 నుంచి 32కు పెరిగిన ఆవుల సంఖ్య
2009లో ముఖ్యమంత్రి పశుక్రాంతి పథకం ద్వారా రుణాన్ని పొంది రెండు సంకరజాతి పాడి ఆవులను కొని 50 సెంట్ల విస్తీర్ణంలో షెడ్డు వేసి అప్పలనాయుడు పదేళ్ల క్రితం 2 ఆవులతో ప్రారంభించాడు. పాడి పశువులను శ్రద్ధగా గమనిస్తూ చక్కని పోషకాహారం ఇవ్వడం, ఇష్టంగా పనిచేయడం ద్వారా ఇపుడు వాటి సంఖ్యను 32కు పెంచుకోగలిగాడు. ఇందులో 11 జెర్సీ కాగా, మిగతావి హెచ్.ఎఫ్. సంకరజాతి ఆవులు. ఉత్తమ యాజమాన్య మెలకువలు పాటించడం ద్వారా మంచి పాల దిగుబడిని సాధిస్తున్నాడు. రోజుకు సీజన్‌లో 160 లీటర్ల వరకు అన్‌సీజన్‌లో 120 లీటర్ల వరకు పాల దిగుబడి సాధిస్తున్నాడు. తండ్రితోపాటు ముగ్గురు కూలీలు డెయిరీ నిర్వహణలో పని చేస్తున్నారు. అయినా, పాల ద్వారా వచ్చే నికరాదాయం అన్‌సీజన్‌లో నెలకు రూ. 20 వేలకు మించి ఉండటం లేదన్నాడు. దాణా దినుసులను తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తే పాడి రైతులు నిలబడగలుగుతారని అప్పలనాయుడు అభిప్రాయపడ్డాడు.
దూడల పెంపకంపై శ్రద్ధ
పాడి పరిశ్రమ దీర్ఘకాలంలో కూడా లాభదాయకంగా ఉండాలంటే దూడల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనంటాడు అప్పలనాయుడు. ‘దూడలకు నెల నెలా నట్టల నివారణ మందు వేయిస్తాం. తల్లి పాలు ఒక నెల తర్వాత క్రమంగా తల్లి పాలు తగ్గిస్తూ 3 నెలల్లో దాణాను అలవాటు చేస్తాం. మా పెయ్య దూడలు 12–15 నెలల్లో ఖచ్చితంగా చూడి కట్టించేలా జాగ్రత్తపడతాం. నా విజయానికి ఇదొక ముఖ్య కారణం’ అని అప్పలనాయుడు తెలిపాడు.
పశుగ్రాసం అమ్మకంతో అదనపు ఆదాయం
సూపర్ నేపియర్, కాంబోనేపియర్ గడ్డి ని తన పొలంలో సాగు చేస్తున్న పశుగ్రాసంలో నుంచి తన పశువులకు మేపగా, మిగిలిన 100 టన్నుల పశుగ్రాసాన్ని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. సైలేజి గడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆదాయం పొందుతున్న అప్పలనాయుడు పాడి రైతుగా నిలదొక్కుకోగలిగాడు. ఈ యువ ఆదర్శ పాడి రైతుకు మనమూ జయహో చెబుదామా!
– దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి, విశాఖ జిల్లా
రైతుల నుంచి పాల కొనుగోళ్లలో అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలి
డెయిరీ నిర్వహణలో ఎంత మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ లాభాలు తగ్గిపోతున్నాయి. దాణా దినుసుల ఖర్చు కిలో 25–26కు పెరిగింది. పాల ధర లీటరుకు రూ. 25–27 మాత్రమే. పాడి రైతుల నుంచి కంపెనీలు పాలు కొనేటప్పుడు తూకం, నాణ్యత నిర్థారణలో జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలి. డెయిరీ సంస్థలు కంపెనీ చట్టంలోకి వెళ్లటం వల్ల లీటరుకు రూ. 4ల మేరకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహం పొందే అవకాశం రైతులకు లేకుండాపోయింది. పాడి రైతుల సహకార సంఘాలను ప్రభుత్వం మళ్లీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
– ఆళ్ల అప్పలనాయుడు(95500 64322), కశింకోట, విశాఖపట్నం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment