ఆరు నెలల పాటు బిడ్డకు పాలివ్వండి
బెంగళూరు : శిశువుకు ఆరునెలల పాటు తప్పక చనుబాలు ఇవ్వాలని ప్రముఖ గైనకాలజిస్ట్, గుణశీల ఆసుపత్రి ప్రతినిధి దేవికాగుణశీల పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఆవరణంలో ఆదివారం నుంచి అవగాహన కార్యక్రమాలను ఆసుపత్రి యాజమాన్యం ప్రారంభించింది. ఈ సందర్భంగా దేవికాగుణశీల మాట్లాడుతూ... మారుతున్న జీవన విధానాల వల్ల తల్లి రెండు లేదా మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు శిశువుకు చనుబాలు ఇవ్వడం లేదన్నారు.
ఇది శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తమ పరిశీలనలలో తేలిందన్నారు. అంతేకాక శిశువుకు పాలు ఇవ్వక పోవడం వల్ల కొందరిలో క్యాన్సర్‌కు దారితీసే పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న తల్లులతో మేము ఆరునెలల వరకూ బిడ్డకు తప్పక చనుబాలు ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తల్లిపాల వారోత్సవంలో భాగంగా సంస్థ ఆవరణంలో ‘శిశువు-తల్లి పాల ప్రాముఖ్యత’ విషయంపై చిత్రలేఖనం, వక్తృత్వ, నాటికలు, చర్చావేదికల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.