శ్రీకాకుళం పాతబస్టాండ్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ)కు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు జిల్లాకు చెందిన అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీని గడువు ముగిసినా ఇప్పటివరకు ఒక్క అధికారి మాత్రమే వెళ్లడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. జిల్లా నుంచి వివిధ క్యాడర్లకు చెందిన 21 మంది అధికారులను సీఆర్‌డీఏకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూ పరిపాలనా విభాగం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి కనీసం ఎనిమిది మంది డిప్యూటీ తహశీల్దార్లు, మరో ఎనిమిది మంది తహశీల్దార్లను డిప్యుటేషన్‌పై పంపించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వీరికి అదనంగా శ్రీకాకుళం జిల్లా నుంచి డ్వామా పీడీ కూర్మనాథ్, జెడ్పీ సీఈవో వసంతరావు, భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) సుదర్శన్‌దొర , మరో ఎస్డీసీ బాలాత్రిపుర సుందరీ, కలెక్టర్ పీఎస్ సూర్యనారాయణలను కూడా పంపాలని ఆదేశించింది.
ఈ నెల పదో తేదీలోగా వీరందరినీ రాష్ట్ర భూపరిపాలన విభాగానికి అప్పజెప్పాలని కోరింది. ఆ గడువు ఇప్పటికే ముగిసింది. అయితే కలెక్టర్ పీఎస్ మాత్రమే ఇంతవరకు రిలీవై వెళ్లారు. మిగిలిన వారెవరూ ఇంతవరకు రిలీవ్ కాలేదు. ఇద్దరు డీటీసీ క్యాడర్ అధికారులు తప్ప మిగిలినవారు సీఆర్‌డీఏకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే దీనికి కారణమని తెలిసింది. భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న బీవీ మోహనరావు, మీ సేవా విభాగంలో పనిచేస్తున్న ప్రభాకర్‌లు మాత్రమే రాతపూర్వకంగా సుముఖత వ్యక్తం చేశారు. స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ హోదాలో ఉన్న డ్వామా పీడీ కూర్మనాథ్ కొన్ని వారాల క్రితమే బదిలీపై జిల్లాకు వచ్చినందున, మరో ఎస్‌డీసీ త్రిపురసుందరి అనారోగ్య కారణాలతో సీఆర్‌డీఏకు వెళ్లలేమని తేల్చి చెప్పారు.
జిల్లాపరిషత్ సీఈవో వసంతరావు, ఎస్డీసీ సుదర్శనదొరలు ఎన్నికల విధుల్లో ఉన్నందున వీరిని ఇతర ప్రాంతాలకు పంపడం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది. ఈ నలుగురికి సంబంధించిన వివరాలను జిల్లా యంత్రాంగం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి నివేదించింది. వీరు కాక మిగిలిన 14 మంది తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు కూడా వెళ్లేందుకు ముందుకు రావడం లేదు. కాగా సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్న కొంతమంది తమకు డీటీలుగా పదోన్నతి కల్పిస్తే ఆరు నెలలు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. దీని సాధ్యాసాధ్యాలను జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రయోజనాలున్నా..
సీఆర్‌డీఏకు డిప్యుటేషన్‌పై వెళ్తే ఆర్థికంగా ప్రయోజనాలున్నా సీఎం కనుసన్నల్లో పని చేసేందకు భయపడే అధికారులు వెనుకంజ వేస్తున్నారని తెలిసింది. డిప్యుటేషన్‌పై వెళ్లేవారికి ప్రాజెక్టు అలవెన్సు కింద 30 శాతం జీతం అదనంగా లభిస్తుంది. హెచ్‌ఆర్‌ఏ 30 శాతం, ప్రతి నెలా రూ.3 వేల టీఏ కూడా లభిస్తాయి. అయితే సీఆర్‌డీఏ వ్యవహారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, అధికార ఒత్తిళ్లను తట్టుకోవడం కష్టమని, అదే కాకుండా కుటుంబాలు, పిల్లల చదువుల పరంగా ఇబ్బందులు, అనారోగ్యం వంటి కారణాలు చూపుతూ మిగిలిన అధికారులు ముందుకు రావడంలేదు.
మేం రాము బాబూ..!
Published Wed, Jan 14 2015 4:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement