న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది.
తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్‌ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది.
పటిష్టంగా జీఆర్‌ఎం..
స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్‌ఎం) పటిష్టంగా బ్యారెల్‌కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్‌పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్‌పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment