సాక్షి, హైదరాబాద్: కరువు.. కరువు.. కరువు! అంతా కరువే. రాష్ట్రంలో వ్యవసాయం చేయబోతే కరువు. జిల్లాల్లో వ్యవసాయశాఖలో సిబ్బంది, అధికారులు కరువు. మంత్రి ఆదేశాలకు స్పందన కరువు. అన్నదాత గోడును ఆలకించేనాథుడు కరువు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇవ్వడానికి పొలంబాట పట్టాల్సిన వ్యవసాయశాఖ అధికారులు డిప్యుటేషన్లపై రాజధానికి, పట్టణాలకు వెళ్లిపోయారు. డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారన్న ప్రచారం ఉంది.
అంతా ఏవో, ఏడీఏ స్థాయి అధికారులే...
వ్యవసాయశాఖలో దాదాపు 120 వ్యవసాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేడీఏ స్థాయిలో 20 వరకూ ఖాళీలున్నాయి. ఒక్క జిల్లా మినహా మిగతా 8 జిల్లాలకు ఇన్‌చార్జులే జేడీఏలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడంలేదు. ఈ నేపథ్యంలో పనిచేస్తున్న కొద్ది మంది అధికారులు కూడా సమీప పట్టణాలు, రాజధాని బాట పట్టారు.
కీలకమైన ఏవో, ఏడీఏ స్థాయి అధికారులు దాదాపు 100 మంది రాజధాని హైదరాబాద్, కొద్దిమంది పక్క జిల్లాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 17 మంది వ్యవసాయాధికారులు డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ ఇద్దరు, ఖమ్మం ముగ్గురు, మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు డిప్యుటేషన్‌పైనే బయట పనిచేస్తున్నారు.
డిప్యుటేషన్‌పై వెళ్లిన వారిని వెనక్కు పంపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వ్యవసాయ ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోవడంలేదు. మెదక్ జిల్లాకు చెందిన ఒక ఏడీఏ స్థాయి అధికారిని తీసుకొచ్చి హైదరాబాద్ కమిషనరేట్‌లో సాధారణ బాధ్యతల్లో ఉంచారు. తమ జిల్లాకు చెందిన కొందరు డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లో పనిచేస్తున్నారని, దీనివల్ల రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారే లేకుండా పోయారని ఇటీవల మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విన్నవించారు.
దీంతో డిప్యుటేషన్లను రద్దు చేసి ఎక్కడివారిని అక్కడకు వెనక్కు పంపాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ మంత్రి ఆదేశాలను పట్టించుకునే నాథుడే లేరు. పైగా ఎవరూ ఎక్కడికి పోవాల్సిన పనిలేదని ఉన్నతాధికారులు ఉద్యోగులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి పోచారం, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథిల వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
పల్లెల్లో కరువు.. రాజధానిలో ‘వ్యవసాయం’
Published Tue, Sep 22 2015 3:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement