V-Mart Retail
-
పర్యావరణ పరిరక్షణకు వీమార్ట్ శ్రీకారం
ముంబై: ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ దేశవ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికత రూపంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. సీఎస్ఆర్ కార్యక్రమం కింద పర్యావరణ పరిరక్షణ, సామాజికాభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించామని పేర్కొంది. వాతావరణ మార్పుల సమస్యలకు దీర్ఘకాలం పాటు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం పరిష్కారమని కంపెనీ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. -
వీ–మార్ట్‌లో వినాయక చవితి ఆఫర్లు
హైదరాబాద్: ఫ్యాషన్ రిటైల్ సంస్థ వీ–మార్ట్... రాబోయే వినాయక చవితి సందర్భంగా గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో సహా ఒడిషా, కర్ణాటక, గోవా, పుణెల్లోని అన్ని వీ–మార్ట్ షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 19 నుంచే మొదలైన ఈ పండుగ ఆఫర్లు.. నెలాఖరుదాకా కొనసాగనున్నాయి. రూ.3 వేల కొనుగోలుపై రూ.1,500 డిస్కౌంట్ వోచర్, హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 7.5% వరకు తక్షణ డిస్కౌంట్లను ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
వా టెక్- వీమార్ట్.. దూకుడు చూడతరమా!
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున ఎగశాయి. కాగా.. నిధుల సమీకరణ ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించడంతో ఇంజినీరింగ్ దిగ్గజం వా టెక్ వాబాగ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోపక్క.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్థంలో మెరుగైన పనితీరు సాధించగలదన్న అంచనాల నేపథ్యంలో రిటైల్ చైన్ స్టోర్ల సంస్థ వీమార్ట్ రిటైల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. వా టెక్ వాబాగ్ లిమిటెడ్ కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా నిధులను సమీకరించే ప్రణాళికలు వేసినట్లు నీటి శుద్ది కంపెనీ వా టెక్ వాబాగ్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం అంటే 25న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్ దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం వా టెక్ షేరు దాదాపు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 220 వద్ద ట్రేడవుతోంది. వీమార్ట్ రిటైల్ లిమిటెడ్ రెండు రోజులుగా జోరు చూపుతున్న వీమార్ట్ రిటైల్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 2,142 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 2,244 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో వీమార్ట్ రిటైల్ రూ. 34 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్ ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. కంపెనీ స్టోర్లలో మూడో వంతు మాత్రమే నిర్వహణలో ఉండటం, ఫుట్‌ఫాల్స్ 87 శాతం పడిపోవడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పెరగడం, సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం, పటిష్ట బ్యాలన్స్‌షీట్ వంటి అంశాలతో ఇకపై కంపెనీ గాడిన పడగలదన్న అంచనాలు వెల్లడించింది. -
నిత్యావసరాలకు ఆందోళన వద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు నిత్యావసర వస్తువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. విక్రేతల వద్ద సరిపడ నిల్వ ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) తెలిపింది. స్పెన్సర్, వీ–మార్ట్ వంటి కొన్ని కొన్ని సంఘటిత రిటైలర్లు పలు రకాల సరుకుల మీద నియంత్రణ పెట్టారని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో సరుకుల సరఫరా మీద ప్రభావం ఉందని స్పెన్సర్ రిటైల్ ఎండీ దేవేంద్ర చావ్లా తెలిపారు. ‘ప్రస్తుతం మా స్టోర్లలో నిత్యావసరాల పూర్తి స్థాయి స్టాక్ ఉంది. కొన్ని రకాల బ్రాండ్ల తయారీ సంస్థలతో మాట్లాడుతున్నాం. త్వరలోనే అవి కూ డా అందుబాటులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. కొనుగోళ్ల మీద నియంత్రణ.. గ్రాసరీల నిల్వ సరిపడా ఉన్నా సరే ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్ అండ్ గ్రాసరీ స్టోర్ చెయిన్ ఈజీడే క్లబ్, వీ–మార్ట్ కొనుగోళ్ల మీద నియంత్రణ పెట్టాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని వీ–మార్ట్ స్లోర్టలోనూ సరుకుల కొరత లేదని, వినియోగదారులు కొనుగోలు మీద నియంత్రణ పెట్టామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్ అండ్ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. ఉదాహరణకు బియ్యం 20 కిలోలు, పిండి 10 కిలోలు, పప్పు దినుసులు 4 కిలోలు, బిస్కెట్స్ 12 ప్యాకెట్లు, చక్కెర 5 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది. బిగ్ బజార్ స్టోర్లలో ఎలాంటి నియంత్రణ లేదని తెలిపింది. కార్మికుల కొరత.. ఫ్యాక్టరీలలో కార్మికుల కొరత, సరుకుల రవాణా వాహనాల లభ్యత ప్రధాన సవాళ్లుగా మారాయని హెచ్‌యూఎల్, ఐటీసీ, డాబర్ ఇండియా, పార్లే, జీసీపీఎల్, జ్యోతి ల్యాబ్స్ వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. వచ్చే 2–3 వారాల పాటు సరిపడే నిత్యావసరాల నిల్వ ఉందని, ఆ తర్వాత తయారీ ప్లాంట్ల కార్యకలాపాలకు, ఆయా ఉత్పత్తుల సరఫరా వాహన అనుమతులకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాయి. ‘లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని ప్లాంట్ల ఉత్పత్తి మీద ప్రభావం పడింది. అయినా ఇతరత్రా మార్గాల ద్వారా రోజువారీ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత చర్యలు తీసుకుంటున్నాం’ అని హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాటక్ తెలిపారు. ముడిసరుకుల వాహనాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సప్లయి ఆగిందని డాబర్ ఇండియా ఆపరేషన్స్ ఈడీ షారుఖ్ ఖాన్ తెలిపారు. స్థానిక ప్రభుత్వం అనుమతితో కొద్ది మంది కార్మికులతో నిత్యావసర సరుకుల తయారీ ప్లాంట్లలో మాత్రం ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నామని, పూర్తి స్థాయి అనుమతులకు మరికొంత సమయం పట్టే సూచనలున్నాయని ఐటీసీ తెలిపింది. ఉత్పత్తులకు కొరత రాకుండా ప్రభుత్వ అనుమతులతో 50% కార్మికులు, షిఫ్ట్‌ల వారీగా ప్లాంట్ నిర్వహణ చేస్తున్నామని పార్లే తెలిపింది. దేశవ్యాప్తంగా 90 లక్షల ట్రక్స్ ఉండగా.. కేవలం 5% మాత్రమే నడుస్తున్నాయని ఆల్ ఇండియా మోటార్ టాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపింది. లాక్‌డౌన్‌తో డ్రైవర్ల కొరతతోపాటూ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికుల కొరత ఉందని పేర్కొంది. ఉబెర్ ద్వారా ఇంటికి సరుకులు ట్యాక్సీ సేవల్లో ఉన్న ఉబెర్ తన కస్టమర్లకు కావాల్సిన సరుకులను డెలివరీ చేయనుంది. బిగ్‌బాస్కెట్‌తో ఈ మేరకు చేతులు కలిపింది. హైదరాబాద్ సహా బెంగళూరు, చండీగఢ్, నోయిడాలో ఈ సేవలను అందించనుంది. ద్విచక్ర వాహనాలు (ఉబర్ మోటో), కార్ల ద్వారా (ఉబెర్ గో, ఉబెర్ ఎక్స్ఎల్) సరుకులను వినియోగదార్ల ఇంటికే చేరవేస్తామని ఉబెర్ తెలిపింది. ఇటువంటి సేవల కోసం ఇతర సూపర్ మార్కెట్లు, ఫార్మాసీలతోనూ చర్చిస్తున్నట్టు వివరించింది. -
పబ్లిక్ ఇష్యూలు పండలేదు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది(2013) దేశీయ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా కేవలం రూ. 1,619 కోట్లను సమీకరించాయి. గత 12 ఏళ్లలోనే ఇది అతి తక్కువ మొత్తం కాగా, ఇందుకు మార్కెట్లలో ఏర్పడిన ఒడిదొడుకులు కారణంగా నిలిచాయి. ప్రైమ్‌డేటా బేస్ గణాంకాల ప్రకారం 2012లో 11 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 6,835 కోట్లను సమీకరించాయి. అయితే 2013లో మూడు కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1,619 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇంతక్రితం 2001లో మాత్రమే కంపెనీలు ఐపీవోల ద్వారా అతితక్కువగా రూ. 296 కోట్లను సమీకరించాయి. కాగా, 2010లో ఐపీవోల ద్వారా అత్యధికంగా రూ. 37,535 కోట్లను సమీకరించడం విశేషం! సమీపకాలంలో కష్టమే: సమీప కాలంలో ఐపీవో మార్కెట్ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో అనిశ్చితి కొనసాగడంతోపాటు, సెకండరీ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతుండటం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నదని వివరించారు. అయితే 915 కంపెనీలు భవిష్యత్‌లో ఐపీవో ద్వారా నిధులు సమీకరించాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుండటం విశేషమని చెప్పారు. ఈ బాటలో ఇప్పటికే 14 సంస్థలు రూ. 3,635 కోట్లను సమీకరించేందుకు సెబీ అనుమతిని పొందినట్లు వెల్లడించారు. ఇదే విధంగా మరో 10 కంపెనీలు రూ. 3,100 కోట్ల సమీకరణకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. జస్ట్ డయల్ సక్సెస్ ఐపీవో ద్వారా 2013లో జస్ట్ డయల్ రూ. 919 కోట్లను సమీకరించడంలో విజయవంతంకాగా, రెప్కో హోమ్ ఫైనాన్స్ రూ. 270 కోట్లు, వీమార్ట్ రిటైల్ రూ. 94 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇక మరోవైపు ఇదే కాలంలో 35 చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎస్ఎంఈలు) ఐపీవోల ద్వారా రూ. 335 కోట్లను వసూలు చేయగలిగాయి. సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ప్రధాన ఇండెక్స్‌లు ఒడిదొడుకులను చవిచూడటం, ప్రమోటర్ల వాటాలకు సరైన ధర లభించకపోవడం తదితర అంశాల నేపథ్యంలో నిజానికి గత మూడేళ్లలో ఐపీవోలకు మార్కెట్లు సహకరించలేదని ప్రణవ్ పేర్కొన్నారు. దీంతో అటు ప్రభుత్వం సైతం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోయిందని చెప్పారు. 35 ఎస్ఎంఈల పబ్లిక్ ఇష్యూలు అందుబాటులో లేకపోవడం, కేవలం మూడు ఇష్యూలే మార్కెట్లను తాకడం వంటి అంశాలు చిన్న ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేశాయని తెలిపారు.