గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఓవైపు కార్బన్, అల్లాయ్ పైపుల తయారీ కంపెనీ మహారాష్ట్ర సీమ్‌లెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో పనితీరు నిరాశపరచడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ దిగ్గజం హావెల్స్ ఇండియా కౌంటర్ సైతం డీలా పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాల మార్కెట్లోనూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం..
మహారాష్ట్ర సీమ్‌లెస్
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో మహారాష్ట్ర సీమ్‌లెస్ రూ. 235 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో నమోదైన నష్టం రూ. 70 కోట్లకంటే ఇది మూడు రెట్లు అధికంకాగా.. నికర అమ్మకాలు సైతం 39 శాతం క్షీణించి రూ. 588 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీమ్‌లెస్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం పతనమై రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 201 వరకూ నీరసించింది. కాగా.. వాటాదారులకు కంపెనీ షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండ్ చెల్లించనుంది.
హావెల్స్ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన హావెల్స్ ఇండియా నికర లాభం 64 శాతం పడిపోయి రూ. 64 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 45 శాతం క్షీణించి రూ. 1483 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 49 శాతం వెనకడుగుతో రూ. 164 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం పతనమై రూ. 575 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment