Voda Idea FY 2021-22 Q1 Result: న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 7,319 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 25,460 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. అయితే మొత్తం ఆదాయం 14 శాతం క్షీణించి రూ. 9,152 కోట్లను తాకింది.
గత క్యూ1లో వీఐ రూ. 10,659 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇక జూన్‌కల్లా మొత్తం రుణ భారం రూ. 1,91,590 కోట్లకు చేరింది. దీనిలో వాయిదా పడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,06,010 కోట్లుకాగా.. రూ. 62,180 కోట్లమేర ఏజీఆర్ సంబంధ బకాయిలున్నాయి. అయితే ఇదే సమయంలో FY 2021-22కు గానూ కంపెనీ చేతిలో నగదు, తత్సంబంధ నిల్వలు రూ. 920 కోట్లుగా ఉన్నాయి.
తగ్గిన సబ్‌స్క్రయిబర్లు, పెరిగిన..
ఈ కేలండర్ ఏడాది(2021) ముగిసేలోగా రూ. 4,000 కోట్లమేర వ్యయాల్లో పొదుపును సాధించాలని వొడాఫోన్ ఐడియా లక్ష్యంగా పెట్టుకుంది. విశేషం ఏంటంటే.. జూన్‌కల్లా దీనిలో 70 శాతాన్ని సాధించినట్లు ప్రకటించింది. గతేడాది క్యూ1లో నమోదైన 27.98 కోట్లమంది సబ్‌స్క్రయిబర్ల సంఖ్య.. తాజాగా 25.54 కోట్లకు క్షీణించింది. 4జీ వినియోగదారుల సంఖ్య మాత్రం 10.46 కోట్ల మంది 11.29 కోట్లకు బలపడింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) రూ. 114 నుంచి రూ. 104కు తగ్గినట్లు ప్రకటించుకుంది వీఐ.
Comments
Please login to add a commentAdd a comment