ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ 60 పాయింట్లవరకూ ఎగసింది. కాగా.. షేర్ల విభజనకు రికార్డ్ డేట్ తదుపరి దేశీ ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభంకానుండటంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఐషర్ లాభాలతో సందడి చేస్తుంటే.. మిండా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..
ఐషర్ మోటార్స్
షేర్ల విభజనకు రికార్డ్ డేట్(25) కావడంతో ఐషర్ మోటార్స్ కౌంటర్ ఎక్స్ స్ప్లిట్‌కు చేరింది. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుతఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 2,387ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 2,320 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా(10:1) విభజిస్తున్న విషయం విదితమే. షేరు ధర భారీగా పెరిగిన కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండే విధంగా కంపెనీ షేర్ల విభజనను చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా ఈ కౌంటర్లో లిక్విడిటీ పెరిగే వీలున్నట్లు తెలియజేశారు.
మిండా ఇండస్ట్రీస్
మంగళవారం(25) నుంచి రైట్స్ ఇష్యూ ప్రారంభంకానున్న నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమై రూ. 326కు చేరింది. ప్రస్తుతం 3.2 శాతం క్షీణతతో రూ. 332 దిగువన ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మిండా ఇండస్ట్రీస్ రూ. 53 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 5 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 73 శాతం పడిపోయి రూ. 228 కోట్లకు పరిమితమైంది. కాగా.. సెప్టెంబర్ 8న ముగియనున్న రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 250 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment