Gas Authority of India Limited
-
మూడు రెట్లు పెరగనున్న గ్యాస్ వినియోగం
న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా 174 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్ (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను వినియోగిస్తుండగా.. 2030 నాటికి 550 ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుందని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ తెలిపారు. ఈటీఎనర్జీ వరల్డ్ గ్యాస్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నికరంగా సున్నా స్థాయికి తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుద్ధమైన, తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనున్నట్టు రంగనాథన్ చెప్పారు. ‘‘ప్రధాన ఇంధనాల మిశ్రమం నుంచి బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పుడు స్పష్టమైన విధాన మార్గదర్శకత్వం ఉంది. నికర సున్నా స్థాయికి ఉద్గారాలను తగ్గించడంలో గ్యాస్‌తోపాటు బ్లూ హైడ్రోజన్, అమ్మోనియా గొప్ప పాత్రను పోషించబోతున్నాయి’’ అని చెప్పారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను ప్రస్తుతమున్న 6.2 శాతం నుంచి 2030 నాటికి 15 శాతానికి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశీయంగా పెరగనున్న ఉత్పత్తి ‘‘ప్రస్తుత 174 ఎంఎంఎస్‌సీఎండీ డిమాండ్‌లో ఎక్కువ భాగం ఫెర్టిలైజర్ ప్లాంట్లు, పట్టణ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లు, విద్యుత్ యూనిట్ల నుంచే వస్తోంది. ఇందులో 49 ఎంఎంఎస్‌సీఎండీ దేశీయంగా ఉత్పత్తి అవుతుంటే, మిగిలినది ఎల్ఎన్జీ దిగుమతుల రూపంలో సమకూర్చుకుంటున్నాం. 2029–30 నాటికి దేశీయంగానే సరఫరా 380ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుంది’’ అని రంగనాథన్ వివరించారు. -
దిగుబండ..
సాక్షి, జనగామ: వంట గ్యాస్ వినియోగదారులపై మళ్లీ భారం పెరిగింది. సబ్సిడీ ముసుగులో అసలు ధరలను పెంచేస్తూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నారు. సబ్సిడీ గ్యాస్‌కు మంగళం పాడే ప్రయత్నంలో భాగంగానే ధరల పెరుగుదల కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో వరుసగా ఐదుసార్లు సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం.. నిప్పు పెట్టకుండానే మంటను వెలిగించేలా చేస్తోంది. గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్‌పై రూ.58.50, కమర్షియల్ గ్యాస్‌పై రూ.87 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్తగా అమలులోకి వచ్చిన ధరలపై అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వినియోగదారులపై నెలకు రూ. 31.50 లక్షలకు పైగా అదనపు భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరో పక్క ధరలను పెంచేస్తూ.. వాటిని అటెకెక్కించే విధంగా మారుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలో హెచ్‌పీ, భారత్, ఐఓసీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలు పది ఉన్నాయి. బచ్చన్నపేట, పెంబర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, గుండాల పరిధిలో 98 వేల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు 400 వరకు వినియోగిస్తున్నారు. ఇందులో ప్రతి నెల 55 వేల కుటుంబాలు సబ్సిడీ గ్యాస్‌ను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్‌లో ఒక్కో సిలిండర్‌పై రూ.300కు పైగా పెంచారు. 2018 అక్టోబర్‌లో అసలుకు కొసరుగా వడ్డన చేశారు. పెరుగుతున్న ధరల ఆధారంగా గ్యాస్‌పై వచ్చే సబ్సిడీ సొమ్మును వినియోగదారుల ఖాతాలకు నేరుగా డిపాజిట్ చేస్తున్నారు. అయినప్పటికీ సామాన్య కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోవడంతో గతంలో రూ.70 లక్షల భారం పడింది. కొత్తగా అమలులోకి వచ్చిన ధరలతో మరో రూ.31.50 లక్షలు పెరిగింది. సబ్సిడీ వస్తుంది..అసలు ఎలా? సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతుండడంతో..అసలు నగదు కోసం పేద కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.697 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. నవంబర్‌లో రూ.790.50 కి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్ ధర రూ.880 ఉండగా.. రూ.330 సబ్సిడీ అందించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చు తగ్గుల కారణంతో ఈ నెల మొదటి వారంలో ఒక్కో సిలిండర్‌పై 58.50 రూపాయలు వడ్డించడంతో రూ.938.50కి చేరుకుంది. సిలిండర్ ధర వెయ్యికి దగ్గర కావడంతో.. చేసేది లేక కట్టెల పొయ్యిలే మేలు అనుకునే దయనీయ పరిస్థితి నెలకొంది. సిలిండర్‌కు రూ.938.50 కాకుండా, నేరుగా రూ. 513.50 విక్రయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెలతో పోలిస్తే సిలిండర్‌పై రూ.2.33 నామమాత్రంగా పెరిగినా..అసలు కష్టంగా మారుతోంది. సబ్సిడీ గ్యాస్‌కు స్వస్తి పలికేందుకే.. ధరలను పెంచుతూ కేంద్రం ముందస్తు హెచ్చరికలను చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కమర్షియల్’పై కత్తి.. కిరోసిన్, బట్టీ పొయ్యిలకు స్వస్తి పలికి హోటళ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడుతున్నారు. నెలనెల పెరుగుతున్న కమర్షియల్ ధరలతో లాభాలు తగ్గిపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రూ.1,280 పలికిన కమర్షియల్ సిలిండర్ ధర నవంబర్ 2వ తేదీ నుంచి రూ.1427.50కి పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రికార్డు స్థాయిలో రూ.147 పెరిగిన ధరలతో గప్‌చుప్, హోటళ్లు, టీ స్టాళ్ల యజమానులు ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోయారు. మళ్లీ ధరలకు రెక్కలు రావడంతో చాలా మంది కూలి పనుల కోసం వలస బాట పట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రూ.1563 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర..రూ.87 పెంచడంతో రూ.1650కి చేరుకుంది. మరో నాలుగు నెలల్లోనే సిలిండర్ ధర రూ.2 వేలుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించాలని జిలాప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమల్లోకి పెరిగిన ధరలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్‌పై పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ.938.50, కమర్షియల్ రూ.1650 పెరిగింది. సిలిండర్‌పై రూ.425 సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. – కాశీనాథ్, భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి, జనగామ పేదల నడ్డి విరుస్తున్న కేంద్రం.. సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ ధరలను తరచూ పెంచడం ఘోరం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. సబ్సిడీ పేరుతో గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ.. మరో పక్క నడ్డి విరిచే కార్యక్రమం పెట్టుకుంది. అసలు డబ్బులు లేవని పేదలు మొత్తుకుంటే.. సబ్సిడీ సొమ్ము ఖాతాలో జమచేస్తామనడం బాధాకరం. – ధర్మపురి శ్రీనివాస్, జనగామ ధరలను తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనలో భాగంగానే ఇలా చేస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే గ్యాస్‌ను రూ.వెయ్యికి చేరువ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతున్న కేంద్రం.. చివరకు గ్యాస్ ధరలు పెంచుతూ నడ్డి విరుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. – కొత్తపల్లి సమ్మయ్య, జనగామ -
సంసారంలో నా పాత్ర... ఇడ్లీ పాత్రేనా?
ఉత్త(మ)పురుష నేనేం చెప్పబోయినా... మా శ్రీవారు చెప్పే ఒకే ఒక మాట... ‘‘నీకేం తెలియదు నువ్వూరుకో’’. మా వారే కాదు... ఈ లోకంలో చాలా మంది శ్రీవార్ల బజ్ వర్డ్ ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’. అవును... ఒప్పుకుంటాను. మా ఆయన ఆలోచనలన్నీ ఉదాత్తమైనవే. ఆయన దృక్పథాలన్నీ ఉన్నతమైనవే. కోనసీమలో ప్రమాదం జరగగానే అందులో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ల నిర్లక్ష్యం ఉందా లేదా? పాపం... ఆ మృతులకు బాధ్యులెవరు? ఈ అంశాలన్నింటిపైనా వాళ్ల ఫ్రెండ్స్ మధ్య హోరాహోరీ చర్చ జరుగుతుంటుంది. ఈ తీవ్రస్థాయి వాదోపవాదాలు సరే... ప్రతి నెలా గ్యాస్‌పైన బాదుడు ఉంటుందట... ఆ మేరకు మన ఆదాయం పెంపుదల ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే ఆ అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి అన్న విషయంపై ఎందుకు చర్చ జరగదు? ఒక్కోసారి ఆ ఫ్రెండ్స్ శ్రుతి మించి కీచులాడుకుంటుంటారు. కానీ చివరకు మిగిలేదేమిటి? అన్నం తింటే నిరపకారమైన భుక్తాయాసమైనా ఉంటుంది. కానీ ఈ వాదులాటల తర్వాత అపార్థ అపకారాల ఆవేశకావేశాలు మాత్రం మిగులుతాయి. నేనడిగే ఏ ప్రశ్నకూ మావారి దగ్గర సమాధానం ఉండదు. పెళ్లయి పుష్కరం దాటింది, మన దగ్గర మిగిలిందేమిటి? ఠక్కున ఎవరో వచ్చి చాలా చీప్‌గా ఏ ఐదారు లక్షలకో మంచి స్థలాన్ని ఆఫర్ చేస్తున్నారంటే తీసుకోగలరా? సొంతింటి కల ఎప్పటికైనా నెరవేర్చగలరా? బుజ్జిది ఎదిగొస్తోంది. రేపు ఇంటర్ తర్వాత ఏడాదికి లక్ష చొప్పున ఫీజు కట్టగలిగే స్థోమత ఎప్పటికైనా వస్తుందా? లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నాలో ఉద్భవిస్తుంటాయి. కానీ ఆయన మదిలోకి ఇవెందుకు రావు. ఆయనకు వచ్చే అద్భుత, అమోఘ, అత్యుత్తమ, ఉదాత్త ఆలోచనలకు బదులుగా ఈ చిన్న చిన్న సందేహాలు వస్తే మా జీవితం ఎంత బాగుంటుంది, ఎంతలా బాగుపడుతుంది! ఈ ప్రస్తావన ఏదైనా తెచ్చినప్పుడు మా శ్రీవారు చెప్పే స్టాక్ డైలాగ్ ఒక్కటే... ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’ అని. ఇవ్వాళ్ల టిఫిన్ కోసం ఇడ్లీ చేద్దామని డిసైడ్ చేశా. నేను లేవనెత్తిన భావాలూ, నాలో ఉద్భవించిన ప్రశ్నలన్నీ ఇడ్లీ పాత్ర కింద నీళ్లలా ఉడుకుతున్నాయి. ఇడ్లీ పాత్రలోని రేకు గుంటలో ఇడ్లీ పిండి పోస్తూ, అది గుంటకు అంటుకోకుండా ఉండటానికి వాయి వాయికీ నూనె రాస్తున్నా. ఇలా రాస్తూ ఉంటే నాకో ఆలోచన వచ్చింది. అవునూ... కుటుంబంలో నా పాత్ర ఏమిటి? నాలో మెదిలే భావాల్ని చూసుకుంటూ ఉంటే కుటుంబంలో నా పాత్ర... అచ్చం ఈ ఇడ్లీ పాత్ర లాగే ఉంది. అందరికీ ఇడ్లీ కావాలి. అందుకోసం ఇడ్లీ రేకులోని గుంటలో పిండి పోయాలి. కానీ ఆ పిండి మాత్రం గుంటకు అంటకూడదు. ఇదీ ఇడ్లీ తయారీ సిద్ధాంతం. నా జీవితమూ అంతేనేమో. నేనూ ఇడ్లీ పాత్రను. ఇడ్లీ రేకును. ఇడ్లీ తయారీ కోసం లాగా కాపురం నడవడానికి నేను కావాలి. కానీ నేనేదైనా ప్రశ్న అడగబోతే... ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’ అనే మాటను నూనెలా వాడతారు. ఆ నూనెను పూసి జారుకుంటారు, జారిపోతారు. కానీ నేను మావారిని అడగదలచుకున్న ప్రశ్నలన్నీ ఇడ్లీపాత్రలోని నీళ్లలా కాసేపు కుతకుత ఉడికి, ఆ తర్వాత ఆవిరిలా మారి, వంట పూర్తయ్యే సరికి ఇంకిపోతాయి. ఇక ఇడ్లీలన్నీ తయారయ్యాక దాన్ని కడిగేసి, ఇడ్లీ పాత్రను బోర్లేసి, రేకులన్నీ శుభ్రం చేసేసి మూల పెట్టేస్తాం. అంతే! మావారెప్పుడు మారుతారో, ఆర్జన అవసరం ఎప్పుడు తెలుసుకుంటారో, సంపాదనతో కుటుంబ జీవన ప్రమాణాలు ఎప్పుడు బాగుపరుస్తారో అప్పుడు నేనూ, మావారూ ఇడ్లీ రవ్వ, రుబ్బిన మినప్పిండీ అవుతాం. అది జరగనంతకాలం... ఈ కుటుంబంలో నా పాత్ర కేవలం ఇడ్లీ పాత్ర. అవును కేవలం ఇడ్లీ పాత్రే. - వై!