ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆఫ్‌రోడ్ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇంజిన్ల తయారీ దిగ్గజం గ్రీవ్స్ కాటన్ కౌంటర్‌లో సైతం అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలా పడ్డాయి. వివరాలు చూద్దాం..
బాలకృష్ణ ఇండస్ట్రీస్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ నికర లాభం 26 శాతం క్షీణించి రూ. 132 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం నీరసించి రూ. 943 కోట్లకు చేరింది. ఇబిటా 10 శాతం వెనకడుగుతో రూ. 240 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.5 శాతం పతనమై రూ. 1310 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1306 వరకూ నీరసించింది.
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్రీవ్స్ కాటన్ రూ. 31 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 68 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 27 కోట్ల నిర్వహణ నష్టం ప్రకటించింది. గత క్యూ1లో రూ. 58 కోట్ల ఇబిటా నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ కాటన్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.2 శాతం పతనమై రూ. 84 దిగువన ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment