సాక్షి, హైదరాబాద్: పల్లె బడికి కష్టమొచ్చింది. ఉపాధ్యాయ బదిలీలతో అక్కడ బోధన సంకటంలో పడింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేని పరిస్థితి నెలకొంది. టీచర్లు లేకపోవడంతో పిల్లల సంఖ్య కూడా పతనమవుతోంది. నాలుగేళ్ల అనంతరం నిర్వహించిన బదిలీలు కావడంతో గ్రామీణ ప్రాంత బడులు ఖాళీ అయ్యాయి. ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు పట్టణ, జిల్లా, తాలూకా కేంద్రాల్లోని స్కూళ్లకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,150 స్కూళ్లలో పూర్తిస్థాయి టీచర్లకు స్థానచలనం కలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై క్షేత్రస్థాయిలో నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో తాజా బదిలీల తంతు పల్లె బడులను మరింత అఘాతంలోకి నెట్టేసినట్లైంది.
44,361 మందికి స్థానచలనం
బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,361 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 2,189 మందికీ స్థానచలనం కలిగింది. మరో 42,172 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా బదిలీ అయ్యారు. దశాబ్దన్నర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు బదిలీ కావడం ఇదే తొలిసారి. తాజా బదిలీల్లో 42 శాతం టీచర్లు పట్టణ ప్రాంతాలకు వచ్చినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పల్లె బడులు బలహీనపడ్డాయి. అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడంతో బోధన ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో టీచర్‌లెస్, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్ల వివరాలను క్షేత్ర స్థాయి నుంచి విద్యా శాఖ సేకరిస్తోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన టీఆర్టీ ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో బోధన కుంటుపడే ప్రమాదం నెలకొంది.
విద్యా వలంటీర్లతో భర్తీ
బదిలీలతో ఏర్పడిన ఖాళీలతో పాటు సాధారణ ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 16,781 వీవీలను నియమించుకోవాలని డీఈవోలను ఆదేశించింది. మంజూరైన వీవీ పోస్టుల్లో 15,473 మందిని ఉపాధ్యాయ, సెలవులతో ఏర్పడిన ఖాళీలతో భర్తీ చేస్తారు. మరో 1,308 మందిని తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధకులుగా నియమిస్తారు. వీరికి నెలవారీ గౌరవ వేతనంగా రూ.12 వేలు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఛిఛీట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్‌నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
టీచర్లు లేని స్కూళ్లు కొన్ని
- వికారాబాద్ జిల్లా దోమ మండలం కుమ్మరితం డా ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో ఇద్దరూ బదిలీ అయ్యారు.
- రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులుండగా 8 పోస్టులున్నాయి. బదిలీలతో ఇక్కడ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి.
- మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ఉన్నత పాఠశాలలో 350 మంది పిల్లలున్నారు. ఇక్కడ 8 మంది టీచర్లుండగా ఆరుగురు పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యారు.
- వికారాబాద్ జిల్లా దాదాపూర్ ఉన్నత పాఠశాలలో 550 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ 20 మంది పనిచేస్తుండగా తాజా బదిలీలతో 12 మందికి స్థానచలనం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment