ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో లాక్‌డవున్‌ను ఎత్తివేస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 42 డాలర్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్‌కు తెరతీయడంతో ఏప్రిల్‌లో రెండు దశాబ్దాల కనిష్టం 16 డాలర్లకు పడిపోయిన విషయం విదితమే. గత రెండు వారాలలో బ్రెంట్ చమురు 109 శాతం బలపడటం గమనార్హం! కాగా.. దేశీయంగానూ ఆర్థిక కార్యకలాపాల అన్‌లాకింగ్‌ను మొదలుపెట్టడంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇంధన రంగ ప్రభుత్వ కంపెనీలు భారత్ పెట్రోలియం(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఖుషీ ఖుషీగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్ షేరు 6.4 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 398ను అధిగమించింది. ఈ బాటలో హెచ్‌పీసీఎల్ 6.7 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 222ను దాటింది. ఇక ఐవోసీ 4 శాతం పుంజుకుని రూ. 93 వద్ద కదులుతోంది. తొలుత రూ. 96ను అధిగమించింది. రెస్టారెంట్లు, మాల్స్, హోటళ్లతోపాటు పూర్తిస్థాయిలో దుకాణాలు, కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం ఊపందుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదీ తీరు
పెట్రోలియం ప్రొడక్టులకు మే నెలలో డిమాండ్ 65-70 శాతానికి చేరగా.. కోవిడ్‌కు ముందు స్థాయికంటే ఇది 30-35 శాతమే తక్కువని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇక ఏప్రిల్‌లో 50-60 శాతం క్షీణించిన ఆటో ఇంధన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ప్రస్తుతం 25 శాతమే తక్కువగా నమోదవుతున్నట్లు వివరించాయి. ఈ బాటలో వైమానిక ఇంధన(జెట్ ఫ్యూయల్) డిమాండ్ సైతం 50 శాతం రికవర్ అయినట్లు ఐడీబీఐ క్యాపిటల్ తెలియజేసింది. ఏప్రిల్‌లో 63 శాతం సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకున్న బీపీసీఎల్ రిఫైనరీ మే నెలలో 77 శాతం, ప్రస్తుతం 83 శాతం ఉత్పత్తికి చేరింది. ఇదే విధంగా ఐవోసీ, హెచ్‌పీసీఎల్ సైతం 80 శాతానికిపైగా సామర్థ్య వినియోగంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment