WEST GODAVRI
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు
సాక్షి, ఏలూరు: ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ జయరాజ్ కొంత కాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తోటి మహిళా ఉద్యోగిణి దిశా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. జయరాజ్ ను.. ఎన్నిసార్లు మందలించిన వినడంలేదని, వేధింపులు భరించలేకపోయాయని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి -
పక్కా స్కెచ్‌తో బ్యాంక్‌ను బురిడి కొట్టించారు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార అవసరాల పేరిట కెనరా బ్యాంక్‌ను బురిడీ కొట్టించారు రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు. రూ.338 కోట్ల రుణం తీసుకుని చెల్లించకుండా ఎగ నామం పెట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరం వై.జంక్షన్‌కు చెందిన తోట కన్నారావు, అతని భార్య వెంకట రమణ పశ్చిమ గోదావరి జిల్లా ఐ.పంగిడిలో విత్త నాల వ్యాపారం పేరుతో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడ ర్స్ ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు డైరెక్టర్లుగా ఉంటూ.. వ్యాపార అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కెనరా బ్యాంక్ నుంచి రెండు దఫా లుగా రూ.338 కోట్ల రుణం పొందారు. తర్వాత ఆడిట్ రిపోర్టులు తప్పుగా నమోదు చేసి నష్టాలు వచ్చినట్టు చూపించి రుణం ఎగవేయడానికి ప్రయ త్నించారు. దీనిపై హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ టి.వీరభద్రారెడ్డి తెలంగాణ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు గత నెల 30న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు శనివారం రాజమహేంద్రవరం వచ్చినట్టు తెలుస్తోంది. చదవండి: Karimnagar: రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం -
ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి, చివరకు
సాక్షి, పాలకొల్లు: ఏడేళ్లుగా ప్రేమిస్తున్నా పెళ్లికి నిరాకరిస్తుండటంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఎట్టకేలకు ప్రియుడు పెళ్లికి అంగీకరించడంతో కిందికి దిగి రాగా, వారిద్దరికి దండలు మార్పించి ఒక్కటి చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టెల కేశవాణి, గాంధీనగర్ కాలనీకి చెందిన యడ్ల భాస్కరరావు ఏడేళ్లుగా ప్రేమికులు. తనను పెళ్లి చేసుకోవాలని వాణి కోరగా, భాస్కరరావు ముఖం చాటేస్తున్నాడు. రెండు రోజుల క్రితం యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భాస్కరరావు రెండు రోజులు గడువు కోరాడు. శనివారం కూడా ఏ విషయం చెప్పకపోవడంతో కేశవాణి తనకు న్యాయం చేయాలంటూ అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో బంధువులు భయాందోళనలకు గురై ఫిర్యాదు చేశారు. సీఐ సీహెచ్ ఆంజనేయులు చొరవతో యువతి కిందికి దిగి రాగా, భాస్కరరావు, అతని తల్లిదండ్రులకు సీఐ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెళ్లికి అంగీకరించారు. స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రేమజంటకు దండలు మార్పించారు. ఏడాదిలోపు పెళ్లి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు కేశవాణి బంధువులు, స్థానిక పెద్దలు తెలిపారు. ఎస్సై రెహమాన్, స్థానిక పెద్దలు సనమండ ఎబినేజర్, రేణుబాబు, ఖండవల్లి వాసు, రామాంజుల మధు, రాజేష్ కన్నా సమస్య పరిష్కరించడానికి కృషి చేశారు. చదవండి: Paralympics 2021: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం -
వాగులు పొంగె.. గోదావరి ఉప్పొంగె..
సాక్షి,పోలవరం రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్ ఎగువ భాగంలో రోజురోజుకూ గోదావరి నీరు ఎగపోటు తన్నుతోంది. ముంపు గ్రామాల సమీపంలోకి నీరు చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షం నీరంతా గోదావరిలో కలుస్తోంది. ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్ వద్ద మంగళవారం 27.549 మీటర్లకు నీటిమట్టం చేరింది. స్పిల్‌వేలోని 42 గేట్ల నుంచి దిగువకు నీరు చేరుతోంది. స్పిల్ ఛానల్ మీదుగా మహానందీశ్వరస్వామి ఆల య సమీపంలో సహజ ప్రవాహంలో కలుస్తోంది. రంగుమారిన గోదారమ్మ కొండవాగుల నీరు కలవడంతో గోదావరి కొద్దిగా రంగు మారి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువన కూడా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. నక్కలగొయ్యి కాలువ, ఇసుక కాలువ, పేడ్రాల కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టిసీమ ఔట్‌ఫాల్ స్లూయిజ్ నుంచి కొవ్వాడ కాలువ అధిక జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి. నిండుకుండలా జలాశయాలు బుట్టాయగూడెం: భారీ వర్షాలతో బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పోగొండ రిజర్వాయర్‌లో కూడా వరద నీరు పోటెత్తుతోంది. జల్లేరు జలాశయంలో 211.80 మీటర్లకు, పోగొండ రిజర్వాయర్‌లో 155.7 మీటర్లకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, పిల్ల కాలువలు పొంగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు దిగువన రంగు మారి ప్రవహిస్తున్న గోదావరి 32.8 మి.మీ సగటు వర్షపాతం జిల్లాలో గత 24 గంటల్లో 32.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా మంగళవారం ఉదయం వరకు పరిశీలిస్తే చా గల్లులో అత్యధికంగా 131.8, పాలకోడేరులో 108.4, జీలుగుమిల్లిలో 101.8 మి.మీ వర్షం కురిసింది. దేవరపల్లిలో 75, పోలవరంలో 74.2, కొవ్వూరులో 73.8, గణపవరంలో 69.4, బుట్టాయగూడెంలో 59.4, వీరవాసరంలో 53.2, నిడమర్రులో 48.6, కొయ్యలగూడెంలో 44.6, తాళ్లపూడిలో 41.2, టి.నర్సాపురంలో 40.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెంలో 38.2, నిడదవోలులో 33.2, గోపాలపురంలో 31.2, ఉండ్రాజవరంలో 30.2, నరసాపురంలో 29.4, ఉండిలో 29.2, ఆకివీడులో 27.8, తణుకులో 28.8, అత్తిలిలో 26.6, కుక్కునూరులో 25.2, మొగల్తూరులో 23.6 మి.మీ వర్షం కురిసింది. చింతలపూడిలో 23.2, పాలకొల్లులో 22.4, ఉంగుటూరులో 22.2, పెంటపాడులో 20.4, పెరవలిలో 18, భీమడోలులో 17.8, కామవరపుకోటలో 17.2, భీమవరంలో 16.8, నల్లజర్లలో 16.0, ఆచంటలో 15.8, పెదపాడులో 15.2, పోడూరులో 14.6, కాళ్లలో 14.4, ఏలూరులో 13.4, వేలేరుపాడు, ద్వారకాతిరుమలలో 12.2 చొప్పున, దెందులూరులో 11.4, తాడేపల్లిగూడెంలో 11, పెనుగొండలో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా సరాసరి 71.19 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరద భయంతో గ్రామాలు ఖాళీ కుక్కునూరు: గోదావరి వరద పెరుగుతుండటంతో మండలంలోని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే తప్ప పట్టించుకోని గిరిజనులు గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా చేరకుండానే గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బ్యాక్ వాటర్ పెరగడం, గోదావరి పోటెత్తడంతో గొమ్ముగూడెం వద్ద అడుగు మేర నీరు పెరిగిందని అంటున్నారు. -
మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ఇంట్లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. మాగంటి రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. తాగుడు అలవాటునుమానేందుకు రవీంద్రనాథ్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. మద్యానికి బానిస అయిన రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని హోటల్లో ఉన్నాడు. బ్లడ్ వామిటింగ్తో హయత్ ప్యాలెస్‌లో రవీంద్రనాథ్ చనిపోయారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి తనయుడు కన్నుమూత -
భీమవరం పుంజుకు పొగరెక్కువ
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అనేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి.. రోజూ కఠోర శిక్షణ.. బలవర్ధక ఆహారం.. క్రమతప్పని వ్యాయామంతో కోళ్లను పెంపకందారులు సిద్ధం చేస్తున్నారు.. ముఖ్యంగా భీమవరం పుంజులకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పండుగకు మరో 20 రోజులే సమయం ఉండటంతో భీమవరం ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పుంజులను పెంపకందారులు సాకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి ప్రముఖులు వచ్చి ఇక్కడ పుంజులను కొనుగోలు చేస్తుంటారు. ఢీ అంటే ఢీ సంక్రాంతి కోడి పందాలకు భీమవరం ప్రాంతం పుంజులు అంటే యమ క్రేజ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో కొందరు పుంజులను కేవలం సంక్రాంతి పండుగ పందాలకు మాత్రమే పెంచుతారు. చంటి పిల్లల్లా వాటిని చూసుకుంటూ ఆహారం, వ్యాయామంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పుంజుల శిబిరాల వద్ద జీతగాళ్లను పెట్టి మరీ వాటిని పెంచుతున్నారు పెంపకందారులు. ఈ ప్రాంతంలో కోడి పుంజులు పెంచడం ఒక రాయల్టీగా ఫీలవుతారు. పర్ల జాతి పుంజు, డేగ పుంజు ఆహారం ఇలా.. పందెం పుంజులకు అందించే ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. మటన్ కైమా, బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, చోళ్లు, గంట్లు, వడ్డు మిశ్రమంగా కలిపి క్రమం తప్పకుండా ఆహారంగా అందిస్తున్నారు. ప్రతిరోజూ మటన్ ఖైమా తప్పనిసరి. ఉదయం బాదం, మటన్ కైమా, సాయంత్రం గంట్లు, చోళ్లు పెడతారు. ఉదయం పుంజులతో ఈత కొట్టిస్తారు. కత్తులు లేకుండా డిక్కీ పందాలు మాదారి పుంజులు తలపడేలా చూస్తుంటారు. దీని ద్వారా పుంజు సామర్థ్యాన్ని పెంపకందారులు అంచనా వేస్తారు. ప్రత్యేక ఆవాసాలలో(గూళ్లు) వీటిని ఉంచుతారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణ కలి్పంచేలా ఏర్పాట్లు చేస్తారు. 3 నెలలు.. రూ.15 వేలు ఖర్చు కోడిపుంజు పందానికి సిద్ధం చేయడానికి మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో వీటికి అందించే ఆహారం, భద్రత తదితరాల కింద పెంపకందారులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తారు. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా మంచి సామర్థ్యం ఉన్న పుంజులను సిద్ధం చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తుంటారు. భీమవరం ప్రాంతంలో కోడి పుంజుల పెంపక కేంద్రం, బలవర్ధక ఆహారం ఇదే.. భీమవరం పుంజుకు పొగరెక్కువ భీమవరం పుంజుకు పొగరే కాదు ధర కూడా ఎక్కువే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ఇక్కడకు వచ్చి పుంజులు కొనుగోలు చేస్తుంటారు. రకాన్ని బట్టి కోడి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. పందెంరాయుళ్లు ముందుగా వచ్చి వారికి కావాల్సిన రకం బట్టి కొంత అడ్వాన్సు ఇచ్చి మరీ వెళుతుంటారు. దీంతో సంక్రాంతి సీజన్‌కు ముందు పెంపకందారులకు పుంజులు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. రకాలు పచ్చకాకి, నల్ల నెమలి, పింగలి, సేతువా, కక్కరాయి (ఎరుపు, నలుపు రకాలు), అబ్రాస్ (తెలుపు, ఎరుపు రకాలు), మైల (ఎరుపు, నలుపు రకాలు, డేగ, పండు డేగ, నల్ల బొట్టుల తేతువా, గేరువా, రసంగి(ఎరుపు, తెలుపు రకాలు), పెట్టమర్రు, కాకి డేగ పర్ల, పర్ల రకాలు ఎక్కువుగా పందాలకు వినియోగిస్తుంటారు. -
‘వైఎస్సార్ రైతుభరోసా విప్లవాత్మకమైన మార్పు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వైస్సార్ రైతు భరోసా కార్యక్రమ అమలుకు శ్రీకారం చుట్టారని డిప్యూటి సీఎం ఆళ్లనాని అన్నారు. మంగళవారం ఆయన ఏలూరులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు అధ్యాయంలో వైఎస్సార్ రైతుభరోసా విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఈ పథకాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల 23వేల మంది రైతులుకు వైస్సార్ రైతు భరోసా సాయం అందుతుందని వెల్లడించారు. వైస్సార్ కంటి వెలుగు ఒక చారిత్రత్మమైన కార్యక్రమమని ఈ పథకానికి ప్రభుత్వం సుమారు రూ. 560 కోట్లను కేటాయించిందన్నారు. రైతులుకు 9గంటలు విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులు ఆత్మహత్యలుకు పాల్పడకూడదని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని నాని పేర్కొన్నారు. కడప: ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రడ్డి అమలు చేస్తున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన మైదుకూరు మండలలోని తెలుగు గంగ ప్రాజెక్టు కాలనీలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 2020 మే నెల నుంచి ఇస్తామన్న రైతు భరోసాను ఎనిమిది నెలల ముందే చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులతో సహా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, రైతులు పాల్గొన్నారు. విజయవాడ: రైతు కళ్లల్లో ఆనందం నింపేందుకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం ఆయన కుందా వారి కండ్రికలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కర్షకుల కష్టాలు చూసి మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రైతులకి చంద్రబాబు ద్రోహం చేస్తే.. రైతు సంక్షేమంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ నమ్మారని పేర్కొన్నారు. పెనమలూరు: దేశంలోనే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందచేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం ఆయన ఉయ్యూరులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తమదేనని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. సీఎం జగన్ ఒక అడుగు ముందుకేసి పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ.13,500 పెంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతోపాటు సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్, అధికారిలు, రైతులు పాల్గొన్నారు. పెడన: కృష్ణాజిల్లా పెడన పట్టణంలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు వేలాది మంది రైతులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళావారం మర్కెట్ యార్డులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మర్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్స్‌ను పరిశీలించారు. ప్రకాశం: జిల్లాలోని సంతనూతలపాడు మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్సార్ రెైతు భరొసా పథకాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మొదటి విడత చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గోన్నారు. విశాఖప్నం: జిల్లాలోని చీడికాడలో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పభకాన్ని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సందీప్, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు కిలపర్తి భాస్కరరావు, రాజారాం, కర్రి సత్యం, బూరే బాబురావు, ఎర్రా అప్పారావు, రాజుబాబు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సు కోసమే నిరంతరం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి అని పాడేరు ఎమ్మెల్యే కోటగెళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం జిల్లాలోని చింతపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఐటీడీఏ పీఓ బాలాజీ, ఎంపీడీఓ ప్రేమకర్ పాల్గొన్నారు. ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని చెప్పిన గడువుకు ముందే ప్రారంభించడం తన చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల రుణమాఫీ పేరుతో ఐదేళ్లు రైతులను మభ్యపెట్టిందని విమర్శించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. చోడవరం: విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, ఎమ్మెల్యే కరణం ధర్మ, రైతులు, అధికారలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అరకు: గిరిజన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీటి వేస్తుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. మంగళవారం ఆయన అరకులో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 56 వేల మంది రైతులకు రైతు భరోసా ద్వారా వ్యవసాయ పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం: జిల్లాలోని శింగణమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధికారులు, రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద అదనంగా రూ. వేయి పంపుపై రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రైతులకు కృతజ్ఞతగా వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు: రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, రైతులు, అధికారులు, వైఎస్సార్పీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాప్తాడు: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్న రోజని కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నిర్వహించని వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిపాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాలుగు నెలల కాలంలో ఏ సీఎం అమలు చేయని పధకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని తెలిపారు. హిందూపురం: దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రైతులను తన భుజాల మీద మోసి వ్యవసాయం అంటే పండుగ అని తెలియచేశారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన అసత్య హామీలతో మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం ఆయినాక వానలు వచ్చి చెరువులు నిండి రాష్ట్రమంతా జలకళలో నిండి ఉందని మాధవ్ తెలిపారు. ప్రకాశం: జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో నిర్వహించిన వైస్సార్ రైతు భరోసా పథకాన్ని ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. 37 వేల 925 మంది రైతుకలు రైతు భరోసా పధకం ద్వారా 51 కోట్ల రుణాలను ఎమ్మెల్యే అందజేశారు. -
స్పిన్నింగ్ మిల్లులో పడి మహిళ మృతి
సాక్షి, పశ్చిమగోదావరి : స్పిన్నింగ్ మిల్లు మిషన్‌లో పడి ప్రమాదవశాత్తూ మహిళ తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పెరవలి ఎస్సై డీవై కిరణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన అల్లాడి వెంకటలక్ష్మి (46) పెరవలి మండలం మల్లేశ్వరం ఎస్వీఆర్ స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. శుక్రవారం వేకువజాము షిప్ట్‌లో పనిచేస్తున్న వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తూ మిషన్‌లో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందిస్తుండగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుమారుడు అల్లాడి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఉపాధ్యాయులకు దేహశుద్ధి?
సాక్షి, పశ్చిమగోదావరి : చింతలపూడి మండలం ఉర్లగూడెం గ్రామంలో ఇద్దరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారన్న వదంతులు వ్యాపించడంతో శుక్రవారం గ్రామంలో కలకలం రేగింది. అయితే తమ గ్రామంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ జి.రామారావును వివరణ కోరగా గురువారం పాఠశాల వద్ద ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని వెళ్లి విచారణ జరిపానని చెప్పారు. తన విచారణలో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొట్టుకున్నారని వారిలో ఒక విద్యార్థినికి గాయాలవ్వడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై అడగడానికి వచ్చామని గ్రామస్తులు చెప్పినట్లు తెలిపారు. ఉమామహేశ్వరరావు, రాజశేఖర్ అనే ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలలకు మార్చమని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు పెట్టడంతో డెప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయినిని నియమించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులపై చాలాకాలంగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన సంఘటనలో కూడా పాఠశాలలో అసాంఘిక చర్యలకు పాల్పడటంతోనే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చెలరేగి ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి జరిమానా కూడా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవిని వివరణ కోరగా శనివారం పాఠశాలకు వెళ్లి విచారణ జరుపుతానని తెలిపారు. విచారణలో ఉపాధ్యాయులపై ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వశిష్ట తీరం.. పర్యాటక ధామం
ఆచంట : ఒయ్యారాలు ఒలకబోసే గోదావరి.. ఏటిగట్టు వెంబడి కొబ్బరిచెట్లు.. నది మధ్యలో చిన్నచిన్న దీవుల్లా లంక గ్రామాలు.. అడుగుపెట్టగానే ఆహ్లాదపరిచే వాతావరణం.. వశిష్ట గోదావరి తీరం వెంబడి కనిపించే దృశ్యాలివి. కాసేపు నిలబడి ప్రకృతి రమణీయత ఆస్వాదించాలంటే అనువైన పరిస్థితులు లేవు. ఈ లోటు ఇకపై భర్తీ కానుంది. వశిష్ట తీరం త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతుంది. దొంగరావిపాలెంలో అతిథి సౌకర్యాలకు పర్యాటక శాఖ నిధులు కేటాయించింది. ఇక్కడ వసతి గృహాలు, రెస్టారెంట్లు, బోటు షికారు వంటి నిర్మాణాలు చేపట్టబోతోంది. పనిలో పనిగా ఆచంట మండలం పెదమల్లంలో గతంలో నిర్మించిన పర్యాటక కేంద్రాన్ని పునరుద్ధరించేందుకూ నిధులు కేటాయించింది. రూ.3 కోట్లతో అభివృద్ధి దొంగరావిపాలెం నుంచి పెదమల్లం గ్రామాల మధ్య గోదావరి అందాల్ని తిలకిస్తూ ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దొంగరావిపాలెం వద్ద రూ.1.80 కోట్లతో పర్యాటకుల కోసం విశ్రాంతి భవనాలు, గోదావరి రుచులు అందించడానికి రెస్టారెంట్లు, గోదావరిలో విహరించడానికి బోట్లు సమకూర్చనుంది. దొంగరావిపాలెం నుంచి గోదా వరి వారధి దాటుకుని పెదమల్లం వరకూ బోట్లపై ప్రయాణించి లంక గ్రామాల అందాలు తిలకించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అనువుగా సిద్ధాంతం నుంచి దొంగరావిపాలెం వరకూ ఏటిగట్టుపై రహదారి, సిద్ధాంతం నుంచి పెదమల్లం వరకూ ఏటిగట్టు అభివృద్ధి పనులు చేపడతారు. వెన్నెల్లో గోదావరి అందాలను పడవపై ప్రయాణించి ఆస్వాదించడానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో రెండు నెలల్లోనే నిర్మాణాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 15 ఏళ్ల కిత్రం ఆచంట మండలం పెదమల్లంలో పర్యాటక శాఖ అతిథి గృహాలు నిర్మించింది. కదిలే గృహాల్లాంటి బోట్లను అందుబాటులోకి తెచ్చింది. పెదమల్లం నుంచి చించినాడ సమీపంలోని దిండి గ్రామానికి బోటు షికారు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించే ప్యాకేజీ ధరలు ఎక్కువగా ఉండటం.. నదిలో ఇసుక మేటల వల్ల భారీ బోట్లు ప్రయాణించడానికి ఆటంకం కలగటంతో కొద్ది రోజుల్లోనే ఇక్కడి పర్యాటక కేంద్రం మూతపడింది. తాజాగా ఇక్కడి నిర్మాణాలను పునరుద్ధరించడంతోపాటు, మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి పర్యాటక శాఖ రూ.1.20 కోట్లు కేటా యించింది. దొంగరావిపాలెం–పెదమల్లం కేంద్రాల మధ్య త్వరలోనే కొత్త ప్యాకేజీతొ సందర్శకులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. దొంగరావిపాలెం, పెదమల్లం గ్రామాల్లో పర్యాటక అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులొచ్చాయని ఏపీ టూరిజం డివిజినల్ ఇంజినీర్ జి.సత్యనారాయణ తెలిపారు. ఈ రెండుచోట్ల పదేసి చొప్పున కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.