ఐపీవో నిధుల సమీకరణ వీక్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పబ్లిక్ ఇష్యూల వేగం తగ్గింది. దీంతో 14 కంపెనీలు మాత్రమే లిస్టింగ్కురాగా.. కేవలం రూ. 35,456 కోట్లు సమీకరించాయి. గతేడాది తొలి అర్ధభాగంలో 25 ఇష్యూల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న రూ. 51,979 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు 32 శాతం క్షీణించాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాలివి.
నిజానికి మొత్తం నిధుల సమీకరణలో 58 శాతం వాటాను ఆక్రమించిన ఎల్ఐసీ ఇష్యూ(రూ. 20,557 కోట్లు)లేకుంటే ఈ సంఖ్య మరింత నిరుత్సాహకరంగా కనిపించేదని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. అయితే ప్రైమ్ గణాంకాల ప్రకారం ఇకపై ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇప్పటికే 71 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు అనుమతులు పొందాయి. తద్వారా రూ. 1,05,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. ఇవికాకుండా మరో 43 కంపెనీలు రూ. 70,000 కోట్ల పెట్టుబడుల కోసం సెబీని ఆశ్రయించాయి. అనుమతులు వెలువడవలసి ఉంది. మొత్తం ఈ జాబితాలో 10 న్యూఏజ్ టెక్నాలజీ కంపెనీలుకాగా.. రూ. 35,000 కోట్ల సమీకరణకు వేచి చూస్తున్నాయి.
ఈక్విటీ నిధులు సైతం డీలా
తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ సైతం 55 శాతం క్షీణించింది. రూ. 41,919 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో ఈక్విటీ మార్గంలో రూ. 92,191 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఎల్ఐసీని మినహాయిస్తే డెల్హివరి రూ. 5,235 కోట్లు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రూ. 1,581 కోట్లు సమకూర్చుకున్నాయి. 14 కంపెనీలలో డెల్హివరీ మాత్రమే న్యూఏజ్ టెక్ కంపెనీ కావడం గమనార్హం! పేటీఎమ్‌సహా కొన్ని ఇతర కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచడం ప్రభావం చూపింది. దీంతో 14 ఐపీవోలలో 4 కంపెనీలకు మాత్రమే 10 రెట్లు, అంతకుమించిన స్పందన లభించింది. ఈ కాలంలో కేవలం 41 కంపెనీలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. గతేడాది ఇదే సమయంలో 87 సంస్థలు సెబీని ఆశ్రయించాయి.
మరో 2 కంపెనీలు రెడీ
స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా రెండు కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. జాబితాలో ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్, ఉదయ్‌శివ్‌కుమార్ ఇన్ఫ్రా ఉన్నాయి. దీంతో ఈ నెల(సెప్టెంబర్)లో ఇప్పటివరకూ కొత్తగా 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టినట్లయ్యింది. కాగా.. ఐపీవోలో భాగంగా ఎన్విరో ఇన్ఫ్రా 95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇక ఉదయ్‌శివకుమార్ ఇన్ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రెండు సంస్థలూ వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనున్నాయి. ప్రభుత్వం తదితర సంస్థలకు చెందిన నీటిపారుదల పథకాలు, వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ సేవలు ఎన్విరో అందిస్తోంది. ఉదయ్‌శివకుమార్ రహదారుల నిర్మాణంలో కార్యకలాపాలు కలిగి ఉంది. తదితరాల నిర్మాణం, నిర్వహణలను ఎన్విరో చేపడుతోంది. రోడ్లు, బ్రిడ్జిలు, ఇరిగేషన్, కాలువలు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం తదితరాలను చేపడుతోంది.