World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా! | Transgender-run first Milk Cooperative Society in Kovilpatti | Sakshi
Sakshi News home page

World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!

Published Tue, Jun 1 2021 5:34 AM | Last Updated on Wed, Mar 2 2022 7:02 PM

Transgender-run first Milk Cooperative Society in Kovilpatti - Sakshi

తమిళనాడులో భిక్షాటన, బలవంతపు వ్యభిచారం వద్దనుకొని 30 మంది ట్రాన్స్‌జెండర్స్‌ నిర్ణయించుకున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు 30 మంది 30 ఆవులు కొనుక్కుందామనుకున్నారు. తెలుగువాడైన డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌ వారికి సపోర్ట్‌గా నిలుచున్నాడు. ఇంకేముంది... 2020లో దేశంలో మొదటి ‘‘ట్రాన్స్‌ విమెన్‌ మిల్క్‌ డెయిరీ’ కోవిల్‌పట్టిలో మొదలైంది. ఆవులు వారికి పాలు ఇస్తున్నాయి. దాంతో పాటు గౌరవం కూడా.

నేటికీ దేశంలో చాలాచోట్ల పాల మీద వచ్చే ఆదాయం ఆ ఇంటి ఆదాయంగా స్త్రీ ఆదాయంగా ఉంటుంది. పాలు ఈ దేశంలో యుగాలుగా ఉపాధి స్త్రీలకు. పాలు అమ్మి గృహ అవసరాలకు దన్నుగా నిలిచిన, నిలుస్తున్న స్త్రీలు ఉన్నారు. వీరి కోసమని పథకాలు ఉన్నాయి. లోన్లు ఉన్నాయి. అవి పొందేందుకు సాయం చేసే ఇంటి పురుషులు ఉంటారు. అయితే ఇటు స్త్రీలుగా, అటు పురుషులుగా గుర్తింపు పొందక, ఎటువంటి అస్తిత్వ పత్రాలు లేక, రేషన్‌ కార్డులు లేక అవస్థలు పడే ట్రాన్స్‌జెండర్స్‌ పరిస్థితి ఏమిటి? వీరికి ఉపాధి పొందే హక్కు లేదా? ఎందుకు లేదు? అనుకున్నారు తమిళనాడులో ట్రాన్స్‌జెండర్స్‌ యాక్టివిస్ట్‌ గ్రేస్‌ బాను.

ట్రాన్స్‌జెండర్స్‌ కోసం నిలబడి
తమిళనాడులో 30 ఏళ్ల గ్రేస్‌బాను ఇంజనీరింగ్‌ కాలేజీలో అడ్మిషన్‌ పొందిన తొలి ట్రాన్స్‌ ఉమన్‌. అయితే ఆమె ఆ చదువును డిస్‌కంటిన్యూ చేసి ట్రాన్స్‌జెండర్స్‌ కోసం మదురైకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే కోవిల్‌పట్టి జిల్లాలో ఉంటూ తమిళనాడు అంతటా పని చేయసాగింది. ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు పత్రాల కోసం, రేషన్‌ కార్డుల కోసం, గృహ వసతి కోసం ఈమె అలుపెరగక పని చేస్తున్నా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలోనే కోవిల్‌పట్టికి తెలుగువాడైన సందీప్‌ నండూరి కలెక్టర్‌గా వచ్చారు. ఆయనను గ్రేస్‌బాను కలిసి సమస్యను వివరించారు. కోవిల్‌పట్టి జిల్లాలో దాదాపు 250 మంది ఎటువంటి దారి లేక రోడ్డుమీద జీవిస్తున్నారని గ్రేస్‌బాను కలెక్టర్‌కు వివరించారు. వీరిలో కొందరు తమ జీవితాలను మార్చుకుందామని అనుకుంటున్నారని తెలియచేశారు.

తొలి డెయిరీ ఫామ్‌
గ్రేస్‌బానుతో కలిసి సందీప్‌ నండూరి 30 మంది ట్రాన్స్‌ ఉమన్‌ను గుర్తించారు. వీరి స్వయం సమృద్ధికి అవసరమైన లోన్లను బ్యాంకులతో మాట్లాడి ఇప్పించారు. ఒక్కొక్కరు ఒక్కో ఆవు కొనుక్కునేందుకు లోను లభించింది. ప్రభుత్వం తరఫున కోవిల్‌పట్టికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర ఎకరం భూమి కేటాయించబడింది. ఇక్కడ ఆవులకు కావాల్సిన షెడ్స్, నీళ్లు, మేత సదుపాయం అన్నీ కల్పించుకునే ఏర్పాటు జరిగింది. ఈ ట్రాన్స్‌ ఉమన్‌కు ఎవ్వరికీ ఇంతకుముందు పశువుల్ని చూసుకోవడం కానీ, పాలు పితకడం కానీ రాదు. వీరికి నిపుణులతో 10 రోజుల ట్రైనింగ్‌ ఇచ్చారు. అయితే ట్రాన్స్‌ ఉమన్‌ నుంచి నేరుగా పాలు కొనడానికి కొందరు వైముఖ్యం చూపవచ్చు. అందుకే కలెక్టర్‌ స్థానిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాలసంఘానికి వీరి పాలను కొనే ఏర్పాటు చేశారు. పాల సంఘానికి చేరిన పాలకు కులం, మతం, జెండర్‌ ఉండదు. పుష్టి తప్ప. 2020 జూన్‌ ప్రాంతంలో దేశంలోనే మొదటిసారిగా, ఒక ప్రయోగంగా ఈ డెయిరీ ఫామ్‌ మొదలైంది.

అందరూ కలిసి... పంచుకుని
డెయిరీని 30 మంది కలిసి చూసుకుంటారు. ఎవరి ఆవు బాగోగులు వారు చూసుకుంటారు. ముప్పై ఆవుల నుంచి మొత్తం పాలు సంఘానికి చేరతాయి. సంఘం సాయంత్రానికి వాటి డబ్బును డెయిరీ అకౌంట్‌లో వేస్తుంది. ఆ పడేది ఎంతైనా 30 సమాన భాగాలు అవుతుంది. నెలకు కనీసం 8 వేల నుంచి 10 వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. ‘మా కల నిజమైంది. గౌరవంగా బతుకుతున్నాం’ అని ఈ ట్రాన్స్‌ ఉమన్‌ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జీవనం
సందీప్‌ నండూరి (ప్రస్తుతం తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌) వీరి కోసం అక్కడే ఉమ్మడి జీవనానికి ఏర్పాటు చేశారు. సందీప్‌ మీద గౌరవంతో వారు ఆ కాలనీకి ‘సందీప్‌ నగర్‌’ అని పేరు పెట్టుకున్నారు. ట్రాన్స్‌జెండర్‌ లకు నివాసం, జీవనం చాలా ముఖ్యమైనవి. అవి కల్పిస్తే వారు ఈ సంఘంలో భాగమయ్యి తమ ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటారని ఈ డెయిరీ చెబుతుంది. కోవెల్‌పట్టి దారిలో తమిళనాడులోని మరికొన్ని జిల్లాలు ఇలాంటి డెయిరీలు భిన్న వర్గాల కోసం నడపాలని యోచిస్తున్నాయి. మంచిదే కదా.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement