World Milk Day
-
Akshali Shah: విజయంలో సగపాలు
‘పాడి రంగంలో మన దేశంలో మూడొంతుల మంది స్త్రీలే పని చేసి విజయం సాధిస్తున్నారు’ అని గత సంవత్సరం ‘వరల్డ్ డెయిరీ సమ్మిట్’లో ప్రధాని నరేంద్రమోడి అన్నారు. పశు పోషణ చేసి, పాలు పితికి, ఆదాయ మార్గాలు వెతికి విజయం సాధిస్తున్న మహిళలు ఎందరో నేడు ఆ మాటను నిజం చేస్తున్నారు. నేడు ‘వరల్డ్ మిల్క్ డే’ ‘ఎంజాయ్ డెయిరీ ప్రాడక్ట్’ అనేది థీమ్. ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ పేరుతో డెయిరీ ప్రాడక్ట్స్ దేశంలోనే అగ్రశ్రేణిగా నిలిచింది అక్షాలి షా. 32 ఏళ్ల అక్షాలి షా నేడొక దేశంలో ఉంటే రేపు మరో దేశంలో ఉంటుంది. ఏ దేశంలో పాడి రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో, పాడి ఉత్పత్తులలో ఎలాంటి సాంకేతికత చోటు చేసుకుంటున్నదో నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆ మార్పులను తాను అధినాయకత్వం వహిస్తున్న ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ సంస్థలో ప్రవేశపెడుతూ ఉంటుంది. అందుకే ఇవాళ ప్యాకేజ్డ్ పాల రంగంలో, డెయిరీ ఉత్పత్తుల రంగంలో పరాగ్ సంస్థ అగ్రగామిగా ఉంది. అందుకు పూర్తి క్రెడిట్ అక్షాలి షాకు దక్కుతుంది. 2010లో పగ్గాలు చేపట్టి ఎం.బి.ఏ.లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన అక్షాలి షా తన తండ్రి దేవేంద్ర షా స్థాపించి నిర్వహిస్తున్న పాడి పరిశ్రమ రంగంలో 2010లో అడుగుపెట్టింది. అయితే తండ్రి ఆమెకు వెంటనే సంస్థ పగ్గాలు అప్పగించకుండా పెరుగు తయారు చేసే ఒక చిన్న ప్లాంట్‌ను ఇచ్చి దానిని డెవలప్ చేయమన్నాడు. అక్షాలి విజయం సాధించేసరికి మెల్ల మెల్లగా సంస్థలో ఆమె స్థానం, స్థాయి పెరుగుతూ పోయాయి. ‘భారతీయుల సంస్కృతిలో పాలు, గోవు చాలా విశిష్టమైన స్థానంలో ఉంటాయి. మన పురాణాల్లో క్షీరం ప్రస్తావన ప్రముఖంగా ఉంటుంది. అందుకే నేను ఈ రంగాన్ని ఆషామాషీగా నిర్వహించదలుచుకోలేదు. నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగలిగితే కనుక సెంటిమెంట్ కనెక్ట్ అవుతుందనుకున్నాను’ అంటుంది అక్షాలి. ప్రొటీన్ ఉత్పత్తులు శాకాహారంలో 84 శాతం, మాంసాహారంలో 65 శాతం ప్రొటీన్ లోపం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ‘ఆరోగ్య, క్రీడా రంగంలో ప్రొటీన్ ప్రాడక్ట్స్‌కు నేడు దేశంలో ఏటా 2000 కోట్ల మార్కెట్ ఉంది. ప్రొటీన్ పౌడర్లు తీసుకునే ఫిట్నెస్ ప్రియులు చాలామంది ఉంటారు. అందుకే పాల నుంచి సేకరించిన ప్రొటీన్ ప్రాడక్ట్‌లను తయారు చేసి విక్రయిస్తున్నాం. అవతార్, గో ప్రొటీన్ పేరుతో మా ప్రాడక్ట్లు ఉన్నాయి’ అంటుంది అక్షాలి. పరాగ్ సంస్థ నుంచి ‘గోవర్థన్’ పేరుతో నెయ్యి దొరుకుతోంది. ఇక చీజ్ అమ్మకాల్లో అక్షాలి సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు... ఈ అన్ని ఉత్పత్తుల్లో సంస్థ మంచి అమ్మకాలు సాధిస్తోంది. పూర్వం పాలు, పెరుగు స్త్రీలే అమ్మేవారు. వారికి పాలను ఎలా ఆదాయవనరుగా చేసుకోవాలో తెలుసు. అక్షాలి లాంటి నవతరం డెయిరీ లీడర్లు అదే నిరూపిస్తున్నారు. గడప చెంతకు ఆవుపాలు అక్షాలికి పూణెలో గోక్షేత్రం ఉంది. 2011 నాటికి అక్కడి ఆవుల నుంచి పాలు పితికి, కేవలం ఆవుపాలు కోరే 172 మంది ఖాతాదారులకు అందించేవారు. అక్షాలి రంగంలోకి దిగాక శ్రేష్టమైన ఆవు పాల కోసం దేశంలో కోట్ల మంది ఖాతాదారులు ప్రయత్నిస్తుంటారని అర్థం చేసుకుంది. ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో ప్రీమియమ్ ఆవుపాలను అందించడానికి ముందుకు వచ్చింది. మానవ రహితంగా ఆవుల నుంచి పాలను పితికి, ప్యాక్ చేసి, విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చి తాజాగా ఖాతాదారుల గడప దగ్గరకు ప్యాకెట్టు పడేలా నెట్వర్క్ సిద్దం చేసింది. ఇంత శ్రేష్టత పాటించడం వల్ల మార్కెట్లో ఆవు పాల కంటే ఈ పాలు రెట్టింపు ధర ఉంటాయి. అయినా సరే కస్టమర్లు తండోప తండాలుగా ఈ పాలను కోరుకున్నారు. ఇవాళ అక్షాలి సరఫరా చేస్తున్న ఆవుపాలు ఢిల్లీ, ముంబై, పూణె, సూరత్‌లలో విశేషంగా అమ్ముడు పోతున్నాయి. 2027 నాటికి కేవలం ఈ ఆవుపాల టర్నోవర్ 400 కోట్లకు చేరుకుంటుందని అక్షాలి అంచనా. -
