teachers shortage
-
పల్లె బడి.. టీచర్లేరీ!
సాక్షి, హైదరాబాద్: పల్లె బడికి కష్టమొచ్చింది. ఉపాధ్యాయ బదిలీలతో అక్కడ బోధన సంకటంలో పడింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేని పరిస్థితి నెలకొంది. టీచర్లు లేకపోవడంతో పిల్లల సంఖ్య కూడా పతనమవుతోంది. నాలుగేళ్ల అనంతరం నిర్వహించిన బదిలీలు కావడంతో గ్రామీణ ప్రాంత బడులు ఖాళీ అయ్యాయి. ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు పట్టణ, జిల్లా, తాలూకా కేంద్రాల్లోని స్కూళ్లకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,150 స్కూళ్లలో పూర్తిస్థాయి టీచర్లకు స్థానచలనం కలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై క్షేత్రస్థాయిలో నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో తాజా బదిలీల తంతు పల్లె బడులను మరింత అఘాతంలోకి నెట్టేసినట్లైంది. 44,361 మందికి స్థానచలనం బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,361 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 2,189 మందికీ స్థానచలనం కలిగింది. మరో 42,172 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా బదిలీ అయ్యారు. దశాబ్దన్నర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు బదిలీ కావడం ఇదే తొలిసారి. తాజా బదిలీల్లో 42 శాతం టీచర్లు పట్టణ ప్రాంతాలకు వచ్చినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పల్లె బడులు బలహీనపడ్డాయి. అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడంతో బోధన ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో టీచర్‌లెస్, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్ల వివరాలను క్షేత్ర స్థాయి నుంచి విద్యా శాఖ సేకరిస్తోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన టీఆర్టీ ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో బోధన కుంటుపడే ప్రమాదం నెలకొంది. విద్యా వలంటీర్లతో భర్తీ బదిలీలతో ఏర్పడిన ఖాళీలతో పాటు సాధారణ ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 16,781 వీవీలను నియమించుకోవాలని డీఈవోలను ఆదేశించింది. మంజూరైన వీవీ పోస్టుల్లో 15,473 మందిని ఉపాధ్యాయ, సెలవులతో ఏర్పడిన ఖాళీలతో భర్తీ చేస్తారు. మరో 1,308 మందిని తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధకులుగా నియమిస్తారు. వీరికి నెలవారీ గౌరవ వేతనంగా రూ.12 వేలు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఛిఛీట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీచర్లు లేని స్కూళ్లు కొన్ని వికారాబాద్ జిల్లా దోమ మండలం కుమ్మరితం డా ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో ఇద్దరూ బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులుండగా 8 పోస్టులున్నాయి. బదిలీలతో ఇక్కడ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ఉన్నత పాఠశాలలో 350 మంది పిల్లలున్నారు. ఇక్కడ 8 మంది టీచర్లుండగా ఆరుగురు పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లా దాదాపూర్ ఉన్నత పాఠశాలలో 550 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ 20 మంది పనిచేస్తుండగా తాజా బదిలీలతో 12 మందికి స్థానచలనం కలిగింది. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆ పాఠశాలకు శాపం
కందుకూరు: పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల పేరు చెబితేనే తల్లిదండ్రులు ముఖం చాటేస్తున్న రోజులివి. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను బతిమాలుకుని పాఠశాలలో చేర్పించాల్సిన పరిస్థితి. అలాంటిది కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. దాదాపు మూతపడే స్థాయిలో ఉన్న ఆ పాఠశాలలో నేడు 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తుల చొరవతో ఆదర్శ పాఠశాలగా ఎదుగుతోంది కానీ ప్రభుత్వ సహకారం పూర్తిగా కరువైంది. కనీసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తిరిగి ప్రైవేట్ పాఠశాలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. వెంకటాద్రిపాలెం గ్రామంలో చదువుకున్న యువకులంతా వెంకటాద్రిపాలెం వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. 2015–16లో కేవలం ఐదుగురు విద్యార్థులే ఉన్న పాఠశాలలో 2017–18 నాటికి 100 మంది విద్యార్థులను చేర్చారు. అలాగే కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా పాఠశాలలో అన్ని వసతులు కల్పించారు. కానీ బోధనకు అవసరమైన ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలో ప్రస్తుతం లేరు. కేవలం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు. వీరిలో ఒకరు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాల హెచ్‌ఎంతోపాటు గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది పాఠశాల ప్రారంభం కాకముందు నుంచే ఉపాధ్యాయుల నియామకం కోసం గ్రామస్తులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల ప్రారంభమై 20 రోజులు గడిచినా ఇంత వరకు ఉపాధ్యాయులను నియమించలేదు. ఇప్పటికే ఇద్దరు విద్యా వలంటీర్లను గ్రామస్తులు నియమించుకున్నారు. వీరికి ప్రతి నెలా రూ.25 వేల జీతాన్ని గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి చెల్లిస్తున్నారు. ఉపాధ్యాయుల కోసం ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఉంటే తమ పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని, తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఊదరగొడుతున్న సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి ఏ విధంగా పాటుపడుతోందో చెప్పడానికి వెంకటాద్రిపాలెం పాఠశాల నిదర్శనం. -
ఇంకా చెట్ల కింద చదువులా!
♦ విద్యార్థులను వేధిస్తున్న గదుల కొరత ♦ వరండాల్లో సాగుతున్న చదువులు ♦ అనుమతులున్నా ప్రారంభంకాని ♦ 94 పాఠశాలల గదుల నిర్మాణం ♦ అవస్థల్లో విద్యార్థులు, టీచర్లు ♦ కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత కడప ఎడ్యుకేషన్ : స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారనే చెప్పాలి. నేటికి జిల్లాలో చాలా పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తూనే ఉంది. దీంతో విద్యార్థులు చెట్లకింద, వండాలలో చదువులను కొనసాగిస్తున్నారు. విద్యాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని ప్రభుత్వ చేస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారు. బడిఈడు పిల్లలనందరిని బడిలో చేర్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా ‘బడిపిలుస్తోంది’ పేరుతో గ్రామాల్లో యాత్రలు నిర్వహించి తల్లిదండ్రులో చైతన్యం తీసుకొచ్చి పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. అయితే వారికి సరైన వసతులు లేక వారు మళ్లీ బడిబయట బాటే పడుతున్నారు. దీంతో చాలామంది నిరక్షరాస్యులుగానే మిలిగిపోతున్నారు. రాయచోటి మండలంలో దిగువ అబ్బవరం, కమ్మపల్లె, కురువపల్లె, అహమ్మద్‌నగర్, సంబేపల్లె మండలం దిగువరాజుపల్లె, ఎల్‌ఆర్‌పల్లె మండలంలో పీఆర్కేనగర్ ప్రాథమిక పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తుంది. అలాగే ఎర్రగుంట్ల మండలంలోని జిల్లా పరిషత్తు పాఠశాలలో 11వందల మంది విద్యార్థులుంటే సరిపడా గదులు లేక చెట్ల కింద వరండాల్లో చదువులను సాగిస్తున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఆరోజు ఆ తరగతులకు సెలవులను ప్రకటించాల్సిందే. ఉపాధ్యాయులు కావలెను అంతేకాకుండా ఎర్రగుంట్ల హైస్కూల్లో ఉపాధ్యాయులు కొతర కూడా వేధిస్తోంది. ఈ పాఠశాలలో 13మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా ఇటీవల విద్యార్థుల విజ్ఞిప్తి మేరకు నలుగురిని కేటాయించారు. అలాగే చిలంకూరు జెడ్పీ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత ఉంది. వల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా గదుల కొరత వేధిస్తోంది. ఈ ఏడాది హైస్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య పెరగటంతో అక్కడక్కడ ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఎస్జీటీలకు సంబంధించి ఇటీవల పిల్ల లు లేక పాఠశాలలు మూతపడటంతో పాటు రేషనలైజేషన్ చేయగా చాలామం ది మిగిలిపోయారు. దీనికి తోడు ఇటీవల డీఎస్సీ ద్వారా 124మంది రాగా వారిలో 14మందికి మాత్రమే పాఠశాలలను కేటాయించారు. మిగతా 110మందికి చోటులేక వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశారు. అలాగే గతేడాది జరిగిన రేషనలైజేషన్ కారణంగా జిల్లాలో 3వందలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆ పాఠశాలకు చెందిన 106 మంది మిగులుగా ఉన్నారు. వీరిలో 26మందికి మాత్రమే స్థానాలను కేటాయించగా మిగతా 80 మంది మిగులుగా ఉన్నారు. వీరితోపాటు ఇటీవల అంతర్‌జిల్లాల బదిలీల్లో భాగంగా 38మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి కడపకు వచ్చారు. వీరిలో నలుగురికి మాత్రమే స్థానాలను కేటాయించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 200మందికి పైగా ఉపాధ్యాయులను వివిధ మోడల్ పాఠశాలలతోపాటు పలు పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. అంటే వీరందరూ ఉద్యోగం ఒకచోట చేస్తుంటే జీతం మరోచోట తీసుకుంటున్నారన్నమాట. మిగిలిన ఉపాధ్యాయుల్లో కొందరిని సంబేపల్లి, పొద్దుటూరు, కడప, జమ్మలమడుగులతోపా టు పలు మండలాల్లోని డిప్యూటీ డీఈఓ, ఎంఈఓల వద్ద అదనపు ఉపాధ్యాయులను పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్య పెరిగినా కొతంమంది సెలవుపై వెళ్లినా వారి స్థానాలకు కొందరిని పంపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. -
సమస్యలు చదవండి
- జిల్లాలో పాఠ్య పుస్తకాల కొరత - ఇప్పటి వరకు జిల్లాకు చేరింది 14.54 లక్షల పుస్తకాలే - ఇబ్బంది పడుతున్న విద్యార్థులు - పట్టి పీడిస్తున్న ఉపాధ్యాయుల కొరత - పాఠశాలల్లో వసతులు అంతంతమాత్రమే సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సమస్యల చదువు కొనసాగించాల్సి వస్తోంది. సర్కారు స్కూళ్లలో సమస్యలు తిష్టవేశాయి. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే అవకాశం కనుచూపు మేరలో కనిపించడంలేదు. దీనికితోడు జిల్లాలో ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చివరి స్థానం వచ్చింది. ఈ ఏడాదైనా మంచి ఫలితాలు సాధించేలా దిద్దుబాటు చర్యలకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయలేదు. చౌడేపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు తాళం వేసి ఆందోళన చేసినా అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్లు లేదు. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం జరగలేదు. పాఠశాలలు తెరిచేనాటికే పుస్తకాలు స్కూళ్లకు చేరాలి. ఈ ఏడాది ఇంతవరకు సుమారు 9.21లక్షల పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు జిల్లాకు చేరలేదు. ఇవి ముద్రణ కార్యాలయాల నుంచి జిల్లాకు సరఫరా కావడం, అక్కడి నుంచి మండల కేంద్రాలకు, మళ్లీ పాఠశాలలకు చేరేసరికి తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. సరఫరా అయిన పుస్తకాలు పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా కాలేదు. అందులో సగం మాత్రమే కొన్ని పాఠశాలలకు చేరాయి. 6,7 తరగతులకు సంబంధించి హిందీ, తెలుగు పుస్తకాలు అసలే సరఫరా కాలేదు. 1,2 తరగతులకు తెలుగు, ఇంగ్లిషు పుస్తకాలు రాలేదు. ఇలా కొన్ని తరగతులకు అన్నీ పుస్తకాలు వచ్చినా, విద్యార్థుల సంఖ్యలో సగానికి మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో కొన్ని చోట్ల ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేదు. మొత్తం మీద పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. భర్తీకాని టీచర్ పోస్టులు... పాఠశాలలు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. డీఎస్సీ ఫలితాలను విడుదల చేసినప్పటికీ, మెరిట్ జాబితాలను ఇంతవరకు విడుదల చేయకపోవడంతో పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. దీంతో చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. జిల్లాలో సెకండరీ గ్రేడ్ పోస్టులు 889, స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ పండిట్ పోస్టులు కలిపి 1336 ఖాళీలున్నాయి. దీంతో కొన్నిచోట్ల పాఠశాలలు మూత పడే అవకాశం ఉంది. -
చదువు సాగేదెట్టా..?
ఖమ్మం : సర్కార్ బళ్లలో సార్లు లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు చదువు చెప్పేదెవరంటూ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, రవాణా సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోని పాఠశాలల్లో పరిమితికి మించి ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ మారుమూల గ్రామాల్లో పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులే కరువయ్యారు. ఆయా గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు వారు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లాలోని 45 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆ పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి తెరిచిన నాధుడే కరువయ్యాడు. ఈ క్రమంలో తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలా..? అంటూ ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత కాలం విద్యా వలంటీర్లు, డిప్యుటేషన్‌పై వచ్చిన టీచర్లతో నిర్వహించిన ఈ పాఠశాలను ఈ ఏడాది ఏ విధంగా కొనసాగించాలా..? అంటూ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. డిప్యుటేషన్లపైనే ఆశలు... జిల్లాలో 1620 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పట్లో నూతన ఉపాధ్యాయుల నియామకాలు లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హరీశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మరోపక్క విద్యావలంటీర్లను నియమించేది లేదని ఆర్వీఎం అధికారులు తేల్చి చెప్పారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయులే లేని 45 పాఠశాలలను ఏ విధంగా తెరవాలా..? అంటూ విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గత ఏడాది ఏదో విధంగా సమీపంలో ఉన్న పాఠశాలల నుంచి ఒకో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఆయా పాఠశాలలకు పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు కాదనలేక వారు సైతం తప్పనిపరిస్థితుల్లో అక్కడికి వెళ్లారు. గత విద్యాసంవత్సరం వరకు ఉన్న డిప్యుటేషన్ రద్దు కావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సంవత్సరం తిరిగి డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గత సంవత్సరం డిప్యుటేషన్‌పై వెళ్లి ఉపాధ్యాయుల్లో కొంత మంది తిరిగి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం అసలే ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు వెళ్లి ఇబ్బంది పడడం ఎందుకని వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో 686 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు(ఏకోపాధ్యాయ) మాత్రమే ఉన్నారు. ఏ కారణంతోనైనా ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోతే ఆ రోజు ఇక తాళం వేయాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం: డీఈఓ జిల్లాలో 45 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, కానీ ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సమీప పాఠశాలల్లోని ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపిస్తామని, అందుకోసం కలెక్టర్ అనుమతి కోరుతున్నామని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో డిప్యుటేషన్ ఆర్డర్ ఇస్తామని డీఈఓ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిప్యుటేషన్ వేసిన ఉపాధ్యాయులు తప్పకుండా ఆయా పాఠశాలలకు వెళ్లాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, ఇతర ఉపాధ్యా పోస్టుల అవసరంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అన్నారు. నూతన డీఎస్సీ ద్వారా జిల్లాలోని ఖాళీలు భర్తీ చేస్తామని డీఈఓ అన్నారు.