పబ్లిక్ ఇష్యూలు పండలేదు | IPO Fund raising via IPOs hit lowest level in 12 yrs during 2013 | Sakshi
Sakshi News home page

పబ్లిక్ ఇష్యూలు పండలేదు

Published Fri, Jan 3 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

IPO Fund raising via IPOs hit lowest level in 12 yrs during 2013

న్యూఢిల్లీ: గడిచిన ఏడాది(2013) దేశీయ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా కేవలం రూ. 1,619 కోట్లను సమీకరించాయి. గత 12 ఏళ్లలోనే ఇది అతి తక్కువ మొత్తం కాగా, ఇందుకు మార్కెట్లలో ఏర్పడిన ఒడిదొడుకులు కారణంగా నిలిచాయి. ప్రైమ్‌డేటా బేస్ గణాంకాల ప్రకారం 2012లో 11 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 6,835 కోట్లను సమీకరించాయి. అయితే 2013లో మూడు కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1,619 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇంతక్రితం 2001లో మాత్రమే కంపెనీలు ఐపీవోల ద్వారా అతితక్కువగా రూ. 296 కోట్లను సమీకరించాయి. కాగా, 2010లో ఐపీవోల ద్వారా అత్యధికంగా రూ. 37,535 కోట్లను సమీకరించడం విశేషం!
 
 సమీపకాలంలో కష్టమే: సమీప కాలంలో ఐపీవో మార్కెట్ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో అనిశ్చితి కొనసాగడంతోపాటు, సెకండరీ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతుండటం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నదని వివరించారు. అయితే 915 కంపెనీలు భవిష్యత్‌లో ఐపీవో ద్వారా నిధులు సమీకరించాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుండటం విశేషమని చెప్పారు. ఈ బాటలో ఇప్పటికే 14 సంస్థలు రూ. 3,635 కోట్లను సమీకరించేందుకు సెబీ అనుమతిని పొందినట్లు వెల్లడించారు. ఇదే విధంగా మరో 10 కంపెనీలు రూ. 3,100 కోట్ల సమీకరణకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.  
 
 జస్ట్ డయల్ సక్సెస్
 ఐపీవో ద్వారా 2013లో జస్ట్ డయల్ రూ. 919 కోట్లను సమీకరించడంలో విజయవంతంకాగా, రెప్కో హోమ్ ఫైనాన్స్ రూ. 270 కోట్లు, వీమార్ట్ రిటైల్ రూ. 94 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇక మరోవైపు ఇదే కాలంలో 35 చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎస్‌ఎంఈలు) ఐపీవోల ద్వారా రూ. 335 కోట్లను వసూలు చేయగలిగాయి. సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ప్రధాన ఇండెక్స్‌లు ఒడిదొడుకులను చవిచూడటం, ప్రమోటర్ల వాటాలకు సరైన ధర లభించకపోవడం తదితర అంశాల నేపథ్యంలో నిజానికి గత మూడేళ్లలో ఐపీవోలకు మార్కెట్లు సహకరించలేదని ప్రణవ్ పేర్కొన్నారు. దీంతో అటు ప్రభుత్వం సైతం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోయిందని చెప్పారు. 35 ఎస్‌ఎంఈల పబ్లిక్ ఇష్యూలు అందుబాటులో లేకపోవడం, కేవలం మూడు ఇష్యూలే మార్కెట్లను తాకడం వంటి అంశాలు చిన్న ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేశాయని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement