న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసే హావెల్స్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.171 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.146 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ తెలిపింది.
నికర అమ్మకాలు గత క్యూ2లో రూ.1,559 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,777 కోట్లుగా ఉన్నాయని కంపెనీ సీఎండీ అనిల్ రాయ్ గుప్తా తెలియజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాయిడ్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కన్సూమర్ డ్యూరబుల్ బిజినెస్‌ను కొనుగోలు చేసినందున ఈ క్యూ2 ఫలితాలను, గత క్యూ2 ఫలితాలతో పోల్చు డానికి లేదని వెల్లడించారు.
ఎలక్ట్రికల్ ఉత్పత్తులపై జీఎస్‌టీ రేట్లు అధికంగా ఉన్నందున డిమాండ్ తక్కువగా ఉందని తెలిపారు. ఇక కేబుల్ వ్యాపార ఆదాయం రూ.569 కోట్లుగా, ఎలక్ట్రికల్ కన్సూమర్ డ్యూరబుల్ వ్యాపార ఆదాయం రూ.322 కోట్లుగా, స్విచ్‌గేర్స్ ఆదాయం రూ.330 కోట్లుగా, లైటింగ్ అండ్ ఫిక్చర్స్ ఆదాయం రూ.287 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సోమవారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.564ను తాకిన హావెల్స్ షేర్ చివరకు 1% లాభంతో రూ.542 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment