సంసారంలో నా పాత్ర... ఇడ్లీ పాత్రేనా?
ఉత్త(మ)పురుష
నేనేం చెప్పబోయినా... మా శ్రీవారు చెప్పే ఒకే ఒక మాట... ‘‘నీకేం తెలియదు నువ్వూరుకో’’. మా వారే కాదు... ఈ లోకంలో చాలా మంది శ్రీవార్ల బజ్ వర్డ్ ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’. అవును... ఒప్పుకుంటాను. మా ఆయన ఆలోచనలన్నీ ఉదాత్తమైనవే. ఆయన దృక్పథాలన్నీ ఉన్నతమైనవే. కోనసీమలో ప్రమాదం జరగగానే అందులో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ల నిర్లక్ష్యం ఉందా లేదా? పాపం... ఆ మృతులకు బాధ్యులెవరు? ఈ అంశాలన్నింటిపైనా వాళ్ల ఫ్రెండ్స్ మధ్య హోరాహోరీ చర్చ జరుగుతుంటుంది.
ఈ తీవ్రస్థాయి వాదోపవాదాలు సరే... ప్రతి నెలా గ్యాస్‌పైన బాదుడు ఉంటుందట... ఆ మేరకు మన ఆదాయం పెంపుదల ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే ఆ అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి అన్న విషయంపై ఎందుకు చర్చ జరగదు? ఒక్కోసారి ఆ ఫ్రెండ్స్ శ్రుతి మించి కీచులాడుకుంటుంటారు. కానీ చివరకు మిగిలేదేమిటి? అన్నం తింటే నిరపకారమైన భుక్తాయాసమైనా ఉంటుంది. కానీ ఈ వాదులాటల తర్వాత అపార్థ అపకారాల ఆవేశకావేశాలు మాత్రం మిగులుతాయి.
నేనడిగే ఏ ప్రశ్నకూ మావారి దగ్గర సమాధానం ఉండదు. పెళ్లయి పుష్కరం దాటింది, మన దగ్గర మిగిలిందేమిటి? ఠక్కున ఎవరో వచ్చి చాలా చీప్‌గా ఏ ఐదారు లక్షలకో మంచి స్థలాన్ని ఆఫర్ చేస్తున్నారంటే తీసుకోగలరా? సొంతింటి కల ఎప్పటికైనా నెరవేర్చగలరా? బుజ్జిది ఎదిగొస్తోంది. రేపు ఇంటర్ తర్వాత ఏడాదికి లక్ష చొప్పున ఫీజు కట్టగలిగే స్థోమత ఎప్పటికైనా వస్తుందా? లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నాలో ఉద్భవిస్తుంటాయి.
కానీ ఆయన మదిలోకి ఇవెందుకు రావు. ఆయనకు వచ్చే అద్భుత, అమోఘ, అత్యుత్తమ, ఉదాత్త ఆలోచనలకు బదులుగా ఈ చిన్న చిన్న సందేహాలు వస్తే మా జీవితం ఎంత బాగుంటుంది, ఎంతలా బాగుపడుతుంది! ఈ ప్రస్తావన ఏదైనా తెచ్చినప్పుడు మా శ్రీవారు చెప్పే స్టాక్ డైలాగ్ ఒక్కటే... ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’ అని.
ఇవ్వాళ్ల టిఫిన్ కోసం ఇడ్లీ చేద్దామని డిసైడ్ చేశా. నేను లేవనెత్తిన భావాలూ, నాలో ఉద్భవించిన ప్రశ్నలన్నీ ఇడ్లీ పాత్ర కింద నీళ్లలా ఉడుకుతున్నాయి. ఇడ్లీ పాత్రలోని రేకు గుంటలో ఇడ్లీ పిండి పోస్తూ, అది గుంటకు అంటుకోకుండా ఉండటానికి వాయి వాయికీ నూనె రాస్తున్నా. ఇలా రాస్తూ ఉంటే నాకో ఆలోచన వచ్చింది. అవునూ... కుటుంబంలో నా పాత్ర ఏమిటి? నాలో మెదిలే భావాల్ని చూసుకుంటూ ఉంటే కుటుంబంలో నా పాత్ర... అచ్చం ఈ ఇడ్లీ పాత్ర లాగే ఉంది.
అందరికీ ఇడ్లీ కావాలి. అందుకోసం ఇడ్లీ రేకులోని గుంటలో పిండి పోయాలి. కానీ ఆ పిండి మాత్రం గుంటకు అంటకూడదు. ఇదీ ఇడ్లీ తయారీ సిద్ధాంతం. నా జీవితమూ అంతేనేమో. నేనూ ఇడ్లీ పాత్రను. ఇడ్లీ రేకును. ఇడ్లీ తయారీ కోసం లాగా కాపురం నడవడానికి నేను కావాలి. కానీ నేనేదైనా ప్రశ్న అడగబోతే... ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’ అనే మాటను నూనెలా వాడతారు.
ఆ నూనెను పూసి జారుకుంటారు, జారిపోతారు. కానీ నేను మావారిని అడగదలచుకున్న ప్రశ్నలన్నీ ఇడ్లీపాత్రలోని నీళ్లలా కాసేపు కుతకుత ఉడికి, ఆ తర్వాత ఆవిరిలా మారి, వంట పూర్తయ్యే సరికి ఇంకిపోతాయి. ఇక ఇడ్లీలన్నీ తయారయ్యాక దాన్ని కడిగేసి, ఇడ్లీ పాత్రను బోర్లేసి, రేకులన్నీ శుభ్రం చేసేసి మూల పెట్టేస్తాం. అంతే!
మావారెప్పుడు మారుతారో, ఆర్జన అవసరం ఎప్పుడు తెలుసుకుంటారో, సంపాదనతో కుటుంబ జీవన ప్రమాణాలు ఎప్పుడు బాగుపరుస్తారో అప్పుడు నేనూ, మావారూ ఇడ్లీ రవ్వ, రుబ్బిన మినప్పిండీ అవుతాం. అది జరగనంతకాలం... ఈ కుటుంబంలో నా పాత్ర కేవలం ఇడ్లీ పాత్ర. అవును కేవలం ఇడ్లీ పాత్రే. - వై!