ప్రతి రోజు పాలు తాగుతున్నారా.. అయితే తెలుసుకోండి!
మనిషి పుట్టుక మొదలు చనిపోయే వరకు అన్ని దశల్లోనూ పాల వాడకం ఉంటుంది. పాలు, పాల నుంచి వచ్చే పెరుగు, వెన్న నెయ్యి, తీపి పదార్థాలు అన్నీ మనిషి మనుగడకు ప్రధానం. గ్రామీణ జీవితంలో ప్రధాన ఆదాయ వనరు, ఎంతో మందికి జీవనాధారమైనది పాడి పంట. ఇక అమ్మ పాలు అమృతం. తల్లిపాలు ఎక్కువకాలం తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. పాలలో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి కాల్షియం, ప్రోటీన్‌తో సహా పెరుగుతున్న శరీరానికి సహాయపడతాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుకుంటారు. ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవ థీమ్ ‘పాడి రంగంలో సుస్థిరత’. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.. పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: పాలలో మనకు అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. దీనిని ‘‘ఫుల్ ప్రోటీన్’’ అంటారు. పాలలో లభించే రెండు రకాల ప్రోటీన్లు కాసిన్, పాలవిరుగుడు ప్రోటీన్. కాసిన్ రక్తపోటును తగ్గిస్తే, పాలవిరుగుడు ప్రోటీన్ మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది. పాలు తీసుకుంటే ఈ పోషకాలు మీ సొంతం: మనం తీసుకునే ఆహారంలో లభించని చాలా పోషకాలు పాలలో దొరుకుతాయి. వైట్ డ్రింక్ పొటాషియం, బి12, కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు సాధారణంగా చాలా ఆహార పదార్థాల్లో ఉండవు. కానీ ఇవి పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, బి1, బి2, పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. ఎముకలు దృఢంగా: పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ల వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాలను ప్రతి రోజు తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువును తగ్గిస్తుంది: పాలలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి బరువు తగ్గిస్తుంది. పాలతో ఆస్టియో ఆర్థరైటిస్‌కు చెక్: మోకాళ్లలో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌కు ప్రస్తుతం చికిత్స లేదు. అయితే ప్రతిరోజూ పాలు తాగడం ద్వారా ఈ వ్యాధిని అధిగమించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. క్యాన్సర్ నుంచి రక్షణ: పాలలో కాల్షియం, విటమిన్-డి ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాపడుతాయి. పెద్దపేగు క్యాన్సర్ లేదా పురీషనాళ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్షియం గట్ లైనింగ్‌ను కాపాడుతుంది. కణాల పెరుగుదల నియంత్రణలో విటమిన్-డి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జాగ్రత్త.. జీర్ణం కాకపోతే! అయితే కొంత మంది వ్యక్తులు పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. లాక్టోస్ అనేది పాల ఉత్పత్తులలో కనిపించే ఒక పదార్ధం. లాక్టోస్ అనేది పడకపోతే పాలను జీర్ణం చేసుకోవడం కష్టం. దీనివల్ల పాలు తాగిన తర్వాత కడుపులో ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!) -
World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!
తమిళనాడులో భిక్షాటన, బలవంతపు వ్యభిచారం వద్దనుకొని 30 మంది ట్రాన్స్‌జెండర్స్ నిర్ణయించుకున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు 30 మంది 30 ఆవులు కొనుక్కుందామనుకున్నారు. తెలుగువాడైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి సపోర్ట్‌గా నిలుచున్నాడు. ఇంకేముంది... 2020లో దేశంలో మొదటి ‘‘ట్రాన్స్ విమెన్ మిల్క్ డెయిరీ’ కోవిల్పట్టిలో మొదలైంది. ఆవులు వారికి పాలు ఇస్తున్నాయి. దాంతో పాటు గౌరవం కూడా. నేటికీ దేశంలో చాలాచోట్ల పాల మీద వచ్చే ఆదాయం ఆ ఇంటి ఆదాయంగా స్త్రీ ఆదాయంగా ఉంటుంది. పాలు ఈ దేశంలో యుగాలుగా ఉపాధి స్త్రీలకు. పాలు అమ్మి గృహ అవసరాలకు దన్నుగా నిలిచిన, నిలుస్తున్న స్త్రీలు ఉన్నారు. వీరి కోసమని పథకాలు ఉన్నాయి. లోన్లు ఉన్నాయి. అవి పొందేందుకు సాయం చేసే ఇంటి పురుషులు ఉంటారు. అయితే ఇటు స్త్రీలుగా, అటు పురుషులుగా గుర్తింపు పొందక, ఎటువంటి అస్తిత్వ పత్రాలు లేక, రేషన్ కార్డులు లేక అవస్థలు పడే ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి ఏమిటి? వీరికి ఉపాధి పొందే హక్కు లేదా? ఎందుకు లేదు? అనుకున్నారు తమిళనాడులో ట్రాన్స్‌జెండర్స్ యాక్టివిస్ట్ గ్రేస్ బాను. ట్రాన్స్‌జెండర్స్ కోసం నిలబడి తమిళనాడులో 30 ఏళ్ల గ్రేస్‌బాను ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందిన తొలి ట్రాన్స్ ఉమన్. అయితే ఆమె ఆ చదువును డిస్కంటిన్యూ చేసి ట్రాన్స్‌జెండర్స్ కోసం మదురైకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే కోవిల్పట్టి జిల్లాలో ఉంటూ తమిళనాడు అంతటా పని చేయసాగింది. ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు పత్రాల కోసం, రేషన్ కార్డుల కోసం, గృహ వసతి కోసం ఈమె అలుపెరగక పని చేస్తున్నా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలోనే కోవిల్పట్టికి తెలుగువాడైన సందీప్ నండూరి కలెక్టర్‌గా వచ్చారు. ఆయనను గ్రేస్‌బాను కలిసి సమస్యను వివరించారు. కోవిల్పట్టి జిల్లాలో దాదాపు 250 మంది ఎటువంటి దారి లేక రోడ్డుమీద జీవిస్తున్నారని గ్రేస్‌బాను కలెక్టర్‌కు వివరించారు. వీరిలో కొందరు తమ జీవితాలను మార్చుకుందామని అనుకుంటున్నారని తెలియచేశారు. తొలి డెయిరీ ఫామ్ గ్రేస్బానుతో కలిసి సందీప్ నండూరి 30 మంది ట్రాన్స్ ఉమన్‌ను గుర్తించారు. వీరి స్వయం సమృద్ధికి అవసరమైన లోన్లను బ్యాంకులతో మాట్లాడి ఇప్పించారు. ఒక్కొక్కరు ఒక్కో ఆవు కొనుక్కునేందుకు లోను లభించింది. ప్రభుత్వం తరఫున కోవిల్పట్టికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర ఎకరం భూమి కేటాయించబడింది. ఇక్కడ ఆవులకు కావాల్సిన షెడ్స్, నీళ్లు, మేత సదుపాయం అన్నీ కల్పించుకునే ఏర్పాటు జరిగింది. ఈ ట్రాన్స్ ఉమన్‌కు ఎవ్వరికీ ఇంతకుముందు పశువుల్ని చూసుకోవడం కానీ, పాలు పితకడం కానీ రాదు. వీరికి నిపుణులతో 10 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ట్రాన్స్ ఉమన్ నుంచి నేరుగా పాలు కొనడానికి కొందరు వైముఖ్యం చూపవచ్చు. అందుకే కలెక్టర్ స్థానిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాలసంఘానికి వీరి పాలను కొనే ఏర్పాటు చేశారు. పాల సంఘానికి చేరిన పాలకు కులం, మతం, జెండర్ ఉండదు. పుష్టి తప్ప. 2020 జూన్ ప్రాంతంలో దేశంలోనే మొదటిసారిగా, ఒక