సాక్షి, జనగామ: వంట గ్యాస్ వినియోగదారులపై మళ్లీ భారం పెరిగింది. సబ్సిడీ ముసుగులో అసలు ధరలను పెంచేస్తూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నారు. సబ్సిడీ గ్యాస్‌కు మంగళం పాడే ప్రయత్నంలో భాగంగానే ధరల పెరుగుదల కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో వరుసగా ఐదుసార్లు సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం.. నిప్పు పెట్టకుండానే మంటను వెలిగించేలా చేస్తోంది. గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్‌పై రూ.58.50, కమర్షియల్ గ్యాస్‌పై రూ.87 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్తగా అమలులోకి వచ్చిన ధరలపై అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వినియోగదారులపై నెలకు రూ. 31.50 లక్షలకు పైగా అదనపు భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరో పక్క ధరలను పెంచేస్తూ.. వాటిని అటెకెక్కించే విధంగా మారుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని 13 మండలాల పరిధిలో హెచ్‌పీ, భారత్, ఐఓసీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలు పది ఉన్నాయి. బచ్చన్నపేట, పెంబర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, గుండాల పరిధిలో 98 వేల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు 400 వరకు వినియోగిస్తున్నారు. ఇందులో ప్రతి నెల 55 వేల కుటుంబాలు సబ్సిడీ గ్యాస్‌ను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్‌లో ఒక్కో సిలిండర్‌పై రూ.300కు పైగా పెంచారు. 2018 అక్టోబర్‌లో అసలుకు కొసరుగా వడ్డన చేశారు. పెరుగుతున్న ధరల ఆధారంగా గ్యాస్‌పై వచ్చే సబ్సిడీ సొమ్మును వినియోగదారుల ఖాతాలకు నేరుగా డిపాజిట్ చేస్తున్నారు. అయినప్పటికీ సామాన్య కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోవడంతో గతంలో రూ.70 లక్షల భారం పడింది. కొత్తగా అమలులోకి వచ్చిన ధరలతో మరో రూ.31.50 లక్షలు పెరిగింది.
సబ్సిడీ వస్తుంది..అసలు ఎలా?
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతుండడంతో..అసలు నగదు కోసం పేద కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.697 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. నవంబర్‌లో రూ.790.50 కి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్ ధర రూ.880 ఉండగా.. రూ.330 సబ్సిడీ అందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చు తగ్గుల కారణంతో ఈ నెల మొదటి వారంలో ఒక్కో సిలిండర్‌పై 58.50 రూపాయలు వడ్డించడంతో రూ.938.50కి చేరుకుంది. సిలిండర్ ధర వెయ్యికి దగ్గర కావడంతో.. చేసేది లేక కట్టెల పొయ్యిలే మేలు అనుకునే దయనీయ పరిస్థితి నెలకొంది. సిలిండర్‌కు రూ.938.50 కాకుండా, నేరుగా రూ. 513.50 విక్రయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెలతో పోలిస్తే సిలిండర్‌పై రూ.2.33 నామమాత్రంగా పెరిగినా..అసలు కష్టంగా మారుతోంది. సబ్సిడీ గ్యాస్‌కు స్వస్తి పలికేందుకే.. ధరలను పెంచుతూ కేంద్రం ముందస్తు హెచ్చరికలను చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
కమర్షియల్’పై కత్తి..
కిరోసిన్, బట్టీ పొయ్యిలకు స్వస్తి పలికి హోటళ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడుతున్నారు. నెలనెల పెరుగుతున్న కమర్షియల్ ధరలతో లాభాలు తగ్గిపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రూ.1,280 పలికిన కమర్షియల్ సిలిండర్ ధర నవంబర్ 2వ తేదీ నుంచి రూ.1427.50కి పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రికార్డు స్థాయిలో రూ.147 పెరిగిన ధరలతో గప్‌చుప్, హోటళ్లు, టీ స్టాళ్ల యజమానులు ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోయారు. మళ్లీ ధరలకు రెక్కలు రావడంతో చాలా మంది కూలి పనుల కోసం వలస బాట పట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రూ.1563 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర..రూ.87 పెంచడంతో రూ.1650కి చేరుకుంది. మరో నాలుగు నెలల్లోనే సిలిండర్ ధర రూ.2 వేలుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించాలని జిలాప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అమల్లోకి పెరిగిన ధరలు
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్‌పై పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ.938.50, కమర్షియల్ రూ.1650 పెరిగింది. సిలిండర్‌పై రూ.425 సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. – కాశీనాథ్, భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి, జనగామ
పేదల నడ్డి విరుస్తున్న కేంద్రం..
సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ ధరలను తరచూ పెంచడం ఘోరం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. సబ్సిడీ పేరుతో గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ.. మరో పక్క నడ్డి విరిచే కార్యక్రమం పెట్టుకుంది. అసలు డబ్బులు లేవని పేదలు మొత్తుకుంటే.. సబ్సిడీ సొమ్ము ఖాతాలో జమచేస్తామనడం బాధాకరం. – ధర్మపురి శ్రీనివాస్, జనగామ
ధరలను తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనలో భాగంగానే ఇలా చేస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే గ్యాస్‌ను రూ.వెయ్యికి చేరువ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతున్న కేంద్రం.. చివరకు గ్యాస్ ధరలు పెంచుతూ నడ్డి విరుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. – కొత్తపల్లి సమ్మయ్య, జనగామ
Comments
Please login to add a commentAdd a comment