ముంబై, సాక్షి: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ వర్తించని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు తాజాగా రూ. 50 చొప్పున ఎగశాయి. దీంతో ఢిల్లీలో వీటి ధరలు ప్రస్తుతం రూ. 644ను తాకాయి. ఇక కోల్‌కతాలో అయితే రూ. 670.5కు చేరాయి. ఈ ధరలు ముంబైలో రూ. 644కాగా.. చెన్నైలో రూ. 660గా నమోదయ్యాయి. సుమారు రెండు వారాల క్రితం సైతం సబ్సిడీలేని ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు రూ. 50 చొప్పున పెరిగిన విషయం విదితమే. సాధారణంగా విదేశాలలో ధరలు, రూపాయి మారకం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను నెలకోసారి సమీక్షిస్తుంటాయి. కాగా.. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందించే సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం..
ఇతర సిలిండర్లకూ
తాజాగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతర వంట గ్యాస్(ఎల్‌పీజీ) సిలిండర్లపైనా పెంపును ప్రకటించాయి. 5 కేజీల సిలిండర్‌పై తాజాగా రూ. 18 వడ్డించగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పైనా రూ. 36.5 పెంపును చేపట్టాయి. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్‌పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది. వెరసి ప్రస్తుతం వీటి ధరలు రూ. 1,296కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment