CHINTHALAPUDI
-
మిల్లు పేరుతో టీడీపీ అభ్యర్థి రోషన్ మోసం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ ఓ మహిళా సర్పంచ్‌ని మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మిల్లు కొనుగోలులో రూ.62 లక్షలు బకాయిపడి కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారని మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రోషన్‌కుమార్ దంపతుల చేతుల్లో మోసపోయానని, న్యాయం చేయాలని సీఐడీకి, సీబీఐకి ఫిర్యాదు చేయడం చింతలపూడి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.దాల్ మిల్ కొనుగోలు పేరుతో..దాల్ మిల్ కొనుగోలు పేరుతో చింతలపూడి టీడీపీ అభ్యర్థి, ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌కుమార్ దంపతులు తనను మోసం చేశారని మండలంలోని రాఘవాపురం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ కోండ్రు వజ్ర కిషోర్ ఆరోపించారు. ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఎన్ఆర్ఐ సొంగా రోషన్ కుమార్ దంపతులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సీబీఐ, ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. తన భర్త (ఎన్ఆర్ఐ) మెకానికల్ ఇంజనీర్ కోండ్రు కిషోర్కుమార్ని నయవంచన చేసి నూజివీడులో గల తమ దాల్ మిల్‌ను పూర్తి పైకం చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసానికి పాల్పడ్డారని వాపోయారు. తన భర్తను నమ్మించి, ఒక్కరినే తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. తమకు రావాల్సిన రూ.98 లక్షల్లో రూ.36 లక్షలు ఇచ్చి, రూ.62 లక్షలు లోన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత ఇస్తామని చెప్పారని వివరించారు. కొన్ని నెలలు తమకు లోన్ రాలేదని, మరికొన్ని నెలలు ఫోన్లు ఎత్తకుండా ఎటువంటి సమాధానం చెప్పకుండా, కొంతకాలం తరువాత ఫోన్లు ఎత్తినా నాకు, నా భార్యకు ఎటువంటి సంబంధం లేదు.. నా భార్యను వదిలివేశాను.. నీకు రావలసిన డబ్బు ఆవిడను అడుగు అని సొంగా రోషన్‌కుమార్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రోషన్ భార్య విజయను అడిగితే నాకేంటి సంబంధం.. నాకు సంబంధం లేదు.. కొనిచ్చింది ఆయన కాబట్టి ఆయన్నే అడగండి.. మేం విడిపోయాం.. అంటూ ఒకరిపై ఒ కరు మోసపూరిత మాటలు చెబుతూ నమ్మిస్తూ కా లం గడిపారన్నారు. దీంతో గత్యంతరం లేక రోషన్‌కుమార్, ఆయన భార్య విజయ, తండ్రి రాజారత్నం, మామ సిమియోను, అతని బినామీదారుపై ఫిర్యాదు చేసినట్లు వజ్ర కిషోర్ చెప్పారు. తన ఫిర్యాదులో పక్కా ఆధారాలు చూపిస్తూ ఏ విధంగా రోషన్‌కుమార్ దంపతులు బినామీలను ఉపయోగించి తన భర్తను మోసగించారో వివరంగా పేర్కొన్నారు. రోషన్‌కుమార్ చేసిన మోసాన్ని తట్టుకోలేక తన భర్త కిషోర్ మనోవేదనతో మృతి చెందారని వాపోయారు. అమెరికా నుంచి వచ్చాక డబ్బులు అడుగుతుంటే ఎన్నికల అయ్యాక ఇస్తామని చెప్పారని, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పెద్దలు కూడా మధ్యవర్తిత్వం నడిపారని అన్నారు. దళితులని ఉద్దరించడానికి పైనుంచి దిగి వచ్చానని డాంబికాలు పోతున్న సొంగా రోషన్‌కుమార్ ఒక దళిత సర్పంచ్‌కి చేసిన అన్యాయాన్ని గురించి నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
చింతలపూడి గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు
-
ఉపాధ్యాయులకు దేహశుద్ధి?
సాక్షి, పశ్చిమగోదావరి : చింతలపూడి మండలం ఉర్లగూడెం గ్రామంలో ఇద్దరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారన్న వదంతులు వ్యాపించడంతో శుక్రవారం గ్రామంలో కలకలం రేగింది. అయితే తమ గ్రామంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ జి.రామారావును వివరణ కోరగా గురువారం పాఠశాల వద్ద ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని వెళ్లి విచారణ జరిపానని చెప్పారు. తన విచారణలో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొట్టుకున్నారని వారిలో ఒక విద్యార్థినికి గాయాలవ్వడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై అడగడానికి వచ్చామని గ్రామస్తులు చెప్పినట్లు తెలిపారు. ఉమామహేశ్వరరావు, రాజశేఖర్ అనే ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలలకు మార్చమని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు పెట్టడంతో డెప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయినిని నియమించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులపై చాలాకాలంగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన సంఘటనలో కూడా పాఠశాలలో అసాంఘిక చర్యలకు పాల్పడటంతోనే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చెలరేగి ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి జరిమానా కూడా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవిని వివరణ కోరగా శనివారం పాఠశాలకు వెళ్లి విచారణ జరుపుతానని తెలిపారు. విచారణలో ఉపాధ్యాయులపై ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
చింతలపూడిలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చింతలపూడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. రేపు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న గురుపుజోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన పార్టీ నేతలు ఎలిజా, జానకి రెడ్డి, వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు గ్రామదర్శిని పర్యటన నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్ పట్ల పైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
బాబు పర్యటన: చింతలపూడిలో పోలీసుల ఓవరాక్షన్
-
ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని కేసు నమోదు
సాక్షి, పశ్చిమగోదావరి: చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టారని వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు సురేష్‌పై చింతలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి సురేశ్‌ని అరెస్ట్ చేసినట్టు తన కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే చింతలపూడి పోలీసులు సురేశ్‌ని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. దీంతో అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తున్నారంటూ అరోపణలు చేస్తున్నారు. -
‘వైఎస్ జగన్‌కు పట్టం కట్టడం ఖాయం’
సాక్షి, చింతలపూడి : ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టడం ఖాయమని చింతలపూడి నియోజక వర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వీఆర్ ఎలీజా అన్నారు. చింతలపూడిలో బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో 30 సంవత్సరాల పాటు ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సొంత రాష్ట్రానికి వచ్చానని పేర్కొన్నారు. ఇకపై చింతలపూడి నియోజక వర్గ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించి ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇద్దామని ఎలీజా పిలుపునిచ్చారు. వైవీ సుబ్బారెడ్డి అభినందనీయులు.. ప్రత్యేక హోదా పోరులో భాగంగా ఇంకా ఏడాదికి పైగా సమయమున్నా ఎంపీ పదవిని తృణప్రాయంగా వదులుకున్న వైవీ సుబ్బారెడ్డి అభినందనీయులని ఎలీజా కొనియాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీల పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతుగా ఉండటం హర్షణీయమన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు రైతాంగానికి వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. -
చింతలపూడి సమన్వయకర్తగా దమ్ము సుహాసిని
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను నియమించింది. పార్టీకి చెందిన సీనియర్ నేత దమ్ము సుహాసినిని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. ఈసందర్భంగా సుహాసిని పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ ఆశయాలతో పాటు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. -
ఎత్తిపోతల పథకం భూసర్వేపై రైతులు ఆగ్రహం
-
చింతలపూడి, నూజివీడులో బొగ్గు నిక్షేపాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గునిక్షేపాలపై అన్వేషణకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేజీ బేసిన్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, కృష్ణాజిల్లా నూజివీడు పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కొంత కాలం క్రితం అధ్యయనాల్లో తేలిన విషయం విదితమే. బొగ్గు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉందో అన్వేషించటానికి ప్రభుత్వం మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఇసిఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్(ఎన్ఎంఇటి) ప్రతినిధులతో త్రైపాక్షిక ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలోని చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎస్పీ టక్కర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంఓయూ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సున్నపురాయి వేలం, బంగారు ఖనిజాన్వేషణలో ఈ సంస్థలు సహకారం అందిస్తాయి. 2017 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని తమ శాఖ కార్యకలాపాల ప్రగతిని సమీక్షించామని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఖనిజాన్వేషణ పూర్తవుతుందని ఆమె అన్నారు. ఎంఓయూ ప్రకారం రాష్ట్రంలో పెద్దతరహా ఖనిజాలపై ఎన్ఎంఇటీకి 2% రాయల్టీ లభిస్తుంది. ఈ రాయల్టీ సొమ్మును ఎన్ఎంఇటి రాష్ట్రంలో ఖనిజాన్వేషణ చేపట్టనున్న ఎంఇసిఎల్కు చెల్లిస్తుంది. కొత్త ఖనిజ నిక్షేపాలను గుర్తించిన తర్వాత వాటిని బ్లాకులుగా చేసి వేలం వేస్తారు. ఎన్ఎంఇటి, ఎంఇసిఎల్ల సహకారంతో జరిగే ఖనిజాన్వేషణ నిరంతర ప్రక్రియ అవుతుంది. ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, శ్రీ ఎస్పీ టక్కర్, గనుల శాఖ కార్యదర్శి శ్రీ గిరిజా శంకర్, ఎన్ఎంఇటి పక్షాన కోషిఖాన్, ఎంఇసిఎల్ తరపున శ్రీ యోగేష్ శర్మ పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పనులు అడ్డగింత
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు పట్టిసీమ తరహాలో తమకు కూడా ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ నెల 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో భూ నిర్వాసితులు పనులు జరగకుండా ప్రొక్లెయినర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. -
‘జన్మభూమి’ని అడ్డుకున్న గ్రామస్థులు
చింతలపుడి: ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా.. అనవసరపు ఆర్భాటాలకు పోతుందని ఆగ్రహించిన గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడిలో గురువారం నిర్వహించనున్న జన్మభూమి- మా భూమి కార్యక్రమాలకు హజరైన అధికారులకు గ్రామస్థుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. గ్రామానికి వచ్చే రహదారి సరిగ్గా లేదని గత కొంత కాలంగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోని అధికారులకు తమ గ్రామంలోకి వచ్చే అధికారం లేదని వారిని గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. అనంతరం రహదారి లేకపోవడంతో.. గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు రహదారి నిర్మించిన ఆ తర్వాతనే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. -
టీచరమ్మకు మంత్రి యోగం
చింతలపూడి, న్యూస్‌లైన్ :పదేళ్ల అనంతరం చింతలపూడి నియోజకవర్గానికి తిరిగి మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యే పీతల సుజాతకు మంత్రి వర్గంలో స్థానం లభించింది. ఈ విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చింతలపూడిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 2004లో టీడీపీ తరఫున ఆచంట నియోజకవర్గం నుంచి సుజాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఆచంట నియోజకవర్గం జనరల్‌కు కేటాయించడంతో ఆమె పోటీకి దిగలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి సుజాత దూసుకు వచ్చారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆమెను బరిలోకి దింపింది. 15,156 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన సుజాత మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఉపాధ్యాయి.నిగా ప్రస్థానం ఆచంట: బెత్తం పట్టుకుని చిన్నారులకు అ ఆ..ఇ ఈలు నేర్పిన టీచరమ్మ పీతల సుజాతకు రాజకీయాల్లో ఓనమాలు తెలియకపోయినా అ నూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. రాజకీయ చదరంగంలో నెట్టుకొచ్చిన ఆమె ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదిగారు. పార్టీనే నమ్ముకున్న సుజాతకు అదృష్టం కూడా తోడైం ది. ఆచంట, చింతలపూడి నియోజకవర్గాల నుంచి స్థానికేతరురాలిగానే బరిలోకి దిగిన ఆమె అనూహ్యంగా విజయం సాధించారు. జిల్లాలో మహిళా కోటాతోపాటు, దళితుల కోటా కలిసి రావడంతో సీమాంధ్ర తొలి కేబినెట్లో ఆమెకు అవకాశం దక్కింది. సుజాతకు మంత్రి పదవి రావడంతో ఆమెకు రాజకీయంగా జన్మనిచ్చిన ఆచంటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. స్థానికత్వం కలసి రాకపోయి.నా... 1973 ఆగస్టు 13న వరప్రసాద్ (బాబ్జి), కృపావరం దంపతులకు జన్మించిన సుజాత ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. నరసాపురంలో కళాశాల విద్యను అభ్యసించారు. ఎంఏ బీఈడీ చదివి 2004లో ఉపాధ్యాయి.నిగా ఎంపికయ్యూరు. నరసాపురం మండలంలో పని చేశారు. ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2008లో సహ ఉపాధ్యాయుడు సురేష్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రణవీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి పీతల బాబ్జి టీడీపీలో చురుకైన కార్యకర్త. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అనుచరుడు. 2004లో ఆచంట టీడీపీ సీటు కోసం బాబ్జి తన కుమార్తె పీతల సుజాతతో రిజర్వుడు నియోజకవర్గమైన ఆచంట నుంచి దరఖాస్తు చేయించారు. అయితే, తొలుత హైదరాబాద్‌కు చెందిన పీతల మహాలక్ష్మికి సీటు కేటాయించారు. మహాలక్ష్మిపై అభియోగాలు రావడంతో చివరి నిమిషంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చక్రం తిప్పి టికెట్‌ను పీతల సుజాతకు ఇప్పించారు. ఆచంట నుంచి పోటీచేసిన సుజాత 5,641 మెజార్టీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఆమె పలుమార్లు ప్రస్తావించారు. కానీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నేరవేర్చలేకపోయారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల నుంచి నియోజకవర్గంలో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయినా అధైర్యపడకుండా తనదైన శైలిలో రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. 2009 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కాగా, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి వెళ్లింది. దీంతో ఆమె రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. 2009లో రిజర్వుడు నియోజకర్గమైన చింతలపూడి టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. ఆయినా ఆమె పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించిన చంద్రబాబు మూడేళ్ల క్రితం రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా నియమించారు. పార్టీపై విధేయత చూపడంతోపాటు.. సౌమ్యురాలిగా అందరి మన్నలు పొందారు. 2014 ఎన్నికలలోనూ అనూహ్యంగా చింతలపూడి టికెట్ సాధించి అనూహ్యమైన విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఎమ్మెల్యేగా గతంలో ఆచంట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోయిన సుజాత మంత్రిగా ఇకపై ఆచంట అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా నుంచి ఐదో మహిళ స్వాతంత్య్రానంతరం జిల్లా రాజకీయ చరిత్రలో కేబినెట్ ర్యాంకు పదవులను దక్కించుకున్న ఐదో మహిళగా పీతల సుజాత రికార్డులకెక్కారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కేబినెట్లో మన జిల్లా కోడలు ఆచంట రుక్మిణమ్మ డెప్యూటీ స్పీకర్‌గా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. జిల్లాకు చెందిన చోగడం అమ్మన్నరాజా కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో డెప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక అత్తిలి తొలి ఎమ్మెల్యే అమ్మన్నరాజా పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరించారు. ఈ పదవి కూడా కేబినెట్ ర్యాంకుతో కూడినదే. ఆ తరువాత కాలంలో పెనుగొండ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండుసార్లు ఎన్నికైన ప్రత్తి మణెమ్మ, కాంగ్రెస్ తరఫున దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి వరలక్ష్మి మంత్రి పదవులను అలకరించారు. ఆ పదవులకు వన్నె తెచ్చారు. జిల్లాకు చెందిన పీతల సుజాత సీమాంధ్ర తొలి కేబినెట్లో స్థానం సంపాదించడం ద్వారా అలనాటి మహిళామణుల సరసన నిలిచారు. -
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
చింతలపూడి, న్యూస్‌లైన్ : చింతలపూడి శివాలయం సమీపంలోని బావిలో తోట రమేష్ (24) అనే వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ తన భార్య సత్యవతితో శుక్రవారం ఘర్షణ పడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నా రు. ఆదివారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలోని నూతిలో రమేష్ మృతదేహం కనిపించింది. నూతి పక్కన మృతుడి సైకిల్, చెప్పులు పడి ఉన్నాయి. రమేష్ స్థానిక ఓ హోటల్లో పని చేస్తున్నాడు. అతను తాగి వచ్చి తరచూ వేధిస్తున్నాడని భార్య అలిగి పుట్టిం టికి వెళ్ళి పోయింది. బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి ఇటీవల కాపురానికి పంపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసు కుమారుడు ఉన్నాడు. తాగుడు మాని మారతాడనుకున్న భర్త తమను అన్యాయం చేసి వెళ్లిపోయాడని సత్యవతి రోదిస్తూ చెప్పింది. చంటి బిడ్డతో ఎలా బతకాలని వాపోయింది. రమేష్ మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. చింతలపూడి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టంకు తరలించారు. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రశేఖర్, దేవీప్రియను గెలిపించండి
చింతలపూడి, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మద్దాల దేవీప్రియను అఖండ మెజార్టీతో గెలిపించి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై గల అభిమానాన్ని చాటాలని పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు చింతలపూడి చేరుకున్న ఆమె ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు జరిగిన జనభేరి సభలో విజయమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనసున్న మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తమది మాటతప్పే కుటుంబం కాదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తారని అన్నారు. విజయమ్మకు మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్లు మేడవరపు అశోక్, బొడ్డు వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి జె.జానకిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పార్టీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, పట్టణ కన్వీనర్ గంధం చంటి తదితరులు ఘనస్వాగతం పలికారు. విజయమ్మ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలులింగపాలెం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే సుభాని, సుగుణరావు, పి.రాటాలు, తాళం చెన్నారావు, సీహెచ్ ప్రభుదాస్ తదితరులు తమ అనుయూయులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చింతలపూడిలో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదు : తోట చంద్రశేఖర్ జనభేరి సభలో ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల్ని ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణమైన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవించారని పేర్కొన్నారు. 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు, ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు, ఆరు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25కు పెంచి పేదవాడికి పట్టెడు అన్నం కూడా అందకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఇన్ని ఘనకార్యాలు చేసి మళ్లీ ఓట్లు అడగడానికి సిగ్గు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. రైతులకు, పేదలకు, మహిళలకు మేలు జరిగింది వైఎస్ పాలనలో మాత్రమేనని చంద్రశేఖర్ వివరించారు. చింతలపూడి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చే భద్రాచలం -కొవ్వూరు రైల్వే లైను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే వైఎస్ జగన్ కావాలని అన్నారు. సీమాంధ్ర పునర్నిర్మాణానికి, హైదరాబాద్ వంటి రాజధాని నిర్మాణం చేయగలిగే సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని చెప్పారు. మీ ఆదరాభిమానాలు కావాలి : దేవీప్రియ చింతలపూడి అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చి వైఎస్ జగన్ తనను ఆశీర్వదించారని, ఈ ఎన్నికల్లో గెలిపించి ప్రజలు ఆదరించాలని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ దేవీప్రియ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
95 శాతం పల్స్‌పోలియో నమోదు
చింతలపూడి, న్యూస్‌లైన్ : పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఒక్కరోజులోనే 94.85 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు డీఎంహెచ్‌వో టి.శకుంతల వెల్లడించారు. ఆదివారం చింతలపూడిలోని పలు పోలియో కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 3,84,386 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా ఇప్పటికే 3,64,669 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు చెప్పారు. 2,941 రూట్లలో 290 మంది సూపర్ వైజర్లు, 12,222 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. సోమ మంగళ వారాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి కేంద్రాలకు రాని పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతున్నట్లు డీఎంహెచ్‌వో చెప్పారు. త్వరలో డాక్టర్ పోస్టులు భర్తీ రెండు నెలల్లో జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలో 152 డాక్టర్ పోస్టులకు 65 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఇటీవల కలెక్టర్ 19 పోస్టులు భర్తీ చేయగా వారిలో కేవలం 5 గురు మాత్రమే విధుల్లో చేరారని, విధుల్లో చేరని డాక్టర్లను కలెక్టర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని తెలిపారు. ఆరు నెలల్లో యర్రగుంటపల్లి పీహెచ్సీ భవనం పూర్తి అవుతుందన్నారు. మార్టేరు తుందుర్రు, దొమ్మేరు భవనాలు పూర్తి కావచ్చాయని చెప్పారు. గుడివాడలంక, జీలుగుమిల్లి, సిధ్ధాంతం, కామయ్యపాలెం పీహెచ్సీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఆమె వెంట రాఘవాపురం పీహెచ్సీ వైద్యాధికారి డా.డీఎల్ సురేష్, హెల్త్ సూపర్వైజర్ ఎస్కే అబ్రార్ హుస్సేన్, ఎంపీహెచ్‌ఈవో వెంకన్నబాబు పాల్గొన్నారు. పోలియో మహమ్మారిని తరిమికొడదాం : కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమికొడదామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక వన్‌టౌన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలోని అర్బన్ ెహ ల్త్ సెంటర్లో కలెక్టర్ చిన్నారులకు చుక్కల మందు వేసి పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా ఎందరో చిన్నారులు పోలియో బారిన పడి విలువైన తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.టి.శకుంతల, నగరపాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు, ఎంహెచ్వో డా.కె.సురేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
సమైక్యవాదమే నేరమా?
చింతలపూడి/కామవరపుకోట/టి.నరసాపురం, న్యూస్‌లైన్ : సమైక్యవాదాన్ని వినిపిస్తే సంకె ళ్లు తప్పవా? జిల్లాలో పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. తమ పర్యటనను ఎక్కడ అడ్డుకుంటారోనని కేంద్ర, రా ష్ట్ర మంత్రుల ఆదేశాలతో పోలీసులు మరోసారి వైసీపీ నేతలు, సమైక్యవాదులను గృహ నిర్బంధం, అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణలు ఆదివారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ సహా 22 మంది వైసీపీ నేతలు, సమైక్యవాదులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఆదివారం ఉదయంచింతలపూడిలోని రాజేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేస్తున్నట్టు చెప్పారు. గతేడాది డిసెంబర్ 17న చింతలపూడి విచ్చేసిన కావూరిని రాజేష్ నాయకత్వంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కేంద్రమంత్రి సమైక్య వాదులను వెధవలు, సన్నాసులు, లంచగొండులని దుర్భాషలాడటంతో సమైక్యవాదులు ఆయనపై కోడిగుడ్లతో దాడికి దిగారు. అప్పటి ఘటనలో రాజేష్‌తో పాటు 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం, మరుసటి రోజు కావూరి ఒత్తిడితో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని కామవరపుకోట, టి.నరసాపురంలో కేంద్రమంత్రులు కావూరి, జేడీ శీలం, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ పర్యటించారు. సమైక్యవాదులు వారి పర్యటనను అడ్డుకుంటారన్న భయంతో ముందస్తుగా రాజేష్‌తో పాటు సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సీహెచ్ నరేంద్రరాజు, తోట కుమార్, రామరాజునాయక్లను నిర్బంధంలోకి తీసుకుని సాయంత్రం విడిచిపెట్టినట్టు ఎస్సై బి.మోహన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సమైక్య ఉద్యమానికి మద్దతు కోరినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కామవరపుకోట, టి.