ఆయుర్వేద కౌన్సెలింగ్
తల్లిపాలు తాగే వయసులోని శిశువులకు, ఆ పాలు తక్కువైనప్పుడు గాని, లభించనప్పుడు గాని ఏ పాలు పడితే మంచిది? ఆయుర్వేదంలో గాడిద పాల గురించి ఏమైనా చెప్పారా? వివరించ ప్రార్థన.
- విశాల నేమాని, హైదరాబాద్
ఏ కారణం చేతనైనా తల్లిపాలు లభించనప్పుడు గాని లేదా స్తనాగ్రాలు చిట్లి, పాలివ్వడానికి ఇబ్బంది ఉన్నప్పుడుగాని, తల్లి వ్యాధిగ్రస్థురాలయినప్పుడుగాని, శిశువునకు ఆవుపాలు లేదా మేకపాలు శ్రేష్ఠమని ఆయుర్వేదం వక్కాణించింది.
ఆవుపాలగుణాలు: మధురం, శీతం, మృదు, స్నిగ్ధం (జిగురు) గుణాలు కలిగి ఉండి, శిశువునకు ప్రసన్నత కలిగించి, ప్రాణప్రదంగానూ, ఓజోవర్థకంగానూ ఉంటుంది. రక్తస్రావాన్ని అరికట్టే గుణం కూడా ఉంది. (చరక, శుశ్రుత సంహితలు)
మేకపాల గుణాలు: మధుర కషాయ రసాలు, శీతం, లఘువు, ఆకలిని పుట్టించి, విరేచనాలను ఎక్కువగా రానివ్వకుండా ఉపకరిస్తుంది. జ్వరం, దగ్గు, ఆయాసాలను రాకుండా నివారిస్తుంది. (సుశ్రుత సంహిత)
గాడిదపాల గుణాలు: భావమిశ్రుడు చెప్పిన శ్లోకం: ‘‘శ్వాస వాతహరం సామ్లం లవణం రుచి దీప్తికృత్, కఫకాసహరం బాల రోగఘ్నం గార్ధభీపయః’’
లవణం, అమ్ల రసాలు కలిగి ఉండి, నాలుకకు రుచిని, అగ్ని దీప్తిని కలిగిస్తుంది. కఫాన్ని, దగ్గుని, ఆయాసాన్ని నివారించే, పోగొట్టే గుణం కూడా ఉంది. అందుకే దీనిని బాల రోగహరంగా ప్రస్తావించారు. శిశువునకు నిత్యం పట్టే పాలగా కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే ప్రక్రియ కోసం వాడటం మంచిది.
మోతాదు: పుట్టిన వారం రోజుల తర్వాత ఐదుచుక్కలు తాగించాలి. అనంతరం నెలకొకసారి అదే మోతాదులో ఆరునెలలపాటు వాడుకుంటే చాలా రోగాలకు నివారకంగా ఉపకరిస్తుంది. పైన చెప్పిన వ్యాధులలో కూడా పెద్దలు కూడా వాడుకోవచ్చు. మోతాదు: 50 నుండి 100 మిల్లీలీటర్లు- పెద్దలకు, పిల్లలకు వయసును బట్టి మోతాదు మారుతుంది. పాలను మరిగించి చల్లార్చి వాడుకోవాలి.
గమనిక: ఆవుపాలను, మేకపాలను మరిగించినప్పుడు లఘు పంచ మూలాలను కలిపి మరిగిస్తే, పాలు దోష రహితమై, శిశువులకు ఆరోగ్యకరమని ఉటంకించారు. వాటిలో మనకు విరివిగా లభించేవి.. నేల వాకుడు (కంటకారి), పల్లేరు (గోక్షుర). పాలల్లో నీళ్లు కలపనవసరం లేదు. శర్కర (చక్కెర)కు బదులుగా పటిక బెల్లం (మిశ్రీ) కొద్దిమోతాదులో కలిపి పిల్లలకు పడితే చాలా మంచిది.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
తల్లిపాలు లేనప్పుడు ఏ పాలు పట్టాలి?
Published Tue, Aug 25 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement
Advertisement