విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున ఎగశాయి. కాగా.. నిధుల సమీకరణ ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించడంతో ఇంజినీరింగ్ దిగ్గజం వా టెక్ వాబాగ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోపక్క.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్థంలో మెరుగైన పనితీరు సాధించగలదన్న అంచనాల నేపథ్యంలో రిటైల్ చైన్ స్టోర్ల సంస్థ వీమార్ట్ రిటైల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
వా టెక్ వాబాగ్ లిమిటెడ్
కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా నిధులను సమీకరించే ప్రణాళికలు వేసినట్లు నీటి శుద్ది కంపెనీ వా టెక్ వాబాగ్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం అంటే 25న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్ దూకుడు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం వా టెక్ షేరు దాదాపు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 220 వద్ద ట్రేడవుతోంది.
వీమార్ట్ రిటైల్ లిమిటెడ్
రెండు రోజులుగా జోరు చూపుతున్న వీమార్ట్ రిటైల్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 2,142 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 2,244 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో వీమార్ట్ రిటైల్ రూ. 34 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్ ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. కంపెనీ స్టోర్లలో మూడో వంతు మాత్రమే నిర్వహణలో ఉండటం, ఫుట్‌ఫాల్స్ 87 శాతం పడిపోవడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు ఎడిల్‌వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పెరగడం, సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం, పటిష్ట బ్యాలన్స్‌షీట్ వంటి అంశాలతో ఇకపై కంపెనీ గాడిన పడగలదన్న అంచనాలు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment