Q1 net loss
-
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్‌జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్ వివరణ ఇచ్చింది. -
బీవోఐ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 561 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 720 కోట్లు ఆర్జించింది. మొండి రుణాలు తగ్గినప్పటికీ అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. మొత్తం ఆదాయం సైతం రూ. 11,641 కోట్ల నుంచి రూ. 11,124 కోట్లకు స్వల్పంగా బలహీనపడింది. అయితే వడ్డీ ఆదాయం 7 శాతం పుంజుకుని రూ. 9,973 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం మాత్రం 50 శాతం క్షీణించి రూ. 1,152 కోట్లకు పరిమితమైంది. నిర్వహణా వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 3,041 కోట్లను తాకాయి. తగ్గిన ఎన్పీఏలు ప్రస్తుత సమీక్షా కాలంలో బీవోఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.51 శాతం నుంచి 9.30 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.21 శాతానికి దిగివచ్చాయి. ఇక కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం వెనకడుగుతో రూ. 658 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 11,710 కోట్ల నుంచి రూ. 11,208 కోట్లకు తగ్గింది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 50 వద్ద ముగిసింది. -
హావెల్స్ లాభం రూ.243 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ గృహోపకరణాల కంపెనీ హావెల్స్ ఇండియా జూన్ త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. రూ.243 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. కమోడిటీల ధరలు (ముడి సరుకులు) పెరిగిపోవడంతో మార్జిన్లు గణనీయంగా ప్రభావితమైనట్టు కంపెనీ తెలిపింది. ఫలితంగా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.236 కోట్లతో పోలిస్తే కేవలం 3 శాతం వృద్ధికి పరిమితమైంది. ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.4,244 కోట్లకు చేరింది. స్విచ్గేర్ల విభాగం నుంచి ఆదాయం 37 శాతం పెరిగి రూ.517 కోట్లుగా, కేబుల్స్ విభాగం ఆదాయం 48 శాతం పెరిగి రూ.1,193 కోట్ల చొప్పున నమోదైంది. ఇక లైటింగ్ అండ్ ఫిక్సర్స్ ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.374 కోట్లుగా ఉంది. ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.839 కోట్లకు చేరింది. లయడ్స్ కన్జ్యూమర్ నుంచి ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ.1,094 కోట్లుగా నమోదైంది. -
చమురు కంపెనీలకు భారీ నష్టాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్‌ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది. పటిష్టంగా జీఆర్ఎం.. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) పటిష్టంగా బ్యారెల్‌కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
వొడాఫోన్ ఐడియాకు తగ్గిన నష్టాలు!
Voda Idea FY 2021-22 Q1 Result: న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 7,319 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 25,460 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. అయితే మొత్తం ఆదాయం 14 శాతం క్షీణించి రూ. 9,152 కోట్లను తాకింది. గత క్యూ1లో వీఐ రూ. 10,659 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇక జూన్‌కల్లా మొత్తం రుణ భారం రూ. 1,91,590 కోట్లకు చేరింది. దీనిలో వాయిదా పడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,06,010 కోట్లుకాగా.. రూ. 62,180 కోట్లమేర ఏజీఆర్ సంబంధ బకాయిలున్నాయి. అయితే ఇదే సమయంలో FY 2021-22కు గానూ కంపెనీ చేతిలో నగదు, తత్సంబంధ నిల్వలు రూ. 920 కోట్లుగా ఉన్నాయి. తగ్గిన సబ్స్క్రయిబర్లు, పెరిగిన.. ఈ కేలండర్ ఏడాది(2021) ముగిసేలోగా రూ. 4,000 కోట్లమేర వ్యయాల్లో పొదుపును సాధించాలని వొడాఫోన్ ఐడియా లక్ష్యంగా పెట్టుకుంది. విశేషం ఏంటంటే.. జూన్‌కల్లా దీనిలో 70 శాతాన్ని సాధించినట్లు ప్రకటించింది. గతేడాది క్యూ1లో నమోదైన 27.98 కోట్లమంది సబ్స్క్రయిబర్ల సంఖ్య.. తాజాగా 25.54 కోట్లకు క్షీణించింది. 4జీ వినియోగదారుల సంఖ్య మాత్రం 10.46 కోట్ల మంది 11.29 కోట్లకు బలపడింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) రూ. 114 నుంచి రూ. 104కు తగ్గినట్లు ప్రకటించుకుంది వీఐ. చదవండి: కళ్లు చెదిరే ఆఫర్.. బైక్‌పై లక్ష వరకు ప్రైజ్‌లు -
టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 4,450 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,444 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకు ఎగసి రూ. 66,406 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 31,983 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఇక స్టాండెలోన్ పద్ధతిలో రూ. 1,321 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతంలో రూ. 2,191 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,687 కోట్ల నుంచి రూ. 11,904 కోట్లకు దూసుకెళ్లింది. ఎగుమతులతో కలసి హోల్‌సేల్ విక్రయాలు 351 శాతం వృద్ధితో 1,14,170 యూనిట్లను తాకాయి. జేఎల్ఆర్ జోరు...: క్యూ1లో లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 74 శాతం జంప్‌చేసి 5 బిలియన్ పౌండ్లను తాకింది. పన్నుకు ముందు నష్టం 11 కోట్ల పౌండ్లకు చేరింది. రిటైల్ వాహన అమ్మకాలు 68 శాతం ఎగసి 1,24,537ను తాకాయి. కాగా.. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో సెమీకండక్టర్ల సరఫరా కొరత మరింత తీవ్రంకానున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో టోకు అమ్మకాలు 50 శాతం ప్రభావితమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. స్థానిక ఈవీ తయారీకి ప్రభుత్వ మద్దతు... స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా టాటా మోటార్స్ సీఈవో పి.బాలాజీ పేర్కొన్నారు. ఫేమ్(ఎఫ్ఏఎంఈ)2 పథకంలో భాగంగా ప్రభుత్వం దేశీయంగా ఈవీ తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూఎస్ ఆటో దిగ్గజం టెస్లా దేశీయంగా వాహన అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకాన్ని తగ్గించమని కోరుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ స్పందనకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంజిన్ పరిమాణం, కారు ఖరీదు తదితరాల ఆధారంగా కార్ల దిగుమతుల్లో సీబీయూలపై 60–100 శాతం మధ్య కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. వాహన దిగుమతుల్లో విజయవంతమైతే తదుపరి దేశీయంగా తయారీని ప్రారంభించగలమని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 1% క్షీణించి రూ. 293 వద్ద ముగిసింది. -
డిష్మన్- టీమ్‌లీజ్- జూబిలెంట్.. బోర్లా
సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్లు చొప్పున క్షీణించాయి. కాగా.. ఈ ఏడాది తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ బాటలో పనితీరు నిరాశపరచడంతో డిష్మన్ కార్బొజెన్ కౌంటర్ సైతం బోర్లా పడింది. మరోపక్క స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో మరో 36 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో టీమ్‌లీజ్ సర్వీసెస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ మూడు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. టీమ్‌లీజ్ సర్వీసెస్ అదనంగా 36.17 శాతం వాటాను సొంతం చేసుకోవడం ద్వారా స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో వాటాను 76.37 శాతానికి పెంచుకున్నట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. దీంతో స్కూల్‌గురును అనుబంధ సంస్థగా మార్చుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టీమ్‌లీజ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం దిగజారి రూ. 2,140ను తాకింది. ప్రస్తుతం 5.2 శాతం నష్టంతో రూ. 2172 దిగువన ట్రేడవుతోంది. జూబిలెంట్ లైఫ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైన నేపథ్యంలో మూడో రోజూ జూబిలెంట్ లైఫ్ కౌంటర్ బోర్లా పడింది. దీనికితోడు సీఎఫ్‌వో అలోక్ వైష్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. రాజీనామాను ఆమోదించినట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో జూబిలెంట్ లైఫ్ షేరు ప్రస్తుతం 5.2 శాతం క్షీణించి రూ. 711 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 686 వరకూ జారింది. గత మూడు రోజుల్లో ఈ షేరు 17 శాతం నీరసించడం గమనార్హం! డిష్మన్ కార్బొజెన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో డిష్మన్ కార్బొజెన్ ఎమిక్స్ రూ. 21.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 34.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం క్షీణించి రూ. 474 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో డిష్మన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 171 దిగువన ఫ్రీజయ్యింది. -
సన్ ఫార్మా స్పీడ్- హెచ్‌సీసీ బోర్లా
కోవిడ్-19 నేపథ్యంలో దేశీయంగా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు రికవరీ బాట పట్టాక హెల్త్‌కేర్ రంగ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో నిర్మాణ రంగ కంపెనీ హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సన్ ఫార్మా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్‌సీసీ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది మార్చి మూడో వారంలో రూ. 315 వద్ద కనిష్టాన్ని తాకిన హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా షేరు తదుపరి లాభపడుతూ వస్తోంది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 560 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 564 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! వెరసి గత ఐదు నెలల్లో 76 శాతం దూసుకెళ్లింది. వన్‌టైమ్ చార్జీల కారణంగా ఈ ఏడాది క్యూ1లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భారీ నష్టం ప్రకటించినప్పటికీ.. మార్జిన్లు మెరుగుపరచుకోవడం, స్పెషాలిటీ ప్రొడక్టుల విక్రయాలను నిలుపుకోవడం వంటి సానుకూల అంశాలు ఈ కౌంటర్‌కు బలాన్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. హెచ్‌సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌సీసీ రూ. 406 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(201920) క్యూ1లో రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2815 కోట్ల నుంచి రూ. 1690 కోట్లకు క్షీణించింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌సీసీ షేరు 6 శాతం పతనమై రూ. 6.30 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌కల్లా ఈ కౌంటర్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి 2.5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
ఐషర్ మోటార్స్ స్పీడ్- మిండా.. స్కిడ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ 60 పాయింట్లవరకూ ఎగసింది. కాగా.. షేర్ల విభజనకు రికార్డ్ డేట్ తదుపరి దేశీ ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభంకానుండటంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఐషర్ లాభాలతో సందడి చేస్తుంటే.. మిండా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ షేర్ల విభజనకు రికార్డ్ డేట్(25) కావడంతో ఐషర్ మోటార్స్ కౌంటర్ ఎక్స్ స్ప్లిట్‌కు చేరింది. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుతఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 2,387ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 2,320 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా(10:1) విభజిస్తున్న విషయం విదితమే. షేరు ధర భారీగా పెరిగిన కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండే విధంగా కంపెనీ షేర్ల విభజనను చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా ఈ కౌంటర్లో లిక్విడిటీ పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. మిండా ఇండస్ట్రీస్ మంగళవారం(25) నుంచి రైట్స్ ఇష్యూ ప్రారంభంకానున్న నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమై రూ. 326కు చేరింది. ప్రస్తుతం 3.2 శాతం క్షీణతతో రూ. 332 దిగువన ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మిండా ఇండస్ట్రీస్ రూ. 53 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 5 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 73 శాతం పడిపోయి రూ. 228 కోట్లకు పరిమితమైంది. కాగా.. సెప్టెంబర్ 8న ముగియనున్న రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 250 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
వా టెక్- వీమార్ట్.. దూకుడు చూడతరమా!
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున ఎగశాయి. కాగా.. నిధుల సమీకరణ ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించడంతో ఇంజినీరింగ్ దిగ్గజం వా టెక్ వాబాగ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోపక్క.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్థంలో మెరుగైన పనితీరు సాధించగలదన్న అంచనాల నేపథ్యంలో రిటైల్ చైన్ స్టోర్ల సంస్థ వీమార్ట్ రిటైల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. వా టెక్ వాబాగ్ లిమిటెడ్ కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా నిధులను సమీకరించే ప్రణాళికలు వేసినట్లు నీటి శుద్ది కంపెనీ వా టెక్ వాబాగ్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం అంటే 25న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్ దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం వా టెక్ షేరు దాదాపు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 220 వద్ద ట్రేడవుతోంది. వీమార్ట్ రిటైల్ లిమిటెడ్ రెండు రోజులుగా జోరు చూపుతున్న వీమార్ట్ రిటైల్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 2,142 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 2,244 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో వీమార్ట్ రిటైల్ రూ. 34 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్ ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. కంపెనీ స్టోర్లలో మూడో వంతు మాత్రమే నిర్వహణలో ఉండటం, ఫుట్‌ఫాల్స్ 87 శాతం పడిపోవడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పెరగడం, సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం, పటిష్ట బ్యాలన్స్‌షీట్ వంటి అంశాలతో ఇకపై కంపెనీ గాడిన పడగలదన్న అంచనాలు వెల్లడించింది. -
బటర్‌ఫ్లై గంధిమతి- కేఎన్ఆర్.. రయ్రయ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఫలితాలు నిరాశపరచినప్పటికీ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ తయారీ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) కాలంలో పటిష్ట పనితీరు చూపిన మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బటర్‌ఫ్లై గంధిమతి అప్లయెన్సెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో బటర్‌ఫ్లై గంధిమతి రూ. 8.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 2.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు సైతం 50 శాతం క్షీణించి రూ. 77 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బటర్‌ఫ్లై గంధిమతి షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 152 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 157 వరకూ ఎగసింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 47 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 522 కోట్లను అధిగమించింది. పన్నుకుముందు లాభం 5 శాతం బలపడి రూ. 59 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 242ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 238 వద్ద ట్రేడవుతోంది. -
బాలకృష్ణ - గ్రీవ్స్ కాటన్.. రివర్స్ గేర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆఫ్‌రోడ్ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇంజిన్ల తయారీ దిగ్గజం గ్రీవ్స్ కాటన్ కౌంటర్లో సైతం అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలా పడ్డాయి. వివరాలు చూద్దాం.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ నికర లాభం 26 శాతం క్షీణించి రూ. 132 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం నీరసించి రూ. 943 కోట్లకు చేరింది. ఇబిటా 10 శాతం వెనకడుగుతో రూ. 240 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 1310 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1306 వరకూ నీరసించింది. గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్రీవ్స్ కాటన్ రూ. 31 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 68 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 27 కోట్ల నిర్వహణ నష్టం ప్రకటించింది. గత క్యూ1లో రూ. 58 కోట్ల ఇబిటా నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ కాటన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం పతనమై రూ. 84 దిగువన ట్రేడవుతోంది. -
ఐషర్ మోటార్స్- 3ఎం ఇండియా.. క్యూ1 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం 3ఎం ఇండియా కౌంటర్ బలహీనపడింది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించడంతో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ కౌంటర్లో సైతం అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. కోవిడ్-19 కట్టడికి లాక్డౌన్ల అమలు కారణంగా క్యూ1లో ఈ కంపెనీల పనితీరు మందగించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 3ఎం ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో 3ఎం ఇండియా రూ. 40 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 85 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 748 కోట్ల నుంచి రూ. 327 కోట్లకు పడిపోయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం రూ. 42.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3ఎం ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.5 శాతం పతనమై రూ. 20,915 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 20,800 వరకూ తిరోగమించింది. ఐషర్ మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఐషర్ మోటార్స్ రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 452 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2382 కోట్ల నుంచి రూ. 818 కోట్లకు భారీగా క్షీణించింది. ఇబిటా రూ. 614 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 20,810 వద్ద ట్రేడవుతోంది. -
భారత్ ఫోర్జ్- అశోక్ లేలాండ్.. యమస్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినప్పటికీ ఆటో రంగ దిగ్గజం అశోక్ లేలాండ్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవుల అమలు కారణంగా పనితీరు నిరాశపరచినప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. భారత్ ఫోర్జ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో భారత్ ఫోర్జ్ రూ. 127 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 172 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2373 కోట్ల నుంచి రూ. 1199 కోట్లకు బలహీనపడింది. ఇటీవల దేశ, విదేశీ మార్కెట్లలో స్వల్ప రికవరీ పరిస్థితులు కనిపిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 482 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490 వరకూ ఎగసింది. అశోక్ లేలాండ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అశోక్ లేలాండ్ రూ. 389 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 275 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 6588 కోట్ల నుంచి రూ. 1486 కోట్లకు భారీగా క్షీణించింది. అయితే ఇటీవల డిమాండ్ బలపడుతున్నదని, దీంతో క్యూ2, క్యూ3లో అమ్మకాలు పెరిగే వీలున్నదని కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 60 వద్ద ట్రేడవుతోంది. -
ఇన్ఫో ఎడ్జ్ క్విప్ షురూ- షేరు జూమ్
ఇంటర్నెట్ ఫ్రాంచైజీ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్ ధరగా ఒక్కో షేరుకి రూ. 3177.18ను కంపెనీ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా.. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు జూన్ 22న జరిగిన సమావేశంలోనే ఇన్ఫో ఎడ్జ్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు.. తాజాగా క్విప్ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆన్లైన్ క్లాసిఫైడ్ విభాగాలు.. నౌకరీ.కామ్, 99ఏకర్స్.కామ్, జీవన్సాథీ.కామ్, శిక్షా.కామ్‌ను కంపెనీ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇన్ఫోఎడ్జ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 3420ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 3395 వద్ద ట్రేడవుతోంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 20.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019-20) క్యూ1లో రూ. 90 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 89 శాతం పడిపోయి రూ. 72 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ఎన్ఎస్ఈలో 2.7 శాతం క్షీణించి రూ. 906 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 892 వరకూ పతనమైంది. -
మహాసీమ్‌లెస్- హావెల్స్‌కు ఫలితాల దెబ్బ
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఓవైపు కార్బన్, అల్లాయ్ పైపుల తయారీ కంపెనీ మహారాష్ట్ర సీమ్‌లెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో పనితీరు నిరాశపరచడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ దిగ్గజం హావెల్స్ ఇండియా కౌంటర్ సైతం డీలా పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాల మార్కెట్లోనూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. మహారాష్ట్ర సీమ్‌లెస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో మహారాష్ట్ర సీమ్‌లెస్ రూ. 235 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో నమోదైన నష్టం రూ. 70 కోట్లకంటే ఇది మూడు రెట్లు అధికంకాగా.. నికర అమ్మకాలు సైతం 39 శాతం క్షీణించి రూ. 588 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీమ్‌లెస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం పతనమై రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 201 వరకూ నీరసించింది. కాగా.. వాటాదారులకు కంపెనీ షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండ్ చెల్లించనుంది. హావెల్స్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన హావెల్స్ ఇండియా నికర లాభం 64 శాతం పడిపోయి రూ. 64 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 45 శాతం క్షీణించి రూ. 1483 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 49 శాతం వెనకడుగుతో రూ. 164 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 575 వద్ద ట్రేడవుతోంది. -
దేనా బ్యాంక్ లాభాలు ఫట్...షేరు లాభాల్లో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగం బ్యాంకు దేనా బ్యాంక్ తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో ఏకంగా రూ. 279 కోట్లమేర నికర నష్టాలు ప్రకటించింది. గత(2015-16) క్యూ1లో రూ. 15 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ 2,907.35 కోట్లకు తగ్గింది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ 2,914.87 కోట్లు. మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.98 శాతం నుంచి 11.88 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా 6.35 శాతం నుంచి 7.65 శాతానికి ఎగశాయి. మొండిబకాయిలకు ప్రొవిజన్లు రూ. 325 కోట్ల నుంచి ఏకంగా రూ. 665 కోట్లకు జంప్‌చేశాయి. ఫలితాలు నిరాశ పరచినప్పటికీ పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ కౌంటర్ కూడా లాభపడింది. బీఎస్ఈలో దేనా బ్యాంక్ షేరు 3 శాతం బలపడి రూ. 37.30కు చేరింది.