హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో వినియోగదారులు నిత్యావసర వస్తువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. విక్రేతల వద్ద సరిపడ నిల్వ ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) తెలిపింది. స్పెన్సర్, వీ–మార్ట్ వంటి కొన్ని కొన్ని సంఘటిత రిటైలర్లు పలు రకాల సరుకుల మీద నియంత్రణ పెట్టారని ఆర్‌ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సరుకుల సరఫరా మీద ప్రభావం ఉందని స్పెన్సర్ రిటైల్ ఎండీ దేవేంద్ర చావ్లా తెలిపారు. ‘ప్రస్తుతం మా స్టోర్లలో నిత్యావసరాల పూర్తి స్థాయి స్టాక్ ఉంది. కొన్ని రకాల బ్రాండ్ల తయారీ సంస్థలతో మాట్లాడుతున్నాం. త్వరలోనే అవి కూ డా అందుబాటులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు.
కొనుగోళ్ల మీద నియంత్రణ..
గ్రాసరీల నిల్వ సరిపడా ఉన్నా సరే ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్ అండ్ గ్రాసరీ స్టోర్ చెయిన్ ఈజీడే క్లబ్, వీ–మార్ట్ కొనుగోళ్ల మీద నియంత్రణ పెట్టాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని వీ–మార్ట్ స్లోర్టలోనూ సరుకుల కొరత లేదని, వినియోగదారులు కొనుగోలు మీద నియంత్రణ పెట్టామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్ అండ్ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. ఉదాహరణకు బియ్యం 20 కిలోలు, పిండి 10 కిలోలు, పప్పు దినుసులు 4 కిలోలు, బిస్కెట్స్ 12 ప్యాకెట్లు, చక్కెర 5 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది. బిగ్ బజార్ స్టోర్లలో ఎలాంటి నియంత్రణ లేదని తెలిపింది.
కార్మికుల కొరత..
ఫ్యాక్టరీలలో కార్మికుల కొరత, సరుకుల రవాణా వాహనాల లభ్యత ప్రధాన సవాళ్లుగా మారాయని హెచ్‌యూఎల్, ఐటీసీ, డాబర్ ఇండియా, పార్లే, జీసీపీఎల్, జ్యోతి ల్యాబ్స్ వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. వచ్చే 2–3 వారాల పాటు సరిపడే నిత్యావసరాల నిల్వ ఉందని, ఆ తర్వాత తయారీ ప్లాంట్ల కార్యకలాపాలకు, ఆయా ఉత్పత్తుల సరఫరా వాహన అనుమతులకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాయి. ‘లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని ప్లాంట్ల ఉత్పత్తి మీద ప్రభావం పడింది. అయినా ఇతరత్రా మార్గాల ద్వారా రోజువారీ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత చర్యలు తీసుకుంటున్నాం’ అని హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాటక్ తెలిపారు.
ముడిసరుకుల వాహనాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సప్లయి ఆగిందని డాబర్ ఇండియా ఆపరేషన్స్ ఈడీ షారుఖ్ ఖాన్ తెలిపారు. స్థానిక ప్రభుత్వం అనుమతితో కొద్ది మంది కార్మికులతో నిత్యావసర సరుకుల తయారీ ప్లాంట్లలో మాత్రం ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నామని, పూర్తి స్థాయి అనుమతులకు మరికొంత సమయం పట్టే సూచనలున్నాయని ఐటీసీ తెలిపింది. ఉత్పత్తులకు కొరత రాకుండా ప్రభుత్వ అనుమతులతో 50% కార్మికులు, షిఫ్ట్‌ల వారీగా ప్లాంట్ నిర్వహణ చేస్తున్నామని పార్లే తెలిపింది. దేశవ్యాప్తంగా 90 లక్షల ట్రక్స్ ఉండగా.. కేవలం 5% మాత్రమే నడుస్తున్నాయని ఆల్ ఇండియా మోటార్ టాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపింది. లాక్‌డౌన్‌తో డ్రైవర్ల కొరతతోపాటూ లోడింగ్, అన్‌లోడింగ్ చేసే కార్మికుల కొరత ఉందని పేర్కొంది.
ఉబెర్ ద్వారా ఇంటికి సరుకులు
ట్యాక్సీ సేవల్లో ఉన్న ఉబెర్ తన కస్టమర్లకు కావాల్సిన సరుకులను డెలివరీ చేయనుంది. బిగ్‌బాస్కెట్‌తో ఈ మేరకు చేతులు కలిపింది. హైదరాబాద్ సహా బెంగళూరు, చండీగఢ్, నోయిడాలో ఈ సేవలను అందించనుంది. ద్విచక్ర వాహనాలు (ఉబర్ మోటో), కార్ల ద్వారా (ఉబెర్ గో, ఉబెర్ ఎక్స్‌ఎల్) సరుకులను వినియోగదార్ల ఇంటికే చేరవేస్తామని ఉబెర్ తెలిపింది. ఇటువంటి సేవల కోసం ఇతర సూపర్ మార్కెట్లు, ఫార్మాసీలతోనూ చర్చిస్తున్నట్టు వివరించింది.
నిత్యావసరాలకు ఆందోళన వద్దు
Published Fri, Apr 3 2020 5:09 AM | Last Updated on Fri, Apr 3 2020 5:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment