
న్యూఢిలీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఇరు పక్షాల మధ్య మరింత అగ్గి రాజేసింది. తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఏకపక్షంగా సమన్లు జారీ చేసింది.
ఐపీఎస్ అధికారులైన భోలనాథ్ పాండే (డైమండ్ హార్బర్ ఎస్పీ), ప్రవీణ్ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్), రాజీవ్ మిశ్రా (ఏడీజీ, సౌత్ బెంగాల్) నడ్డా బెంగాల్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు వారిని కేంద్రానికి డిప్యుటేషన్ రావాల్సిందిగా హోంశాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా పోలీసు అధికారుల్ని కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌కి రమ్మంటే ముందస్తుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా ఈ సమన్లు జారీ చేసింది.
శాంతి భద్రతలు రాష్ట్ర అంశం: మమతా సర్కార్ ఎదురు దాడి
నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించడానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంపై మమతా సర్కార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేంద్రం అందులో తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి లేఖ రాశారు.
నిబంధనలేమంటున్నాయి?
కేంద్ర డిప్యుటేషన్‌కు రమ్మని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఐపీఎస్ అధికారులు తప్పక పాటించాలని, వేరే ఆప్షన్ ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి ఉత్తర్వులు పొందిన ఐపీఎస్ ఆఫీసర్లను సదరు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రిలీవ్ చేయాల్సిఉంటుంది. ఐపీఎస్ రూల్స్– 1954 ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు వస్తే, రాష్ట్రాలు కేంద్ర ఆదేశాన్ని అనుసరించక తప్పదు.
సమాధానం ఇవ్వకపోతే: మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 267 ఫిర్యాదుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తప్పు పట్టింది. మరో 15 రోజుల్లో మమతా సర్కార్ ఏమీ మాట్లాడకపోతే ఆ ఫిర్యాదుల్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖ శర్మ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment