gas price hikes
-
గ్యాస్ ధరను పెంచిన కేంద్రం, భారీగా పెరగనున్న రిలయన్స్..ఓఎన్జీసీల ఆదాయం!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఓవైపు మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం తాజాగా ఆయిల్ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును యూనిట్‌కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, మరింత సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్ ధరను యూనిట్‌కు 3.8 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. గ్యాస్ ధర యూనిట్‌కు 1 డాలర్ పెరిగితే ఓఎన్జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. చదవండి: గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..? -
ధరల పెంపుపై ప్రజామిలిటెంట్ పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రెండు ప్రభుత్వాలపై యుద్ధానికి ప్రజలే నాయకత్వం వహించాలని కోరారు. శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ క్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, యూత్ కాం గ్రెస్ నేత అనిల్ యాదవ్‌లతో కలసి రేవంత్ మాట్లాడారు. ‘బషీర్‌బాగ్’ను మించిన ఉద్యమం జరగాలి... సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరినీ దోచుకొనేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 7న విద్యుత్ సౌధ, పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయాల ముందు జరిగే ఆందోళనల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. బషీర్‌బాగ్‌ను మించిన వీరోచిత ఉద్యమం విద్యుత్‌సౌధ ముందు జరగాలని, ఇందుకు కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన ఎన్‌రోలర్స్ నాయకత్వం వహించాలని సూచించారు. కమ్యూనిస్టులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలపై రూ. 36 లక్షల కోట్ల భారం... కేంద్రంలో 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 414 ఉంటే, డీజిల్ లీటర్‌కు రూ. 55, పెట్రోల్ రూ. 71గా ఉండేదన్నారు. కానీ మోదీ పాలనలో ఇప్పుడు సిలిండర్ ధర రూ. వెయ్యి దాటిందని, డీజిల్, పెట్రోల్ ధరలు రూ. 100 దాటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఈ ఎనిమిదేళ్లలో రూ. 36 లక్షల కోట్లను ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేశాయని విమర్శించారు. పేదలను దోచుకోవడంలో మోదీ, కేసీఆర్ అవిభక్త కవలల్లాంటి వారని అభివర్ణించారు. రాష్ట్రంలోని డిస్కంలకు రూ. వేల కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వం... ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో ఆ భారం మోపుతోందని చెప్పారు. ఆ లేఖ రాసి ఉండకపోతే... రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతుల జుట్టును కేంద్రానికి సీఎం కేసీఆర్ అందించారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని సీఎం సంతకం పెట్టి కేంద్రానికి లేఖ ఇచ్చి ఉండకపోతే ఈపాటికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంగీ పట్టుకొని గుంజుకొచ్చే వాళ్లమని, ధాన్యం ఎందుకు కొనవని నిలదీసేవాళ్లమన్నారు. మెడపై కత్తి పెడితే సంతకం పెట్టానని కేసీఆర్ చెబుతున్నారని, మరి అదే మెడపై ఎవరైనా ఏకే–47 గురిపెట్టి అడిగితే గజ్వేల్‌లోని ఫాంహౌస్ రాసిస్తారా? అని నిలదీశారు. ఈ విషయంలో కేసీఆర్‌ను ఉరేసినా తప్పులేదని, ఈ ప్రభుత్వాన్ని అమరవీరుల స్థూపం వద్ద రైతుల చేత రాళ్లతో కొట్టించాలని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు. -
పేదల ఇంట్లో గ్యాస్ మంటలు
-
మళ్లీ పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర, ఏడాదిలో ఐదోసారి
-
సబ్సిడీలేని సిలిండర్లపై మళ్లీ బాదుడు
ముంబై, సాక్షి: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ వర్తించని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు తాజాగా రూ. 50 చొప్పున ఎగశాయి. దీంతో ఢిల్లీలో వీటి ధరలు ప్రస్తుతం రూ. 644ను తాకాయి. ఇక కోల్‌కతాలో అయితే రూ. 670.5కు చేరాయి. ఈ ధరలు ముంబైలో రూ. 644కాగా.. చెన్నైలో రూ. 660గా నమోదయ్యాయి. సుమారు రెండు వారాల క్రితం సైతం సబ్సిడీలేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 50 చొప్పున పెరిగిన విషయం విదితమే. సాధారణంగా విదేశాలలో ధరలు, రూపాయి మారకం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను నెలకోసారి సమీక్షిస్తుంటాయి. కాగా.. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందించే సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం.. ఇతర సిలిండర్లకూ తాజాగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతర వంట గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్లపైనా పెంపును ప్రకటించాయి. 5 కేజీల సిలిండర్‌పై తాజాగా రూ. 18 వడ్డించగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పైనా రూ. 36.5 పెంపును చేపట్టాయి. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్‌పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది. వెరసి ప్రస్తుతం వీటి ధరలు రూ. 1,296కు చేరాయి. -
పెరిగిన గ్యాస్ ధర
సాక్షి, సిటీబ్యూరో: గృహోపయోగ వంట గ్యాస్ ధర పెరిగింది. రెండు మాసాలుగా వరుసగా తగ్గిన వంట గ్యాస్ ధర ఈసారి మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిలిండర్ ధర రూ.628లు ఉండగా, పెరిగిన ధరతో అది రూ.644కు చేరింది. పెరిగిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. -
దిగుబండ..
సాక్షి, జనగామ: వంట గ్యాస్ వినియోగదారులపై మళ్లీ భారం పెరిగింది. సబ్సిడీ ముసుగులో అసలు ధరలను పెంచేస్తూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నారు. సబ్సిడీ గ్యాస్‌కు మంగళం పాడే ప్రయత్నంలో భాగంగానే ధరల పెరుగుదల కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో వరుసగా ఐదుసార్లు సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం.. నిప్పు పెట్టకుండానే మంటను వెలిగించేలా చేస్తోంది. గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్‌పై రూ.58.50, కమర్షియల్ గ్యాస్‌పై రూ.87 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్తగా అమలులోకి వచ్చిన ధరలపై అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వినియోగదారులపై నెలకు రూ. 31.50 లక్షలకు పైగా అదనపు భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరో పక్క ధరలను పెంచేస్తూ.. వాటిని అటెకెక్కించే విధంగా మారుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలో హెచ్‌పీ, భారత్, ఐఓసీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలు పది ఉన్నాయి. బచ్చన్నపేట, పెంబర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, గుండాల పరిధిలో 98 వేల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు 400 వరకు వినియోగిస్తున్నారు. ఇందులో ప్రతి నెల 55 వేల కుటుంబాలు సబ్సిడీ గ్యాస్‌ను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్‌లో ఒక్కో సిలిండర్‌పై రూ.300కు పైగా పెంచారు. 2018 అక్టోబర్‌లో అసలుకు కొసరుగా వడ్డన చేశారు. పెరుగుతున్న ధరల ఆధారంగా గ్యాస్‌పై వచ్చే సబ్సిడీ సొమ్మును వినియోగదారుల ఖాతాలకు నేరుగా డిపాజిట్ చేస్తున్నారు. అయినప్పటికీ సామాన్య కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోవడంతో గతంలో రూ.70 లక్షల భారం పడింది. కొత్తగా అమలులోకి వచ్చిన ధరలతో మరో రూ.31.50 లక్షలు పెరిగింది. సబ్సిడీ వస్తుంది..అసలు ఎలా? సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతుండడంతో..అసలు నగదు కోసం పేద కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.697 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. నవంబర్‌లో రూ.790.50 కి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్ ధర రూ.880 ఉండగా.. రూ.330 సబ్సిడీ అందించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చు తగ్గుల కారణంతో ఈ నెల మొదటి వారంలో ఒక్కో సిలిండర్‌పై 58.50 రూపాయలు వడ్డించడంతో రూ.938.50కి చేరుకుంది. సిలిండర్ ధర వెయ్యికి దగ్గర కావడంతో.. చేసేది లేక కట్టెల పొయ్యిలే మేలు అనుకునే దయనీయ పరిస్థితి నెలకొంది. సిలిండర్‌కు రూ.938.50 కాకుండా, నేరుగా రూ. 513.50 విక్రయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెలతో పోలిస్తే సిలిండర్‌పై రూ.2.33 నామమాత్రంగా పెరిగినా..అసలు కష్టంగా మారుతోంది. సబ్సిడీ గ్యాస్‌కు స్వస్తి పలికేందుకే.. ధరలను పెంచుతూ కేంద్రం ముందస్తు హెచ్చరికలను చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కమర్షియల్’పై కత్తి.. కిరోసిన్, బట్టీ పొయ్యిలకు స్వస్తి పలికి హోటళ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడుతున్నారు. నెలనెల పెరుగుతున్న కమర్షియల్ ధరలతో లాభాలు తగ్గిపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రూ.1,280 పలికిన కమర్షియల్ సిలిండర్ ధర నవంబర్ 2వ తేదీ నుంచి రూ.1427.50కి పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రికార్డు స్థాయిలో రూ.147 పెరిగిన ధరలతో గప్‌చుప్, హోటళ్లు, టీ స్టాళ్ల యజమానులు ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోయారు. మళ్లీ ధరలకు రెక్కలు రావడంతో చాలా మంది కూలి పనుల కోసం వలస బాట పట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రూ.1563 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర..రూ.87 పెంచడంతో రూ.1650కి చేరుకుంది. మరో నాలుగు నెలల్లోనే సిలిండర్ ధర రూ.2 వేలుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించాలని జిలాప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమల్లోకి పెరిగిన ధరలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్‌పై పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ.938.50, కమర్షియల్ రూ.1650 పెరిగింది. సిలిండర్‌పై రూ.425 సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. – కాశీనాథ్, భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి, జనగామ పేదల నడ్డి విరుస్తున్న కేంద్రం.. సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ ధరలను తరచూ పెంచడం ఘోరం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. సబ్సిడీ పేరుతో గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ.. మరో పక్క నడ్డి విరిచే కార్యక్రమం పెట్టుకుంది. అసలు డబ్బులు లేవని పేదలు మొత్తుకుంటే.. సబ్సిడీ సొమ్ము ఖాతాలో జమచేస్తామనడం బాధాకరం. – ధర్మపురి శ్రీనివాస్, జనగామ ధరలను తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనలో భాగంగానే ఇలా చేస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే గ్యాస్‌ను రూ.వెయ్యికి చేరువ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతున్న కేంద్రం.. చివరకు గ్యాస్ ధరలు పెంచుతూ నడ్డి విరుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. – కొత్తపల్లి సమ్మయ్య, జనగామ -
గ్యాస్ ధర భారమే!
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర ఇంతింతై వటుడింతై మాదిరిగా రెండు నెలల నుంచి ఎగబాకుతోంది. వంటింట్లో మంట రాకుండానే మాడ్చేస్తోంది. సిలిండర్ ధర పెంపు సగటు జీవిని సంకటంలో పడేస్తోంది. ప్రస్తుతం వంట గ్యాస్ ధర రూ.58 పెరిగి మొత్తం సిలిండర్ ధర రూ.811లకు చేరింది. కేవలం రెండు నెలల వ్యవధిలో రూ.108 పెరిగినట్లయింది. అయితే డీబీటీ (సబ్సిడీ) వర్తిస్తున్న గృహ వినియోగదారులకు మాత్రం పెరిగిన రూ.58 రూపాయలు బ్యాంక్ ఖాతాలో తిరిగి వెనక్కి వస్తోంది. కానీ ముందుగానే రూ.811 రూపాయలు చెల్లించడం సగటు జీవికి కొంత ఇబ్బందికరమే. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తేయాలని సరిగ్గా ఏడాది క్రితం జూలైలో నిర్ణయం తీసుకోవడంతో చమురు సంస్ధలు ధరల సవరణల పేరుతో వరుసగా గత డిసెంబర్ వరకు 20 సార్లు సిలిండర్ రీఫిల్ ధర పెంచి...తిరిగి వరసగా నాలుగు పర్యాయాలు తగ్గిస్తూ వచ్చింది. గత రెండు నెలల నుంచి తిరిగి వరసగా ధర పెంచడంతో ధర ఎగబాకుతోంది. వాస్తవంగా పెరిగిన ధర సబ్సిడీ నగదు రూపేణా బ్యాంక్ ఖాతాలో నయా పైసాతో సహా జమ అవుతున్నా..ఒకేసారి సిలిండర్ కోసం పెద్ద మొత్తంలో నగదుగా చెల్లింపు చేయడం భారంగా కనిపిస్తోంది. బ్యాంక్‌లో సబ్సిడీ సొమ్ము నగదుగా సకాలంలో జమ కాకపోవడం కూడా వినియోగదారులైన నిరుపేదలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులు మార్కెట్ ధర ప్రకారం నగదుగా చెల్లిస్తే సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన చెల్లింపులు నగదు బదిలీ కింద బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. గత నెలలో సిలిండర్ ధరను బట్టి సబ్సిడీ సొమ్ము రూ.263.50 బ్యాంకు ఖాతాలో జమ కాగా, తాజాగా పెరిగిన ధరతో రూ.321.50 జమ అవుతుంది. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్లపై డెలివరీ బాయ్స్ అదనంగా బాదేస్తున్నారు. ప్రతి సిలిండర్‌పై రూ.20 నుంచి 25 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు. -
బండ బాదుడుపై మండిపాటు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్యాస్, పెట్రోలు ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి హెచ్చరించారు. శనివారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా యువత అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు కట్టెల పొయ్యిపై వంట చేసి తమ నిరసన తెలిపారు. అనంతరం ధర్నాలో పాల్గొన్నవారినుద్దేశించి బట్టి జగపతి మాట్లాడుతూ, సర్కార్.. మూడు నెలల కాలంలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరలను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడుతూ వంటలు చేయటాన్ని చూసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళలకు గ్యాస్ పంపిణీ చేశారనీ, కేంద్రం గ్యాస్‌బండపై ఒక్కసారి రూ.50 పెంచితే, ఆ భారాన్ని కూడా మహిళలపై ఆయన పడనీయలేదన్నారు. ఆ మహానేత మరణానంతరం సీఎం పదవి చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌లు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పెరిగిన ధరలకు సామాన్యులు గ్యాసు కూడ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల వ్యవసాయం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై పెను ప్రభావం చూపుతుందన్నారు. మహిళల కన్నీళ్లను చూస్తున్న పాలకులు కాలగర్భంలో కలవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. వైఎస్సార్ సీపీ యువత విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, సీల్డ్ కవర్ సీఎంకు సమాన్యుల ఘోష పట్టదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ సామాన్యుల పక్షాన పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. పేదల కోసం రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు నర్ర బిక్షపతి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వ్యామోహంలోపడి ప్రజల బాగోగులు విస్మరించారన్నారు. ప్రజలకోసమే ఉద్భవించిన వైఎస్సార్సీపీ వారి పక్షాన రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్మిక సెల్ అధ్యక్షులు నర్రా బిక్షపతి, బీసీసెల్ రాష్ట్ర నాయకుడు సతీష్‌గౌడ్, పార్టీ నాయకులు రమేశ్, రాజేశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, భవానీశంకర్, దత్తు, సంతోష్, బస్వరాజ్, బంటి, రాజ్‌కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
చింతలపూడి, న్యూస్‌లైన్ : గ్యాస్ ధరల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో వైసీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ గ్యాస్ బండను నెత్తిన పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంటా వార్పు నిర్వహించారు. ఖాళీ గ్యాస్ బండలతో రాస్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలను భారీగా పెంచి యూపీఏ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర కానుక అందించిందని విమర్శించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలకు ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలను ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని రాజేష్ డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ.50 గ్యాస్ ధర పెంచితే ఆడపడుచులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఆ ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. సామాన్యులపై పెనుభారం మోపిన కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, సీతానగరం, యర్రంపల్లి సొసైటీ అధ్యక్షులు కాకర్ల నాగేశ్వరరావు, జంగా చెన్నకేశవరెడ్డి, యర్రంపల్లి సర్పంచ్ బత్తుల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జె.జానకిరెడ్డి, పట్టణ వైసీపీ కన్వీనర్ గంధం చంటి, నాయకులు బలువూరి నరసింహరావు, మోటపోతుల శ్రీనివాసగౌడ్, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, తోటకుమార్, నాగిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వినూత్న నిరసన భీమవరం అర్బన్: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం బీజేపీ నాయకులు గ్యాస్ బండలకు పూలమాలలు వేసి బండకో దండ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ చేయని గ్యాస్ కనెక్షన్లకు బండ ధరను అదనంగా రూ.200కు పైగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానాలు ఆధార్ సీడింగ్‌ను సంక్షేమ పథకాలకు వర్తింపచేయవద్దని సూచించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాకర్స్ (పుట్‌పాత్ వ్యాపారస్తులు) వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధరను కూడా పెంచివేయడం దారుణమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్యాస్ సిలెండర్ ధర పెంపును విరమించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణ కార్యదర్శి అడ్డగర్ల ప్రభాకర గాంధీ, మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ఎన్ శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, మర్రి సాంబశివ, అందే త్రిమూర్తులు, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. తక్షణం గ్యాస్ ధరలను తగ్గించాలి ఆకివీడు : గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ స్థానిక జాతీయ రహదారిపై అయిభీమవరం మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆధార్ కార్డు అ నుసంధానం చేసిన వారికి, చేయని వా రికి మధ్య ధర వ్యత్యాసాన్ని తొల గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కె.రామకృష్ణం రాజు, వినియోగదారుల ఉద్యమకర్త బొబ్బిలి బంగారయ్య, అల్లూరి సత్యనారాయణరాజు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఉప సర్పంచ్ హుస్సేన్, బీహెచ్ తిమ్మరాజు, ఇ.సత్యనారాయణ పాల్గొన్నారు.