గ్యాస్ ధరల పెంపుపై నిరసన
Published Fri, Jan 3 2014 3:59 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
చింతలపూడి, న్యూస్‌లైన్ : గ్యాస్ ధరల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో వైసీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ గ్యాస్ బండను నెత్తిన పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంటా వార్పు నిర్వహించారు. ఖాళీ గ్యాస్ బండలతో రాస్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలను భారీగా పెంచి యూపీఏ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర కానుక అందించిందని విమర్శించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలకు ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలను ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని రాజేష్ డిమాండ్ చేశారు.
మహానేత వైఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ.50 గ్యాస్ ధర పెంచితే ఆడపడుచులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఆ ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. సామాన్యులపై పెనుభారం మోపిన కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, సీతానగరం, యర్రంపల్లి సొసైటీ అధ్యక్షులు కాకర్ల నాగేశ్వరరావు, జంగా చెన్నకేశవరెడ్డి, యర్రంపల్లి సర్పంచ్ బత్తుల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జె.జానకిరెడ్డి, పట్టణ వైసీపీ కన్వీనర్ గంధం చంటి, నాయకులు బలువూరి నరసింహరావు, మోటపోతుల శ్రీనివాసగౌడ్, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, తోటకుమార్, నాగిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ వినూత్న నిరసన
భీమవరం అర్బన్: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం బీజేపీ నాయకులు గ్యాస్ బండలకు పూలమాలలు వేసి బండకో దండ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ చేయని గ్యాస్ కనెక్షన్లకు బండ ధరను అదనంగా రూ.200కు పైగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానాలు ఆధార్ సీడింగ్‌ను సంక్షేమ పథకాలకు వర్తింపచేయవద్దని సూచించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాకర్స్ (పుట్‌పాత్ వ్యాపారస్తులు) వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధరను కూడా పెంచివేయడం దారుణమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్యాస్ సిలెండర్ ధర పెంపును విరమించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణ కార్యదర్శి అడ్డగర్ల ప్రభాకర గాంధీ, మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్ శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, మర్రి సాంబశివ, అందే త్రిమూర్తులు, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తక్షణం గ్యాస్ ధరలను తగ్గించాలి
ఆకివీడు : గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ స్థానిక జాతీయ రహదారిపై అయిభీమవరం మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆధార్ కార్డు అ నుసంధానం చేసిన వారికి, చేయని వా రికి మధ్య ధర వ్యత్యాసాన్ని తొల గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కె.రామకృష్ణం రాజు, వినియోగదారుల ఉద్యమకర్త బొబ్బిలి బంగారయ్య, అల్లూరి సత్యనారాయణరాజు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఉప సర్పంచ్ హుస్సేన్, బీహెచ్ తిమ్మరాజు, ఇ.సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement