సమైక్యవాదమే నేరమా?
సమైక్యవాదమే నేరమా?
Published Mon, Jan 6 2014 3:42 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
చింతలపూడి/కామవరపుకోట/టి.నరసాపురం, న్యూస్‌లైన్ : సమైక్యవాదాన్ని వినిపిస్తే సంకె ళ్లు తప్పవా? జిల్లాలో పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. తమ పర్యటనను ఎక్కడ అడ్డుకుంటారోనని కేంద్ర, రా ష్ట్ర మంత్రుల ఆదేశాలతో పోలీసులు మరోసారి వైసీపీ నేతలు, సమైక్యవాదులను గృహ నిర్బంధం, అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణలు ఆదివారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ సహా 22 మంది వైసీపీ నేతలు, సమైక్యవాదులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.
ఆదివారం ఉదయంచింతలపూడిలోని రాజేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేస్తున్నట్టు చెప్పారు. గతేడాది డిసెంబర్ 17న చింతలపూడి విచ్చేసిన కావూరిని రాజేష్ నాయకత్వంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కేంద్రమంత్రి సమైక్య వాదులను వెధవలు, సన్నాసులు, లంచగొండులని దుర్భాషలాడటంతో సమైక్యవాదులు ఆయనపై కోడిగుడ్లతో దాడికి దిగారు. అప్పటి ఘటనలో రాజేష్‌తో పాటు 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం, మరుసటి రోజు కావూరి ఒత్తిడితో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని కామవరపుకోట, టి.నరసాపురంలో కేంద్రమంత్రులు కావూరి, జేడీ శీలం, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ పర్యటించారు. సమైక్యవాదులు వారి పర్యటనను అడ్డుకుంటారన్న భయంతో ముందస్తుగా రాజేష్‌తో పాటు సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సీహెచ్ నరేంద్రరాజు, తోట కుమార్, రామరాజునాయక్‌లను నిర్బంధంలోకి తీసుకుని సాయంత్రం విడిచిపెట్టినట్టు ఎస్సై బి.మోహన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సమైక్య ఉద్యమానికి మద్దతు కోరినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు.
కామవరపుకోట, టి.నరసాపురంలో..
కామవరపుకోటలో వైసీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్‌ను పోలీసులు ఆయన ఇంటిలో నిర్బంధించారు. బయటకు రాకుండా ఇంటి బయట నలుగురు కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. మంత్రుల సభ అనంతరం ఆయనను విడిచి పెట్టారు. తడికలపూడిలో వైఎస్సార్ సీపీ నాయకులు వై శ్రీను, ఈడ్పుగంటి సత్యవర ప్రసాద్, చలమాల సుబ్బారావు, సరికొండ కాళిదాసులను స్థానిక పోలీస్‌స్టేషన్లో నిర్బంధించారు. వారితో పాటు సమైక్యవాదులు ఆడ మిల్లి లక్ష్మీపతినగర్‌కు చెందిన మద్దిపాటి శ్రీనివాసరావు, బొకినాల ఏసు, తానంకి శ్రీను, తానేటి జాన్‌రాజు, తానేటి వెంకటేశ్వరరావు, తానేటి రామకృష్ణ అనే ఆరుగురు వ్యక్తులను స్టేషన్లో నిర్బంధించారు. తడికలపూడి, ఆడమిల్లిల్లో మంత్రుల పర్యటన అనంతరం వీరిని విడుదల చేశారు. టి.నరసాపురంలో నలుగురు వ్యక్తులను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు ఎస్సై డి.రాంబాబు తెలిపారు. బొర్రంపాలానికి చెందిన గుండె ముక్కరామయ్య, గుండె మాణిక్యాలరావు, చల్లా ఆనందరావు, గాది రాంబాబులను అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్‌పై విడుదల చేసిన ట్టు ఆయన వివరించారు.
Advertisement