havells India
-
హావెల్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ గూడ్స్, అప్లయెన్సెస్ దిగ్గజం హావెల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ. 287 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 243 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,292 కోట్ల నుంచి రూ. 4,899 కోట్లకు బలపడింది. కన్జూమర్ డిమాండ్ బలహీనపడటంతోపాటు.. వాతావరణం సహకరించకపోవడంతో బీటూసీ బిజినెస్ సైతం ప్రభావితమైనట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ రాయ్ గుప్తా పేర్కొన్నారు. అయితే బీటూబీ, లాయిడ్ విభాగాలు మెరుగైన పనితీరు చూపినట్లు వెల్లడించారు. తాజా సమీక్షా కాలంలో హావెల్స్ ఇండియా కేబుల్ బిజినెస్ 24 శాతం ఎగసి రూ. 1,485 కోట్లను తాకగా.. స్విచ్గేర్స్ ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 541 కోట్లకు చేరింది. ౖ ఫలితాల నేపథ్యంలో హావెల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,348 వద్ద ముగిసింది. -
వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2023 అపర కుబేరుల ప్లేస్‌లో మూడో స్థానంలో నిలిచిన ఇండియాలో కొత్తగా 16 మంది కొత్త బిలియనీర్లు చోటు దక్కించు కున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. ఈ మేటి మహిళల్లో ఒకరు వినోద్ రాయ్ గుప్తా.రూ. 33 వేల కోట్ల నికర విలువతో భారతదేశంలో 4వ అత్యంత సంపన్న మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) హావెల్స్ ఇండియా అధినేత వినోద్ రాయ్ దేశీయ నాల్గవ సంపన్న మహిళ. మొత్తం సంపన్నుల జాబితాలో 40 వ స్థానం. హావెల్స్ ఇండియాలో ఈమెకు 40 శాతం వాటా ఉంది. హావెల్స్ ఇండియాను 1958లో వినోద్ రాయ్ గుప్తా దివంగత భర్త ఖిమత్ రాయ్ గుప్తా స్థాపించారు. ఇప్పుడు అతని కుమారుడు అనిల్ రాయ్ గుప్తా ప్రస్తుతం హావెల్స్ ఇండియా చైర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. హావెల్స్ ఇండియా ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ ఫిక్చర్ల నుండి ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల వరకు ప్రతిదీ తయారు చేస్తుంది. హావెల్స్‌కు 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని ఉత్పత్తులు ఇప్పుడు 50కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. క్విమత్ రాయ్ గుప్తా 10వేల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రికల్ బిజినెస్ ప్రారంభించగా ఇపుడు వారి కుమారుడు అనిల్ రాయ్ గుప్తా నాయకత్వంలో రూ. 74,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో వ్యాపార రంగంలో రాణిస్తోంది. (జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!) ఫోర్బ్స్ తన వార్షిక బిలియనీర్ల జాబితాలను 2023 ఏప్రిల్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితా కూడా ఉంది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ దేశీయంగా, ఆసియా రెండింటిలోనూ టాప్ ప్లేస్‌లో నిలవగా, అత్యంత ధనవంతుడుగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం, భారతదేశంలోని ఐదుగురు సంపన్న మహిళలు సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా ఝన్‌ఝన్‌వాలా, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ ఉన్నారు. -
హావెల్స్ ఇండియా లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 302 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం వృద్ధితో రూ. 3,679 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 3,238 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం ఎగసి రూ. 3,274 కోట్లకు చేరాయి. కమోడిటీ ధరల కారణంగా వ్యయాలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ రాయ్ గుప్తా పేర్కొన్నారు. కేబుళ్ల విభాగం అమ్మకాలు రూ. 1,359 కోట్లను దాటగా.. స్విచ్ గేర్ల నుంచి రూ. 488 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. ఇక మొత్తం ఆదాయంలో ఎలక్ట్రికల్ కన్జూమర్ గూడ్స్ నుంచి రూ. 773.5 కోట్లు, లైటింగ్ తదితరాల నుంచి రూ. 402 కోట్లు చొప్పున లభించినట్లు వెల్లడించారు. లాయిడ్ కన్జూమర్ అమ్మకాలు రూ. 420 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 1,248 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హావెల్స్ రికార్డ్- అశోక్ లేలాండ్ అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ హావెల్స్ ఇండియా కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ అక్టోబర్ నెలలో అమ్మకాలు జోరందుకోవడంతో ఆటో రంగ కంపెనీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హావెల్స్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హావెల్స్ ఇండియా నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 325 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ. 2,452 కోట్లకు చేరింది. ఇబిటా 79 శాతం ఎగసి రూ. 421 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 6.7 శాతం బలపడి 17.2 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 816 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 827 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడింది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 51,000 కోట్లను అధిగమించింది. అశోక్ లేలాండ్ ఈ అక్టోబర్ నెలలో అశోక్ లేలాండ్ 1 శాతం అధికంగా 9,989 వాహనాలను విక్రయించింది. ఇందుకు ఎల్‌సీవీలు, ట్రక్కుల విక్రయాలలో 14 శాతం నమోదైన వృద్ధి సహకరించింది. అయితే మధ్య, భారీస్థాయి వాహన విక్రయాలు 11 శాతం క్షీణించాయి. అయితే నెలవారీగా చూస్తే మొత్తం అమ్మకాల పరిమాణం 20 శాతం వృద్ధి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎల్‌సీవీలు, వాణిజ్య వాహనాలకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో కంపెనీ 8,344 యూనిటన్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం బలపడి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 87.5కు చేరువైంది. గత మూడు నెలల్లో ఈ షేరు 72 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
మహాసీమ్‌లెస్- హావెల్స్‌కు ఫలితాల దెబ్బ
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఓవైపు కార్బన్, అల్లాయ్ పైపుల తయారీ కంపెనీ మహారాష్ట్ర సీమ్‌లెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో పనితీరు నిరాశపరచడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ దిగ్గజం హావెల్స్ ఇండియా కౌంటర్ సైతం డీలా పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాల మార్కెట్లోనూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. మహారాష్ట్ర సీమ్‌లెస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో మహారాష్ట్ర సీమ్‌లెస్ రూ. 235 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో నమోదైన నష్టం రూ. 70 కోట్లకంటే ఇది మూడు రెట్లు అధికంకాగా.. నికర అమ్మకాలు సైతం 39 శాతం క్షీణించి రూ. 588 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీమ్‌లెస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం పతనమై రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 201 వరకూ నీరసించింది. కాగా.. వాటాదారులకు కంపెనీ షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండ్ చెల్లించనుంది. హావెల్స్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన హావెల్స్ ఇండియా నికర లాభం 64 శాతం పడిపోయి రూ. 64 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 45 శాతం క్షీణించి రూ. 1483 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 49 శాతం వెనకడుగుతో రూ. 164 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 575 వద్ద ట్రేడవుతోంది. -
హావెల్స్ ఇండియా నుంచి కొత్త వాటర్ ప్యూరిఫయర్లు
న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల తయారీ కంపెనీ హావెల్స్ ఇండియా కొత్త రేంజ్ వాటర్ ప్యూరిఫైర్లను మార్కెట్లోకి తెచ్చింది. నీటిలో పీహెచ్ బ్యాలన్స్‌ను కొనసాగిస్తూ, అవసరమైన ఖనిజాలను జత చేస్తూ, శుద్ధమైన నీటిని అందించడం ఈ వాటర్ ప్యూరిఫైర్ల ప్రత్యేకత అని హావెల్స్ ఇండియా తెలిపింది. దేశంలో చాలా తక్కువ మంది వాటర్ ప్యూరిఫైర్లను వినియోగిస్తున్నారని, ఇది అత్యంత అవసరమైన వస్తువని హావెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ్ చెప్పారు. ప్రస్తుతం హరిద్వార్ ప్లాంట్‌లో ఏడాదికి 5 లక్షల వాటర్ ప్యూరిఫైర్లను తయారు చేస్తున్నామని తెలిపారు. వార్షిక తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు–పది లక్షల యూనిట్లకు పెంచనున్నామని వివరించారు. ప్రస్తుతం ఆరు రకాలైన వాటర్ ప్యూరిఫైర్లను రూ.10,499 నుంచి రూ.23,999 రేంజ్ ధరల్లో ఈ కంపెనీ అందిస్తోంది. -
హావెల్స్ ఇండియా లాభం 171 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసే హావెల్స్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.171 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.146 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు గత క్యూ2లో రూ.1,559 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,777 కోట్లుగా ఉన్నాయని కంపెనీ సీఎండీ అనిల్ రాయ్ గుప్తా తెలియజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాయిడ్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కన్సూమర్ డ్యూరబుల్ బిజినెస్‌ను కొనుగోలు చేసినందున ఈ క్యూ2 ఫలితాలను, గత క్యూ2 ఫలితాలతో పోల్చు డానికి లేదని వెల్లడించారు. ఎలక్ట్రికల్ ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు అధికంగా ఉన్నందున డిమాండ్ తక్కువగా ఉందని తెలిపారు. ఇక కేబుల్ వ్యాపార ఆదాయం రూ.569 కోట్లుగా, ఎలక్ట్రికల్ కన్సూమర్ డ్యూరబుల్ వ్యాపార ఆదాయం రూ.322 కోట్లుగా, స్విచ్గేర్స్ ఆదాయం రూ.330 కోట్లుగా, లైటింగ్ అండ్ ఫిక్చర్స్ ఆదాయం రూ.287 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సోమవారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.564ను తాకిన హావెల్స్ షేర్ చివరకు 1% లాభంతో రూ.542 వద్ద ముగిసింది. -
దక్షిణాదిలో హావెల్స్ తొలి ప్లాంట్
♦ 50 ఎకరాల్లో బెంగళూరులో ఏర్పాటు ♦ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ♦ స్మార్ట్ సొల్యూషన్స్ విభాగంలోకి ప్రవేశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ విభాగంలో ఉన్న హావెల్స్ ఇండియా... దక్షిణాదిలో తన తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడితో బెంగళూరు శివార్లలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 50 ఎకరాల్లో రానున్న ఈ ప్లాంట్‌లో స్మార్ట్ ఉపకరణాలను తయారు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి సింగిల్ విండో విధానంలో ప్లాంట్ నిర్మాణ అనుమతులు కూడా మంజూరైనట్లు తెలియవచ్చింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 3 వేల మందికి నేరుగా ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం హావెల్స్ సంస్థ హావెల్స్, క్యాబ్ట్రీ, స్టాండర్డ్, సిల్వేనియా బ్రాండ్ల పేరిట ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, మోటార్లు, స్విచ్చులు.. ఇలా 17 రకాల వ్యాపార విభాగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రస్తుతం హావెల్స్ సంస్థకు 7 ప్రాంతాల్లో 12 ప్లాంట్లున్నాయి. దేశంలో హరిద్వార్, బద్ది, నోయిడా, సాహిబాబాద్, ఫరీదాబాద్, అల్వార్, నిమ్రానా ప్రాంతాల్లో తయారీ యూనిట్లున్నాయి. గతేడాది మార్చి నాటికి హావెల్స్ ఇండియా రూ.8 వేల కోట్ల టర్నోవర్‌ను చేరుకుంది. స్మార్ట్ సొల్యూషన్ విభాగంలోకి... ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు హావెల్స్ ఇండియా ప్రకటించింది. అంటే మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రికల్ ఉపకరణాలను నియంత్రించే వీలుంటుందన్నమాట. హావెల్స్ బ్రాండ్లలో ఒకటైన క్యాబ్ట్రీ ఉపకరణాలతో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నామని, డొమెస్టిక్, కమర్షియల్ రెండు విభాగంల్లోనూ ఇవి లభ్యమవుతాయని హావెల్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ యాదవ్ శుక్రవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రముఖ ఆటోమేషన్ కంపెనీ హెచ్డీఎల్తో ఒప్పందం చేసుకొని ఈ ఉపకరణాలను తయారు చేస్తున్నట్లు చెప్పారాయన. ‘‘దేశంలో మొత్తం ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ పరిశ్రమ విలువ వార్షికంగా రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంది. దీన్లో 10 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే రూ.100 కోట్ల ఆదాయం ఆర్జించాలనేది ఈ ఏడాది మా లక్ష్యం’’ అని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకునే ఉపకరణాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ పంకజ్, ఆటోమేషన్ ప్రొడక్ట్స్ హెడ్ మనీశ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.