- డివిజన్లు దాటుతుండడంపై పలువురి అభ్యంతరం
- నేతల ఒత్తిడితోనే ఉత్తర్వులు జారీ?
- కీలకపాత్ర పోషిస్తున్న జెడ్పీ క్యాంపు కార్యాలయం కోటరీ
జిల్లా పరిషత్ : జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరిన తర్వాత తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గీసుకొండ ఎంపీడీఓ పారిజాతంను డిప్యూటేషన్‌పై దుగ్గొండి మండలానికి, మహబూబాబాద్ డివిజన్‌లోని కేసముద్రం ఎంపీడీఓకు వరంగల్ డివిజన్‌లోని ఆత్మకూరు మండల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించండం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ మండలాల్లోని ఎంపీడీఓలను మార్చాలని ఇటీవల జెడ్పీ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు.
బదిలీలపై ఆంక్షలు ఉండడంతో అలా చేయడం వీలుకాదని జెడ్పీ అధికారులు సదరు ఎమ్మెల్యేలకు తెలి పారు. అయినా కొందరు ఎమ్మెల్యేలు తమ మండలంలో పాత ఎంపీడీఓలను కొనసాగించొద్దని పట్టు పట్టడంతో జెడ్పీ చైర్‌పర్సన్ సిఫారసు చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా, గీసుకొండ ఎంపీడీఓ పారిజాతంను తన నియోజకవర్గంలో పనిచేయకుండా సెలవుపై వెళ్లాలని పరకాల ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. పాత ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నట్లు పార్టీ శ్రేణులు ఇచ్చిన సమాచారంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
దీంతో ఆమె స్వయంగా మొగుళ్లపల్లి, దుగ్గొండి మండలాలకు బదిలీ చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను కోరగా.. బదిలీలపై నిషేధం ఉన్న దృష్ట్యా డిప్యూటేషన్‌పై దుగ్గొండి మండలంలో పోస్టింగ్ ఇచ్చా రు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలుస్తున్నా.. పారి జాతం శనివారం దుగ్గొండిలో విధుల్లో చేరారు. కాగా, ఆమె నియామకంపై నర్సంపేట ఎమ్మెల్యే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇదేవిధంగా మరికొన్ని మండలాల్లో ఎంపీడీఓలు కొత్త నేతలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
క్యాంపులో కోటరీ?
జిల్లా పరిషత్ పాలన వ్యవహారాల్లో క్యాంపు కార్యాలయం కీలకంగా మారింది. జెడ్పీలోని ఇద్దరు అధికారులు, క్యాంపు కార్యాలయంలోని ఉద్యోగితో పాటు మరో మాజీ అధికారి కోటరీగా ఏర్పడినట్లు సమాచారం. పాలనాపరమైన నిర్ణయాల ఫైళ్లు జెడ్పీలో అధికారులపరిశీలన అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నాయి.
అక్కడే క్యాంపులోని సలహాలు ఇస్తున్న ఉద్యోగి కనుసన్నల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, చైర్‌పర్సన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాలని అనుకున్న అధికారులకు కూడా.. సీసీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ముందు ఏమీ చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాకుండా జెడ్పీలో కీలక అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి కొద్దిరోజులుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
సదరు అధికారి సూచనలతోనే గీసుకొండ ఎంపీడీఓకు డిప్యూటేషన్, ఆత్మకూరు ఎంపీడీఓగా కేసముద్రం ఎంపీడీఓకు అదనపు బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు డివిజన్ పరిధిలోనే జరిగేవి. ఇదే విషయాన్ని సెక్షన్ అధికారులు సదరు ఉద్యోగి దృష్టికి తీసుకుపోగా.. మంగపేట ఎంపీడీఓ భారతికి పరకాల మండ లం ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తుచేసినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో మంగపేట మండలంలో ఎన్నికలు వాయిదా పడిన విషయాలన్ని ఆయన గుర్తించకపోవడం గమనార్హం.
ఫైళ్లకు చలనం..
మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు చలనం తె చ్చే ప్రయత్నంలో క్యాంపులోని కోటరీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించి సస్పెండ్‌కు గురైన ఉద్యోగికి పోస్టింగ్ ఇచ్చేందుకు గతంలో జెడ్పీ సీఈఓలుగా పని చేసిన వారు అంగీకరించలేదు. అదే ఉద్యోగి కొత్తగా వచ్చిన చైర్‌పర్సన్‌కు దరఖాస్తు పెట్టుకోగా సానుకూలం గా స్పందించి ఆదేశాలు జారీ చేయడం చర్చనీ యాం శంగా మారింది.
ఇదే కాకుండా పెండింగ్‌లో ఉన్న మరి కొన్ని పైళ్లకు మోక్షం లభించి త్వరలోనే నిర్ణయాలు వెలువడనున్నట్లు జెడ్పీలో ప్రచారం జరుగుతోంది. కాగా, జెడ్పీలో కీలకంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు క్యాంపు కార్యాలయంలోని ఉద్యోగి సహకారంతో ఈ నిర్ణయాలు జరుగుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.