చింతలపూడి, నూజివీడులో బొగ్గు నిక్షేపాలు | govt mou over coal found in andrapradesh | Sakshi
Sakshi News home page

చింతలపూడి, నూజివీడులో బొగ్గు నిక్షేపాలు

Published Wed, Jun 1 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

govt mou over coal found in andrapradesh

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గునిక్షేపాలపై అన్వేషణకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేజీ బేసిన్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, కృష్ణాజిల్లా నూజివీడు పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కొంత కాలం క్రితం అధ్యయనాల్లో తేలిన విషయం విదితమే. బొగ్గు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉందో అన్వేషించటానికి ప్రభుత్వం మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఇసిఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్(ఎన్ఎంఇటి) ప్రతినిధులతో త్రైపాక్షిక  ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలోని చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎస్పీ టక్కర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంఓయూ చేసుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సున్నపురాయి వేలం, బంగారు ఖనిజాన్వేషణలో ఈ సంస్థలు సహకారం అందిస్తాయి. 2017 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని తమ శాఖ కార్యకలాపాల ప్రగతిని సమీక్షించామని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఖనిజాన్వేషణ పూర్తవుతుందని ఆమె అన్నారు. ఎంఓయూ ప్రకారం రాష్ట్రంలో పెద్దతరహా ఖనిజాలపై ఎన్ఎంఇటీకి 2% రాయల్టీ లభిస్తుంది. ఈ రాయల్టీ సొమ్మును ఎన్ఎంఇటి రాష్ట్రంలో ఖనిజాన్వేషణ చేపట్టనున్న ఎంఇసిఎల్కు చెల్లిస్తుంది. కొత్త ఖనిజ నిక్షేపాలను గుర్తించిన తర్వాత వాటిని బ్లాకులుగా చేసి వేలం వేస్తారు. ఎన్ఎంఇటి, ఎంఇసిఎల్ల సహకారంతో జరిగే ఖనిజాన్వేషణ నిరంతర ప్రక్రియ అవుతుంది.

ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, శ్రీ ఎస్పీ టక్కర్, గనుల శాఖ కార్యదర్శి శ్రీ గిరిజా శంకర్, ఎన్ఎంఇటి పక్షాన కోషిఖాన్, ఎంఇసిఎల్  తరపున శ్రీ యోగేష్ శర్మ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement