మిల్లు పేరుతో టీడీపీ అభ్యర్థి రోషన్ మోసం
రూ.62 లక్షల బకాయి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు
ఆయన మోసంతో నా భర్త మరణించారు
చింతలపూడి టీడీపీ అభ్యర్థిపై మహిళా సర్పంచ్ ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ ఓ మహిళా సర్పంచ్‌ని మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మిల్లు కొనుగోలులో రూ.62 లక్షలు బకాయిపడి కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారని మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రోషన్‌కుమార్ దంపతుల చేతుల్లో మోసపోయానని, న్యాయం చేయాలని సీఐడీకి, సీబీఐకి ఫిర్యాదు చేయడం చింతలపూడి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దాల్ మిల్ కొనుగోలు పేరుతో..
దాల్ మిల్ కొనుగోలు పేరుతో చింతలపూడి టీడీపీ అభ్యర్థి, ఎన్‌ఆర్‌ఐ సొంగా రోషన్‌కుమార్ దంపతులు తనను మోసం చేశారని మండలంలోని రాఘవాపురం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ కోండ్రు వజ్ర కిషోర్ ఆరోపించారు. ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఎన్‌ఆర్‌ఐ సొంగా రోషన్ కుమార్ దంపతులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సీబీఐ, ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. తన భర్త (ఎన్‌ఆర్‌ఐ) మెకానికల్ ఇంజనీర్ కోండ్రు కిషోర్‌కుమార్‌ని నయవంచన చేసి నూజివీడులో గల తమ దాల్ మిల్‌ను పూర్తి పైకం చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసానికి పాల్పడ్డారని వాపోయారు. తన భర్తను నమ్మించి, ఒక్కరినే తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. తమకు రావాల్సిన రూ.98 లక్షల్లో రూ.36 లక్షలు ఇచ్చి, రూ.62 లక్షలు లోన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత ఇస్తామని చెప్పారని వివరించారు.
కొన్ని నెలలు తమకు లోన్ రాలేదని, మరికొన్ని నెలలు ఫోన్‌లు ఎత్తకుండా ఎటువంటి సమాధానం చెప్పకుండా, కొంతకాలం తరువాత ఫోన్‌లు ఎత్తినా నాకు, నా భార్యకు ఎటువంటి సంబంధం లేదు.. నా భార్యను వదిలివేశాను.. నీకు రావలసిన డబ్బు ఆవిడను అడుగు అని సొంగా రోషన్‌కుమార్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రోషన్ భార్య విజయను అడిగితే నాకేంటి సంబంధం.. నాకు సంబంధం లేదు.. కొనిచ్చింది ఆయన కాబట్టి ఆయన్నే అడగండి.. మేం విడిపోయాం.. అంటూ ఒకరిపై ఒ కరు మోసపూరిత మాటలు చెబుతూ నమ్మిస్తూ కా లం గడిపారన్నారు. దీంతో గత్యంతరం లేక రోషన్‌కుమార్, ఆయన భార్య విజయ, తండ్రి రాజారత్నం, మామ సిమియోను, అతని బినామీదారుపై ఫిర్యాదు చేసినట్లు వజ్ర కిషోర్ చెప్పారు.
తన ఫిర్యాదులో పక్కా ఆధారాలు చూపిస్తూ ఏ విధంగా రోషన్‌కుమార్ దంపతులు బినామీలను ఉపయోగించి తన భర్తను మోసగించారో వివరంగా పేర్కొన్నారు. రోషన్‌కుమార్ చేసిన మోసాన్ని తట్టుకోలేక తన భర్త కిషోర్ మనోవేదనతో మృతి చెందారని వాపోయారు. అమెరికా నుంచి వచ్చాక డబ్బులు అడుగుతుంటే ఎన్నికల అయ్యాక ఇస్తామని చెప్పారని, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పెద్దలు కూడా మధ్యవర్తిత్వం నడిపారని అన్నారు. దళితులని ఉద్దరించడానికి పైనుంచి దిగి వచ్చానని డాంబికాలు పోతున్న సొంగా రోషన్‌కుమార్ ఒక దళిత సర్పంచ్‌కి చేసిన అన్యాయాన్ని గురించి నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment