సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర ఇంతింతై వటుడింతై మాదిరిగా రెండు నెలల నుంచి ఎగబాకుతోంది. వంటింట్లో మంట రాకుండానే మాడ్చేస్తోంది. సిలిండర్ ధర పెంపు సగటు జీవిని సంకటంలో పడేస్తోంది. ప్రస్తుతం వంట గ్యాస్ ధర రూ.58 పెరిగి మొత్తం సిలిండర్ ధర రూ.811లకు చేరింది. కేవలం రెండు నెలల వ్యవధిలో రూ.108 పెరిగినట్లయింది. అయితే డీబీటీ (సబ్సిడీ) వర్తిస్తున్న గృహ వినియోగదారులకు మాత్రం పెరిగిన రూ.58 రూపాయలు బ్యాంక్ ఖాతాలో తిరిగి వెనక్కి వస్తోంది. కానీ ముందుగానే రూ.811 రూపాయలు చెల్లించడం సగటు జీవికి కొంత ఇబ్బందికరమే. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తేయాలని సరిగ్గా ఏడాది క్రితం జూలైలో నిర్ణయం తీసుకోవడంతో చమురు సంస్ధలు ధరల సవరణల పేరుతో వరుసగా గత డిసెంబర్ వరకు 20 సార్లు సిలిండర్ రీఫిల్ ధర పెంచి...తిరిగి వరసగా నాలుగు పర్యాయాలు తగ్గిస్తూ వచ్చింది. గత రెండు నెలల నుంచి తిరిగి వరసగా ధర పెంచడంతో ధర ఎగబాకుతోంది.
వాస్తవంగా పెరిగిన ధర సబ్సిడీ నగదు రూపేణా బ్యాంక్ ఖాతాలో నయా పైసాతో సహా జమ అవుతున్నా..ఒకేసారి సిలిండర్ కోసం పెద్ద మొత్తంలో నగదుగా చెల్లింపు చేయడం భారంగా కనిపిస్తోంది. బ్యాంక్‌లో సబ్సిడీ సొమ్ము నగదుగా సకాలంలో జమ కాకపోవడం కూడా వినియోగదారులైన నిరుపేదలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులు మార్కెట్ ధర ప్రకారం నగదుగా చెల్లిస్తే సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన చెల్లింపులు నగదు బదిలీ కింద బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. గత నెలలో సిలిండర్ ధరను బట్టి సబ్సిడీ సొమ్ము రూ.263.50 బ్యాంకు ఖాతాలో జమ కాగా, తాజాగా పెరిగిన ధరతో రూ.321.50 జమ అవుతుంది. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్లపై డెలివరీ బాయ్స్ అదనంగా బాదేస్తున్నారు. ప్రతి సిలిండర్‌పై రూ.20 నుంచి 25 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment