సమస్యలు చదవండి
- జిల్లాలో పాఠ్య పుస్తకాల కొరత
- ఇప్పటి వరకు జిల్లాకు చేరింది 14.54 లక్షల పుస్తకాలే
- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
- పట్టి పీడిస్తున్న ఉపాధ్యాయుల కొరత
- పాఠశాలల్లో వసతులు అంతంతమాత్రమే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సమస్యల చదువు కొనసాగించాల్సి వస్తోంది. సర్కారు స్కూళ్లలో సమస్యలు తిష్టవేశాయి. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే అవకాశం కనుచూపు మేరలో కనిపించడంలేదు. దీనికితోడు జిల్లాలో ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చివరి స్థానం వచ్చింది. ఈ ఏడాదైనా మంచి ఫలితాలు సాధించేలా దిద్దుబాటు చర్యలకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయలేదు. చౌడేపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు తాళం వేసి ఆందోళన చేసినా అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్లు లేదు. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం జరగలేదు.
పాఠశాలలు తెరిచేనాటికే పుస్తకాలు స్కూళ్లకు చేరాలి. ఈ ఏడాది ఇంతవరకు సుమారు 9.21లక్షల పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు జిల్లాకు చేరలేదు. ఇవి ముద్రణ కార్యాలయాల నుంచి జిల్లాకు సరఫరా కావడం, అక్కడి నుంచి మండల కేంద్రాలకు, మళ్లీ పాఠశాలలకు చేరేసరికి తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. సరఫరా అయిన పుస్తకాలు పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా కాలేదు. అందులో సగం మాత్రమే కొన్ని పాఠశాలలకు చేరాయి. 6,7 తరగతులకు సంబంధించి హిందీ, తెలుగు పుస్తకాలు అసలే సరఫరా కాలేదు. 1,2 తరగతులకు తెలుగు, ఇంగ్లిషు పుస్తకాలు రాలేదు. ఇలా కొన్ని తరగతులకు అన్నీ పుస్తకాలు వచ్చినా, విద్యార్థుల సంఖ్యలో సగానికి మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో కొన్ని చోట్ల ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేదు. మొత్తం మీద పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
భర్తీకాని టీచర్ పోస్టులు...
పాఠశాలలు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. డీఎస్సీ ఫలితాలను విడుదల చేసినప్పటికీ, మెరిట్ జాబితాలను ఇంతవరకు విడుదల చేయకపోవడంతో పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. దీంతో చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. జిల్లాలో సెకండరీ గ్రేడ్ పోస్టులు 889, స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ పండిట్ పోస్టులు కలిపి 1336 ఖాళీలున్నాయి. దీంతో కొన్నిచోట్ల పాఠశాలలు మూత పడే అవకాశం ఉంది.