ప్రయోగంగా ఈ డెయిరీ ఫామ్ మొదలైంది. అందరూ కలిసి... పంచుకుని డెయిరీని 30 మంది కలిసి చూసుకుంటారు. ఎవరి ఆవు బాగోగులు వారు చూసుకుంటారు. ముప్పై ఆవుల నుంచి మొత్తం పాలు సంఘానికి చేరతాయి. సంఘం సాయంత్రానికి వాటి డబ్బును డెయిరీ అకౌంట్లో వేస్తుంది. ఆ పడేది ఎంతైనా 30 సమాన భాగాలు అవుతుంది. నెలకు కనీసం 8 వేల నుంచి 10 వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. ‘మా కల నిజమైంది. గౌరవంగా బతుకుతున్నాం’ అని ఈ ట్రాన్స్ ఉమన్ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జీవనం సందీప్ నండూరి (ప్రస్తుతం తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్) వీరి కోసం అక్కడే ఉమ్మడి జీవనానికి ఏర్పాటు చేశారు. సందీప్ మీద గౌరవంతో వారు ఆ కాలనీకి ‘సందీప్ నగర్’ అని పేరు పెట్టుకున్నారు. ట్రాన్స్‌జెండర్ లకు నివాసం, జీవనం చాలా ముఖ్యమైనవి. అవి కల్పిస్తే వారు ఈ సంఘంలో భాగమయ్యి తమ ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటారని ఈ డెయిరీ చెబుతుంది. కోవెల్‌పట్టి దారిలో తమిళనాడులోని మరికొన్ని జిల్లాలు ఇలాంటి డెయిరీలు భిన్న వర్గాల కోసం నడపాలని యోచిస్తున్నాయి. మంచిదే కదా. – సాక్షి ఫ్యామిలీ -
పాలభారతం
పుట్టినప్పుడు మొట్టమొదటిగా మన గొంతు తడిపేవి తల్లిపాలు మాత్రమే. ఎదుగుతున్న కొద్దీ ఆవుపాలు, గేదెపాలు తాగుతాం. పిల్లల ఎదుగుదలకే కాదు, రోగులు త్వరగా కోలుకోవడానికీ, వయోవృద్ధులు సత్తువ కోల్పోకుండా ఉండటానికీ పాలను మించిన పోషక పానీయమేదీ లేదు. శారీరక శక్తికి అవసరమైన అత్యంత కీలకమైన పోషక పదార్థాల్లో చాలా వరకు పాలలోనే ఉంటాయి. పోషకాహార పదార్థాల జాబితా నుంచి పాలను మినహాయించడం సాధ్యం కాదు. శ్వేతవిప్లవం తర్వాత మన దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. ఇదొక ఘన విజయం. స్వార్థశక్తుల కారణంగా పాలు కల్తీకి లోనవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాలేవీ పాల కల్తీని అరికట్టలేకపోతున్నాయి. ఇదొక దారుణ వైఫల్యం. ప్రపంచ పాల దినోత్సవం (జూన్ 1) సందర్భంగా పాల గురించి, కల్తీ పాపాల గురించి కొన్ని సంగతులు... సహజసిద్ధంగా దొరికే పాలు నిస్సందేహంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శైశవ దశ వరకు మాత్రమే పిల్లలు తల్లిపాలపై ఆధారపడతారు. ఆ తర్వాత పిల్లలకు క్రమంగా ఆవుపాలు లేదా గేదెపాలు అలవాటు చేస్తారు. మేక, గొర్రె, ఒంటె, గుర్రం, గాడిద వంటి జంతువుల పాలు కూడా అక్కడక్కడా వాడుకలో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నవి ఆవుపాలు, గేదెపాలు మాత్రమే. వివిధ రకాల పాల ఉత్పత్తులు కూడా ఆవుపాలు, గేదెపాలతోనే ఎక్కువగా తయారు చేస్తారు. ఆవుపాలతో పోలిస్తే గేదెపాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు కాసింత ఎక్కువగా ఉంటాయి. అయితే, ఆవుపాలు తేలికగా అరుగుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు గేదెపాల కంటే ఆవుపాలు తీసుకోవడమే మేలు. అలాగే, తల్లిపాలు చాలని పసిపిల్లలకు కూడా ఆవుపాలు పట్టడమే క్షేమమని నిపుణులు చెబుతారు. కండరాల ఆరోగ్యానికి, ఎముకల దారుఢ్యానికి, కంటిచూపు బాగుండటానికి, రక్తహీనత నుంచి రక్షణకు పాలు ఎంతగానో దోహదపడతాయి. ఆరోగ్యంగా ఉండటానికి అన్ని వయసుల వారికీ పాలు చాలా అవసరం. స్వచ్ఛమైన పాలు గుక్కెడైనను చాలు... తెల్లనివన్నీ పాలు కాదని నానుడి. పాలన్నీ తెల్లగానే ఉంటాయి గాని తెల్లనివన్నీ పాలు కాదు. మరీ ముఖ్యంగా పాల పేరిట అందమైన ప్యాకెట్లలో మార్కెట్లను ముంచెత్తుతున్నవన్నీ స్వచ్ఛమైన పాలు కానేకాదు. ఇదివరకటి సత్తెకాలంలో పాలలో కాసిన్ని నీళ్లు కలిపితేనే జనం గగ్గోలు పెట్టేవారు. పాలను నీళ్లతో కల్తీచేసే పాడు రోజులు దాపురించాయని వాపోయేవారు. ఇప్పుడు కల్తీకాలం మరింత ముదిరింది. నీళ్లేమిటి ఖర్మ పాలలో ఏకంగా పిండి, వనస్పతి, యూరియా, డిటర్జెంట్, ఫార్మాలిన్ సహా నానా ప్రమాదకర రసాయనాలను ఎడాపెడా కలిపేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు. పాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి కోసం ‘క్షీర విప్లవం’ చేపట్టిన మన దేశంలోనే కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వరంగ డెయిరీ సంస్థలు స్వచ్ఛమైన పాలనే అందిస్తూ వస్తున్నా, సాక్షాత్తు పాలకులే ప్రైవేటు డెయిరీలకు కొమ్ము కాస్తుండటంతో కల్తీపాల వ్యాపారానికి అడ్డు లేకుండా పోతోంది. మనదేశంలో ప్యాకెట్లలో లభించే పాలలో ఏకంగా 68 శాతం మేరకు కల్తీ పాలేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన పాలు గుక్కెడైనను చాలు అనుకోవాల్సి వస్తోంది. పాల ఉత్పాదన... వినియోగం... పాల ఉత్పాదనలో మన దేశం ముందంజలోనే ఉన్నా, తలసరి పాల వినియోగంలో మాత్రం కొంత వెనుకబడే ఉంది. వర్ఘీస్ కురియన్ తెచ్చిన క్షీర విప్లవం (వైట్ రివల్యూషన్) పుణ్యమాని పాల ఉత్పాదనలో మన దేశం పూర్తి స్వయంసమృద్ధి సాధించగలిగింది. కురియన్ తెచ్చిన క్షీర విప్లవం ప్రపంచంలోనే అతిపెద్ద పాడి అభివృద్ధి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి పాతికేళ్లలో మన దేశంలో పాలకు విపరీతమైన కొరత ఉండేది. ఆ కొరత తీర్చడానికి ప్రభుత్వం 1965లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. అప్పటికే గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పాడి సహకార సంస్థ ‘అమూల్’ను విజయవంతం చేసిన వర్ఘీస్ కురియన్ను అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. ‘అమూల్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట చేపట్టిన క్షీర విప్లవం సత్ఫలితాలను సాధించింది. దేశవ్యాప్తంగా పాల ఉత్పాదన ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఫలితంగా ప్రపంచ స్థాయిలోనే పాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా ఎదిగింది. కల్తీ అనర్థాలు పాలలో నీళ్లు కలపడం చాలాకాలం నుంచి తెలిసినదే. నీళ్లు కలిపితే పాలు పలచగా మారిపోతాయి. అలా పలచగా మారకుండా ఉండటానికి, నీళ్లు కలిపినా స్వచ్ఛమైన పాలలా భ్రమింపజేయడానికి కల్తీరాయుళ్లు నానారకాల పదార్థాలను పాలలో కలుపుతున్నారు. యూరియా, పిండి, డిటర్జెంట్, వనస్పతి, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం బైకార్బొనేట్, బోరిక్ ఆసిడ్ వంటివి ఇష్టానుసారం కలిపేస్తున్నారు. పాల ఉత్పత్తిని పెంచడానికి పాడి పశువులకు ఇష్టానుసారం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలాచోట్ల ఇలాంటి పద్ధతుల్లో కల్తీ చేసిన పాలనే పాల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ బ్రాండ్ల పేర్లతో ప్యాకెట్లలో కల్తీ పాలు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. గత్యంతరం లేని జనాలు ఈ పాలనే తాగుతూ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కేవలం పాలను మాత్రమే కాదు, పాల ఉత్పత్తులను కూడా కల్తీరాయుళ్లు యథాశక్తి కల్తీ చేసి పారేస్తున్నారు. పెరుగు, వెన్న, నెయ్యి, కోవా, పనీర్, రబ్డీ వంటి పాల ఉత్పత్తుల్లో పిండి, వనస్పతి, బ్లాటింగ్ పేపర్, కృత్రిమ రంగులు కలుపుతున్నారు. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేస్తూ కల్తీరాయుళ్లను పట్టుకుంటున్నా, పాల కల్తీని పూర్తిగా కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. సహజసిద్ధమైన పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, కల్తీ పాలు ఆరోగ్యానికి అంతకు రెట్టింపు చేటు చేస్తాయి. కల్తీ పాల వల్ల జీర్ణకోశ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండెజబ్బులు తలెత్తుతాయి. చక్కెర జబ్బు, అధిక రక్తపోటు ఉన్న రోగులు ఇలాంటి కల్తీ పాలు తాగితే వారి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రైవేటు పా‘పాలు’ మన దేశంలో కల్తీపాలు మార్కెట్‌ను ముంచెత్తడానికి ప్రైవేటు డెయిరీ సంస్థలే ప్రధాన కారణం. లాభార్జనే ధ్యేయంగా గల ప్రైవేటు డెయిరీ సంస్థలు నానారకాల ప్రమాదకర రసాయనాలతో పాలను కల్తీ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాలనే నమూనాగా తీసుకుంటే పాల కల్తీ పరిస్థితి అర్థమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ప్రభుత్వరంగ సంస్థగా ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘విజయ’ బ్రాండ్‌తో పాల ప్యాకెట్లను మార్కెట్లోకి తెచ్చింది. తర్వాత క్రమంగా ప్రైవేట్ డెయిరీ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ‘విజయ’ డెయిరీ నాణ్యత గల పాలను అందిస్తుండగా, ప్రైవేటు సంస్థలు ఉత్పత్తిని పెంచుకోవడానికి నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశాయి. ముఖ్యంగా ‘హెరిటేజ్’ సంస్థ డెయిరీ రంగంలోకి అడుగుపెట్టాక ‘విజయ’ వెనుకబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన ‘హెరిటేజ్’కు లాభాల పంట పండించాలనే లక్ష్యంతోనే అప్పటి ప్రభుత్వం ‘విజయ’ డెయిరీని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వివిధ డెయిరీ సంస్థలకు చెందిన పాల నమూనాలను నిర్వహించగా, హెరిటేజ్ సహా పదకొండు ప్రైవేటు డెయిరీ సంస్థలు సరఫరా చేస్తున్న పాలలో డిటర్జెంట్, ఇతర రసాయనాలు ఉన్నట్లు తేలింది. చిన్నా చితకా స్థాయిలో కల్తీలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం కల్తీలకు పాల్పడుతున్న బడా డెయిరీ సంస్థలపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. పాల కోసం మనుషులు పశువులను పెంచడం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. పలు ప్రాచీన నాగరికతలు పాలను పవిత్ర పానీయంగా భావించేవి. వివిధ దేశాల పౌరాణిక సాహిత్యంలో పాలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటికి ప్రాచీన ఈజిప్షియన్లు భారీ స్థాయిలో పాడి పశువులను పెంచేవారు. విరివిగా పాలను వినియోగించేవారు. పాలను తోడుబెట్టి పెరుగు తయారు చేయడం, వెన్న సేకరించడం వంటి ప్రక్రియలు క్రీస్తుపూర్వం 5000 సంవత్స రాల నాటికే మానవులకు తెలుసు. ప్రాచీనకాలంలోనే భారతీయులు పాలతో రకరకాల వంటకాలను తయారు చేసేవారు. ప్రాచీన రోమన్, ఈజిప్షియన్ మహిళలు గాడిద పాలను సౌందర్య సాధనంగా వాడేవారు. క్లియోపాత్రా, నీరో చక్రవర్తి భార్య స్పోరస్ ఏకంగా గాడిద పాలతో స్నానం చేసేవారు. సోయాగింజలతో కృత్రిమ పాలను తయారు చేసే ప్రక్రియ చైనాలో క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది కాలంలో మొదలైంది. చాలాకాలం వరకు మిగిలిన ప్రపంచానికి సోయాపాల గురించి తెలియదు. అమెరికన్ మార్కెట్లో మొదటిసారిగా 1979లో సోయాపాలు అందుబాటులోకి వచ్చాయి. కొందరు శుద్ధ శాకాహారులు పాడిపశువుల నుంచి సేకరించిన సహజమైన పాల బదులు సోయాపాలు తాగడం ఫ్యాషన్‌గా కూడా మారింది. ఫ్రెంచి శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ 1863లో పాశ్చరైజేషన్ ప్రక్రియను కనిపెట్టిన తర్వాత పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసి, పాలను సురక్షితంగా సరఫరా చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పారిశ్రామికీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాలకు గిరాకీ పెరగడమే కాదు, పాల ఉత్పాదన కూడా గణనీయంగా పెరిగింది. ప్రపంచంలోనే తొలి డెయిరీ సంస్థ న్యూయార్క్ డెయిరీ కంపెనీ 1877లో మొదలైంది. అప్పట్లో ఈ సంస్థ గాజు సీసాల్లో పాలను ప్యాక్‌చేసి సరఫరా చేసేది. పాలకు ప్రత్యామ్నాయాలు ఆవుపాలు, గేదెపాలలో ఉండే ల్యాక్టోజ్ కొందరికి సరిపడదు. అలాంటి వాళ్లకు పాలలోని పోషకాలు అందాలంటే వారికి తగిన ప్రత్యామ్నాయం సోయాపాలు. సోయా గింజలను నానబెట్టి, బాగా నీరు చేర్చి రుబ్బి సోయాపాలు తయారు చేస్తారు. పాడి పశువుల పాలకు దీటుగా సోయాపాలలోనూ ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాడి పశువుల పాలు సరిపడని వారు మాత్రమే కాదు, జంతు సంబంధ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండే శుద్ధ శాకాహారులు (వీగన్స్) కూడా పాడి పశువుల పాలకు బదులుగా సోయాపాలు, సోయాపాల ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. ఆవుపాలు, గేదెపాలతో తయారయ్యే పనీర్ బదులుగా సోయాపాలతో తయారయ్యే తోఫుతో కూడా రకరకాల వంటకాలను ఆస్వాదిస్తున్నారు. పాడి పశువుల పాలకు బదులుగా కొందరు కొబ్బరి పాలు, బాదంగింజల పాలు వంటివి కూడా విరివిగా వాడుతున్నారు. -
క్షీర భగీరథుడు
మన దిగ్గజాలు - జూన్1 ప్రపంచ పాల దినోత్సవం దేశంలో క్షీరవిప్లవాన్ని తెచ్చిన దార్శనికుడు ఆయన. ఒకప్పుడు పాల కోసం అల్లాడిన భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయన సొంతం. ఆయనే వర్ఘీస్ కురియన్. ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట ఆయన చేపట్టిన ఈ భగీరథ ప్రయత్నం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయానుబంధ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ క్షీరవిప్లవమే కురియన్ను ‘మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రజలకు చేరువ చేసింది. దేశంలో పాడి పరిశ్రమ స్వయంసమృద్ధి సాధించిందంటే, అది ఆయన చలవే! అంతేనా, వంటనూనెల ఉత్పత్తిలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి సాధించేలా చేయడంలోనూ గురుతర పాత్ర పోషించారాయన. కేరళ జన్మస్థలం... గుజరాత్ కార్యక్షేత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్‌లోని కాలికట్లో (ప్రస్తుతం ఇది కేరళలో ఉంది. దీనిపేరు కోజికోడ్గా మారింది) 