నరసాపురంలో.. కామవరపుకోటలో వైసీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్‌ను పోలీసులు ఆయన ఇంటిలో నిర్బంధించారు. బయటకు రాకుండా ఇంటి బయట నలుగురు కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. మంత్రుల సభ అనంతరం ఆయనను విడిచి పెట్టారు. తడికలపూడిలో వైఎస్సార్ సీపీ నాయకులు వై శ్రీను, ఈడ్పుగంటి సత్యవర ప్రసాద్, చలమాల సుబ్బారావు, సరికొండ కాళిదాసులను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. వారితో పాటు సమైక్యవాదులు ఆడ మిల్లి లక్ష్మీపతినగర్కు చెందిన మద్దిపాటి శ్రీనివాసరావు, బొకినాల ఏసు, తానంకి శ్రీను, తానేటి జాన్‌రాజు, తానేటి వెంకటేశ్వరరావు, తానేటి రామకృష్ణ అనే ఆరుగురు వ్యక్తులను స్టేషన్లో నిర్బంధించారు. తడికలపూడి, ఆడమిల్లిల్లో మంత్రుల పర్యటన అనంతరం వీరిని విడుదల చేశారు. టి.నరసాపురంలో నలుగురు వ్యక్తులను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు ఎస్సై డి.రాంబాబు తెలిపారు. బొర్రంపాలానికి చెందిన గుండె ముక్కరామయ్య, గుండె మాణిక్యాలరావు, చల్లా ఆనందరావు, గాది రాంబాబులను అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్‌పై విడుదల చేసిన ట్టు ఆయన వివరించారు. -
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
చింతలపూడి, న్యూస్‌లైన్ : గ్యాస్ ధరల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో వైసీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ గ్యాస్ బండను నెత్తిన పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంటా వార్పు నిర్వహించారు. ఖాళీ గ్యాస్ బండలతో రాస్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలను భారీగా పెంచి యూపీఏ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర కానుక అందించిందని విమర్శించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలకు ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలను ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని రాజేష్ డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ.50 గ్యాస్ ధర పెంచితే ఆడపడుచులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఆ ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. సామాన్యులపై పెనుభారం మోపిన కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, సీతానగరం, యర్రంపల్లి సొసైటీ అధ్యక్షులు కాకర్ల నాగేశ్వరరావు, జంగా చెన్నకేశవరెడ్డి, యర్రంపల్లి సర్పంచ్ బత్తుల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జె.జానకిరెడ్డి, పట్టణ వైసీపీ కన్వీనర్ గంధం చంటి, నాయకులు బలువూరి నరసింహరావు, మోటపోతుల శ్రీనివాసగౌడ్, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, తోటకుమార్, నాగిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వినూత్న నిరసన భీమవరం అర్బన్: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం బీజేపీ నాయకులు గ్యాస్ బండలకు పూలమాలలు వేసి బండకో దండ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ చేయని గ్యాస్ కనెక్షన్లకు బండ ధరను అదనంగా రూ.200కు పైగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానాలు ఆధార్ సీడింగ్‌ను సంక్షేమ పథకాలకు వర్తింపచేయవద్దని సూచించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాకర్స్ (పుట్‌పాత్ వ్యాపారస్తులు) వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధరను కూడా పెంచివేయడం దారుణమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్యాస్ సిలెండర్ ధర పెంపును విరమించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణ కార్యదర్శి అడ్డగర్ల ప్రభాకర గాంధీ, మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ఎన్ శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, మర్రి సాంబశివ, అందే త్రిమూర్తులు, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. తక్షణం గ్యాస్ ధరలను తగ్గించాలి ఆకివీడు : గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ స్థానిక జాతీయ రహదారిపై అయిభీమవరం మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆధార్ కార్డు అ నుసంధానం చేసిన వారికి, చేయని వా రికి మధ్య ధర వ్యత్యాసాన్ని తొల గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కె.రామకృష్ణం రాజు, వినియోగదారుల ఉద్యమకర్త బొబ్బిలి బంగారయ్య, అల్లూరి సత్యనారాయణరాజు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఉప సర్పంచ్ హుస్సేన్, బీహెచ్ తిమ్మరాజు, ఇ.సత్యనారాయణ పాల్గొన్నారు.