
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పాలకొల్లు: ఏడేళ్లుగా ప్రేమిస్తున్నా పెళ్లికి నిరాకరిస్తుండటంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఎట్టకేలకు ప్రియుడు పెళ్లికి అంగీకరించడంతో కిందికి దిగి రాగా, వారిద్దరికి దండలు మార్పించి ఒక్కటి చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టెల కేశవాణి, గాంధీనగర్ కాలనీకి చెందిన యడ్ల భాస్కరరావు ఏడేళ్లుగా ప్రేమికులు. తనను పెళ్లి చేసుకోవాలని వాణి కోరగా, భాస్కరరావు ముఖం చాటేస్తున్నాడు. రెండు రోజుల క్రితం యువతి బంధువులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా భాస్కరరావు రెండు రోజులు గడువు కోరాడు.
శనివారం కూడా ఏ విషయం చెప్పకపోవడంతో కేశవాణి తనకు న్యాయం చేయాలంటూ అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో బంధువులు భయాందోళనలకు గురై ఫిర్యాదు చేశారు. సీఐ సీహెచ్ ఆంజనేయులు చొరవతో యువతి కిందికి దిగి రాగా, భాస్కరరావు, అతని తల్లిదండ్రులకు సీఐ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెళ్లికి అంగీకరించారు. స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రేమజంటకు దండలు మార్పించారు. ఏడాదిలోపు పెళ్లి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు కేశవాణి బంధువులు, స్థానిక పెద్దలు తెలిపారు. ఎస్సై రెహమాన్, స్థానిక పెద్దలు సనమండ ఎబినేజర్, రేణుబాబు, ఖండవల్లి వాసు, రామాంజుల మధు, రాజేష్ కన్నా సమస్య పరిష్కరించడానికి కృషి చేశారు.
చదవండి: Paralympics 2021: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం
Comments
Please login to add a commentAdd a comment