1921 నవంబర్ 26న సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు వర్ఘీస్ కురియన్. కేరళలో పాఠశాల విద్య పూర్తయ్యాక కాలేజీ చదువుల కోసం మద్రాసు చేరుకున్నారు. మద్రాసులోని లయోలా కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పొందారు. ఆ తర్వాత మద్రాసు వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు జెమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. భారత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మిషిగాన్ స్టేట్ వర్సిటీ నుంచి 1948లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యార్హతలతో దేశానికి తిరిగి వచ్చిన ఆయనను భారత ప్రభుత్వం గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభించిన ప్రయోగాత్మక పాలకేంద్రం విధులను అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఆనంద్ ఆయన కార్యక్షేత్రంగా మారింది. మధ్యలోనే మానేద్దామనుకున్నారు ప్రభుత్వం పంపగా కురియన్ తొలుత అయిష్టంగానే ఆ పని చేపట్టారు. మధ్యలోనే ఆ ఉద్యోగం మానేసి, వేరే ఏదైనా పని వెదుక్కోవాలని భావించారు. అయితే, కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం వ్యవస్థాపకుడు త్రిభువన్దాస్ పటేల్ నచ్చచెప్పడంతో కురియన్ ఆనంద్‌లోనే ఉండిపోయారు. పటేల్ పాడి రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారందరూ ప్రభుత్వ పాల కేంద్రానికే పాలు సరఫరా చేసేలా చూశారు. అయితే, పాల కేంద్రం కార్యకలాపాల్లో తరచూ అధికారులు జోక్యం చేసుకుంటుండటంతో కురియన్ విసుగెత్తిపోయారు. దీనికి ఏదైనా పరిష్కారం సాధించాలనుకున్నారు. ఈ విషయమై తనకు మార్గదర్శిగా ఉన్న పటేల్‌తో చర్చించారు. అమూల్... అలా మొదలైంది సహకార పద్ధతిలో పాల సేకరణ మంచి ఫలితాలనే ఇస్తున్నా, అధికారుల జోక్యమే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని కురియన్, పటేల్ భావించారు. అందుకే స్వయంగానే ఏదైనా చేద్దామని భావించారు. వారి ఆలోచన నుంచి ‘అమూల్’ పుట్టింది. ఆనంద్‌లో ఏర్పాటు చేసిన ‘అమూల్’ ప్లాంట్‌ను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ‘అమూల్’ ద్వారా పాలపొడి, చీజ్, వెన్న ఉత్పత్తులు ప్రారంభమైన కొద్ది సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. సహకార పద్ధతిలో పాలసేకరణ ద్వారా సాధించిన ఈ విజయం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఆయన కురియన్ను ఆహ్వానించి, దేశానికి పాల కొరత తీర్చాలనే సంకల్పంతో జాతీయ పాడి అభివృద్ధి మండలి (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో దేశంలో క్షీరవిప్లవానికి నాందీప్రస్తావన జరిగింది. ఇక ఆ తర్వాత కురియన్ సాధించిన విజయాలన్నీ చరిత్రను సృష్టించాయి. ఆయన సారథ్యంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికాను భారత్ అధిగమించగలిగింది. కురియన్ చలవ వల్ల లక్షలాది మంది పాడి రైతులు పేదరికం నుంచి బయటపడి స్వయంసమృద్ధిని సాధించగలిగారు. ఈ విజయాలన్నీ కురియన్‌కు ‘పద్మవిభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘అమూల్’ విజయం స్ఫూర్తితో బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్ రూపొందించిన ‘మంథన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం మరో విశేషం. - వర్ఘీస్ కురియన్