♦ విద్యార్థులను వేధిస్తున్న గదుల కొరత
♦ వరండాల్లో సాగుతున్న చదువులు
♦ అనుమతులున్నా ప్రారంభంకాని
♦ 94 పాఠశాలల గదుల నిర్మాణం
♦ అవస్థల్లో విద్యార్థులు, టీచర్లు
♦ కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత
కడప ఎడ్యుకేషన్ : స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారనే చెప్పాలి. నేటికి జిల్లాలో చాలా పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తూనే ఉంది. దీంతో విద్యార్థులు చెట్లకింద, వండాలలో చదువులను కొనసాగిస్తున్నారు. విద్యాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని ప్రభుత్వ చేస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారు. బడిఈడు పిల్లలనందరిని బడిలో చేర్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా ‘బడిపిలుస్తోంది’ పేరుతో గ్రామాల్లో యాత్రలు నిర్వహించి తల్లిదండ్రులో చైతన్యం తీసుకొచ్చి పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు.
అయితే వారికి సరైన వసతులు లేక వారు మళ్లీ బడిబయట బాటే పడుతున్నారు. దీంతో చాలామంది నిరక్షరాస్యులుగానే మిలిగిపోతున్నారు. రాయచోటి మండలంలో దిగువ అబ్బవరం, కమ్మపల్లె, కురువపల్లె, అహమ్మద్‌నగర్, సంబేపల్లె మండలం దిగువరాజుపల్లె, ఎల్‌ఆర్‌పల్లె మండలంలో పీఆర్‌కేనగర్ ప్రాథమిక పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తుంది. అలాగే ఎర్రగుంట్ల మండలంలోని జిల్లా పరిషత్తు పాఠశాలలో 11వందల మంది విద్యార్థులుంటే సరిపడా గదులు లేక చెట్ల కింద వరండాల్లో చదువులను సాగిస్తున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఆరోజు ఆ తరగతులకు సెలవులను ప్రకటించాల్సిందే.
ఉపాధ్యాయులు కావలెను
అంతేకాకుండా ఎర్రగుంట్ల హైస్కూల్‌లో ఉపాధ్యాయులు కొతర కూడా వేధిస్తోంది. ఈ పాఠశాలలో 13మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా ఇటీవల విద్యార్థుల విజ్ఞిప్తి మేరకు నలుగురిని కేటాయించారు. అలాగే చిలంకూరు జెడ్పీ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత ఉంది. వల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా గదుల కొరత వేధిస్తోంది. ఈ ఏడాది హైస్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య పెరగటంతో అక్కడక్కడ ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఎస్‌జీటీలకు సంబంధించి ఇటీవల పిల్ల లు లేక పాఠశాలలు మూతపడటంతో పాటు రేషనలైజేషన్ చేయగా చాలామం ది మిగిలిపోయారు. దీనికి తోడు ఇటీవల డీఎస్సీ ద్వారా 124మంది రాగా వారిలో 14మందికి మాత్రమే పాఠశాలలను కేటాయించారు. మిగతా 110మందికి చోటులేక వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశారు. అలాగే గతేడాది జరిగిన రేషనలైజేషన్ కారణంగా జిల్లాలో 3వందలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి.
ఆ పాఠశాలకు చెందిన 106 మంది మిగులుగా ఉన్నారు. వీరిలో 26మందికి మాత్రమే స్థానాలను కేటాయించగా మిగతా 80 మంది మిగులుగా ఉన్నారు. వీరితోపాటు ఇటీవల అంతర్‌జిల్లాల బదిలీల్లో భాగంగా 38మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి కడపకు వచ్చారు. వీరిలో నలుగురికి మాత్రమే స్థానాలను కేటాయించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 200మందికి పైగా ఉపాధ్యాయులను వివిధ మోడల్ పాఠశాలలతోపాటు పలు పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. అంటే వీరందరూ ఉద్యోగం ఒకచోట చేస్తుంటే జీతం మరోచోట తీసుకుంటున్నారన్నమాట. మిగిలిన ఉపాధ్యాయుల్లో కొందరిని సంబేపల్లి, పొద్దుటూరు, కడప, జమ్మలమడుగులతోపా టు పలు మండలాల్లోని డిప్యూటీ డీఈఓ, ఎంఈఓల వద్ద అదనపు ఉపాధ్యాయులను పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్య పెరిగినా కొతంమంది సెలవుపై వెళ్లినా వారి స్థానాలకు కొందరిని పంపుతూ కాలం వెళ్లదీస్తున్నారు.