చంద్రశేఖర్, దేవీప్రియను గెలిపించండి | YSRCP Thota Chandrasekhar win Appeal to voters | Sakshi
Sakshi News home page

చంద్రశేఖర్, దేవీప్రియను గెలిపించండి

Published Thu, Apr 17 2014 3:15 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

చంద్రశేఖర్, దేవీప్రియను గెలిపించండి - Sakshi

చంద్రశేఖర్, దేవీప్రియను గెలిపించండి

 చింతలపూడి, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మద్దాల దేవీప్రియను అఖండ మెజార్టీతో గెలిపించి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై గల అభిమానాన్ని చాటాలని పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు చింతలపూడి చేరుకున్న ఆమె ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు జరిగిన జనభేరి సభలో విజయమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనసున్న మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
 
 తమది మాటతప్పే కుటుంబం కాదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తారని అన్నారు. విజయమ్మకు మాజీ ఎమ్మెల్యేలు  మద్దాల రాజేష్‌కుమార్, ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్లు మేడవరపు అశోక్, బొడ్డు వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి జె.జానకిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పార్టీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, పట్టణ కన్వీనర్ గంధం చంటి తదితరులు ఘనస్వాగతం పలికారు. విజయమ్మ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలులింగపాలెం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే సుభాని, సుగుణరావు, పి.రాటాలు, తాళం చెన్నారావు, సీహెచ్ ప్రభుదాస్ తదితరులు తమ అనుయూయులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చింతలపూడిలో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
 ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదు :
 తోట చంద్రశేఖర్
 జనభేరి సభలో ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల్ని ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణమైన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవించారని పేర్కొన్నారు. 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు, ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు, ఆరు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25కు పెంచి పేదవాడికి పట్టెడు అన్నం కూడా అందకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఇన్ని ఘనకార్యాలు చేసి మళ్లీ ఓట్లు అడగడానికి సిగ్గు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. రైతులకు, పేదలకు, మహిళలకు మేలు జరిగింది వైఎస్ పాలనలో మాత్రమేనని చంద్రశేఖర్ వివరించారు. చింతలపూడి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చే  భద్రాచలం -కొవ్వూరు రైల్వే లైను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే వైఎస్ జగన్ కావాలని అన్నారు. సీమాంధ్ర పునర్నిర్మాణానికి, హైదరాబాద్ వంటి రాజధాని నిర్మాణం చేయగలిగే సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని చెప్పారు.
 
 మీ ఆదరాభిమానాలు కావాలి :
 దేవీప్రియ
 చింతలపూడి అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చి వైఎస్ జగన్ తనను ఆశీర్వదించారని, ఈ ఎన్నికల్లో గెలిపించి ప్రజలు ఆదరించాలని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ దేవీప్రియ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement