దక్షిణాదిలో హావెల్స్ తొలి ప్లాంట్
♦ 50 ఎకరాల్లో బెంగళూరులో ఏర్పాటు
♦ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి
♦ స్మార్ట్ సొల్యూషన్స్ విభాగంలోకి ప్రవేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ఉన్న హావెల్స్ ఇండియా... దక్షిణాదిలో తన తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడితో బెంగళూరు శివార్లలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 50 ఎకరాల్లో రానున్న ఈ ప్లాంట్‌లో స్మార్ట్ ఉపకరణాలను తయారు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి సింగిల్ విండో విధానంలో ప్లాంట్ నిర్మాణ అనుమతులు కూడా మంజూరైనట్లు తెలియవచ్చింది.
ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 3 వేల మందికి నేరుగా ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం హావెల్స్ సంస్థ హావెల్స్, క్యాబ్‌ట్రీ, స్టాండర్డ్, సిల్వేనియా బ్రాండ్ల పేరిట ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, మోటార్లు, స్విచ్చులు.. ఇలా 17 రకాల వ్యాపార విభాగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రస్తుతం హావెల్స్ సంస్థకు 7 ప్రాంతాల్లో 12 ప్లాంట్లున్నాయి. దేశంలో హరిద్వార్, బద్ది, నోయిడా, సాహిబాబాద్, ఫరీదాబాద్, అల్వార్, నిమ్రానా ప్రాంతాల్లో తయారీ యూనిట్లున్నాయి. గతేడాది మార్చి నాటికి హావెల్స్ ఇండియా రూ.8 వేల కోట్ల టర్నోవర్‌ను చేరుకుంది.
స్మార్ట్ సొల్యూషన్ విభాగంలోకి...
ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు హావెల్స్ ఇండియా ప్రకటించింది. అంటే మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రికల్ ఉపకరణాలను నియంత్రించే వీలుంటుందన్నమాట. హావెల్స్ బ్రాండ్లలో ఒకటైన క్యాబ్‌ట్రీ ఉపకరణాలతో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నామని, డొమెస్టిక్, కమర్షియల్ రెండు విభాగంల్లోనూ ఇవి లభ్యమవుతాయని హావెల్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ యాదవ్ శుక్రవారమిక్కడ విలేకరులతో చెప్పారు.
ప్రముఖ ఆటోమేషన్ కంపెనీ హెచ్‌డీఎల్‌తో ఒప్పందం చేసుకొని ఈ ఉపకరణాలను తయారు చేస్తున్నట్లు చెప్పారాయన. ‘‘దేశంలో మొత్తం ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ పరిశ్రమ విలువ వార్షికంగా రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంది. దీన్లో 10 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే రూ.100 కోట్ల ఆదాయం ఆర్జించాలనేది ఈ ఏడాది మా లక్ష్యం’’ అని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకునే ఉపకరణాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ పంకజ్, ఆటోమేషన్ ప్రొడక్ట్స్ హెడ్ మనీశ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.