- దళారులకు అడ్డాగా మారిన డీఈఓ కార్యాలయం
- పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్
సంగారెడ్డి మున్సిపాలిటీ: ముడుపులు చెల్లించుకుంటే చాలు కొరుకున్న చోటుకు డిప్యూటేషన్‌పై పోస్టింగ్.. ఇందుకు డీఈఓ కార్యాలయం కేంద్రబిందువుగా మారింది. జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు డీఈఓ కార్యాలయంలోని ఒక ముఖ్య అధికారి ద్వారా అక్రమ డిప్యుటేషన్లు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి తీరుపై ఇన్‌చార్జి కలెక్టర్ పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి పెరిగిపోతుంది. బుధవారం తాజాగా సిద్ధిపేట డివిజన్‌కు సంబంధించిన 9 మందిని వారు కోరుకున్న చోటుకు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు.
దీంతో ఇద్దరున్న పాఠశాలలో ఒక టీచరు వెళ్లిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ఇప్పటికే ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల నుంచి ఒకరిని డిప్యుటేషన్‌పై పంపి ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఐదు తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
నిబంధనల ప్రకారం వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద ఎక్కువగా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులను టీచర్లు లేని పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించాలని నిబంధనలు ఉన్నాయి. కాని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల పైరవీలకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు పాటించకుండానే డిప్యుటేషన్లు వేస్తున్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా అల్లాదుర్గ్ మండలం గొల్లకుంట తండాలో పనిచేస్తున్న శ్రీలతను నిబంధనలకు విరుద్ధంగా సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపారు.
ఆమె పనిచేస్తున్న పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. సిద్ధిపేట డివిజన్‌లో సైతం మంత్రి, ఎమ్మెల్సీలు సిఫార్సు చేశారంటూ డిప్యుటీ డీఈఓ నేరుగా డిప్యుటేషన్లపై బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా తీసుకుని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని ముఖ్య అధికారి ఒకరు మంత్రులు సమర్పించిన జాబితాలో మామూళ్లు దండుకుని అదనంగా మరికొన్ని పేర్లు చేర్చి డిప్యుటేషన్లు వేస్తున్నారు. ఫలితంగా నిరుపేద విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. వీటిపై కలెక్టర్ దృష్టి సారించి అక్రమ డిప్యుటేషన్‌లను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా నిబంధనల మేరకే డిప్యుటేషన్లు వేస్తున్నామని పొంతన లేని సమాధానం ఇచ్చారు.