సాక్షి, పశ్చిమగోదావరి : చింతలపూడి మండలం ఉర్లగూడెం గ్రామంలో ఇద్దరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారన్న వదంతులు వ్యాపించడంతో శుక్రవారం గ్రామంలో కలకలం రేగింది. అయితే తమ గ్రామంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ జి.రామారావును వివరణ కోరగా గురువారం పాఠశాల వద్ద ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని వెళ్లి విచారణ జరిపానని చెప్పారు. తన విచారణలో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొట్టుకున్నారని వారిలో ఒక విద్యార్థినికి గాయాలవ్వడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై అడగడానికి వచ్చామని గ్రామస్తులు చెప్పినట్లు తెలిపారు. ఉమామహేశ్వరరావు, రాజశేఖర్ అనే ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలలకు మార్చమని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
శుక్రవారం ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు పెట్టడంతో డెప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయినిని నియమించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులపై చాలాకాలంగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన సంఘటనలో కూడా పాఠశాలలో అసాంఘిక చర్యలకు పాల్పడటంతోనే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చెలరేగి ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి జరిమానా కూడా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవిని వివరణ కోరగా శనివారం పాఠశాలకు వెళ్లి విచారణ జరుపుతానని తెలిపారు. విచారణలో ఉపాధ్యాయులపై ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment